సన్నాలపై విముఖత

ABN , First Publish Date - 2020-05-16T10:13:14+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో అదనపు ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా నీటి లభ్యతపై

సన్నాలపై విముఖత

చీడపీడలు, పంట కాలం ఎక్కువ 

మద్దతు ధర లేకపోవడమూ కారణమే

ప్రభుత్వం కొనుగోలు చేస్తే సాగుకు రైతులు ముందుకు వచ్చే అవకాశం 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో అదనపు ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా నీటి లభ్యతపై భరోసా పెరుగడంతో వరి సాగు విస్తారంగా పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ఇప్పటికే వరి పండించడంలో అగ్రగామిగా ఉన్న కరీంనగర్‌ జిల్లాలో కూడా ఆమేరకు సాగు పెరుగనున్నది. జిల్లాలో వర్షాకాలం, యాసంగి పంటలను కలుపుకొని 4.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది.


ఇది మరో 50వేల ఎకరాలకు పెరిగే అవకాశం కూడా ఉన్నది. జిల్లాలో ప్రతి యేటా 10.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఇప్పటి అంచనాల ప్రకారం ఉత్పత్తి అయ్యే అవకాశమున్నది. జిల్లాలో వరిసాగు విస్తీర్ణంలో 80శాతం దొడ్డు రకాలనే సాగు చేస్తున్నారు. 20శాతం మాత్రమే సన్న రకాలు సాగవుతున్నది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సన్నరకం వరి సాగును పెంచాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాలో కూడా వరి సాగు విస్తీర్ణంలో 35 నుంచి 40శాతం సన్నరకాలను పెంచేలా చూడాలని వ్యవసాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. వానాకాలంలో 2 లక్షల 10వేల 250 ఎకరాలలో వరిసాగు జరుగుతుందని భావిస్తున్నారు.


ఇందులో తాజా నిర్ణయం ప్రకారం 74 వేల ఎకరాల నుంచి 84వేల ఎకరాల వరకు సన్న రకాలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న రకం వరిసాగుపై రైతులు విముఖత చూపిస్తున్నారు. ఎఫ్‌సీఐ ప్రభుత్వ మద్దతు ధరకు దొడ్డు రకాలను కొనుగోలు చేయడం, పంట కాలం తక్కువ, దిగువబడి కూడా ఎక్కువగా కావడంతో రైతులు దొడ్డురకాల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సన్నరకాల వరికి చీడపీడలు ఎక్కువై అదనంగా క్రిమిసంహారక మందులు వాడాల్సి వచ్చి పెట్టుబడులు పెరుగుతున్నాయి.


దిగుబడి కూడా దొడ్డురకాలతో పోల్చితే ఎకరాకు సుమారు 3 నుంచి 5 క్వింటాళ్లు తక్కువగా వస్తుంది. రాష్ట్రంలో సహకార సంఘాలు, ఐకేపీ సెంటర్లు, డీసీఎంఎస్‌ సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించి క్వింటాల్‌కు 1835 రూపాయలకు దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తోంది. వాటిని మరాడించి ఎఫ్‌సీఐకి బియ్యంగా సరఫరా చేస్తున్నారు. సన్న రకాలకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి మద్దతు ధర ఇవ్వడం లేదు. సన్న రకాలు పండించిన రైతులకు ప్రైవేట్‌గా ఒక్కోసారిగా 2వేల నుంచి 2,400 వరకు క్వింటాల్‌పై దర లభిస్తున్నది. ఆయా సందర్భాలలో రైతుకు కొంత లాభమే వచ్చినా ఇది జూదంగానే మారింది. చాలా సార్లు ప్రైవేట్‌ వ్యాపారులు, సన్న ధాన్యాన్ని కొనడానికి నిరాకరించడంతో దొడ్డు రకాల కంటే తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవలసిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.


దొడ్డు రకం వరి 110 నుంచి 120 రోజుల్లోగా కోతకు వస్తుండగా సన్న రకాలకు 130 నుంచి 150 రోజులు అవసరమవుతున్నది. దొడ్డు రకం ధాన్యం ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా సన్న రకం 25 నుంచి 30 క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తున్నది. అటు దిగుబడి తగ్గడం, ఇటు ధర లేక పోవడంతో రైతులు సన్న రకం వరిని పండించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వం దొడ్డు రకాలతోపాటు సన్నరకాలకు కూడా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసేందుకు హామీ ఇస్తే రైతులు వాటిని సాగు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశమున్నది. ప్రధానంగా సాంబమసూరి, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ సోనా, ఎంటీయు 1224 రకాలతోపాటు జై శ్రీరాం తదితర సన్న రకాలను ప్రజలు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. వీటిని ఎక్కువగా పండించి ఇతర ప్రాంతాలకు బియ్యం ఎగుమతి చేయడం ద్వారా రైతులకు ఆర్థిక పరిపుష్టి కలిగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే రైతులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. అవసరాల మేరకు మాత్రమే సన్న రకాలను సాగు చేసి కనీస గ్యారెంటీ ఉన్న దొడ్డురకాల సాగుపై మొగ్గుచూపిస్తున్నారు. 


క్వింటాల్‌కు రూ.2500 మద్ధతు ధర ప్రకటించాలి: గుజ్జుల తిరుపతిరెడ్డి, ఆదర్శరైతు, రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్‌

సన్నరకం వరి ధాన్యం సాగు చేయాలంటే ప్రభుత్వం ముందుగా తమ విధివిధానాలు ప్రకటించాలి. సన్న రకం పెట్టేందుకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. 2500 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తే తనకు ఉన్న ఏడు ఎకరాల్లో మొత్తం సన్న రకం సాగు చేస్తా. లేదంటే 5 ఎకరాల్లో దొడ్డు రకం, 2 ఎకరాల్లోసన్న రకం సాగు చేస్తా. 


Updated Date - 2020-05-16T10:13:14+05:30 IST