వలస బాలల విద్యా‘దీపం’!

ABN , First Publish Date - 2021-06-16T05:30:00+05:30 IST

‘‘సొంత ఊళ్ళ నుంచి జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్ళిన కుటుంబాలు ఎక్కడ కనిపించినా... వాళ్ళలో నన్ను నేను చూసుకుంటాను. భాష, సంస్కృతి పూర్తిగా వేరైన చోటుకు వెళ్ళి బతకాల్సి రావడం ఒక ఎత్తయితే, సరైన పని దొరక్క, పేదరికంలో కొట్టుమిట్టాడే దుర్భర స్థితి మరో ఎత్తు. ఈ ప్రభావం పిల్లల మీద

వలస బాలల విద్యా‘దీపం’!

బాధ్యతలు పట్టని తాగుబోతు తండ్రి... మానసిక స్థితి సరిగ్గాలేని తల్లి...

చుట్టూ చీకటిలా కమ్ముకున్న పేదరికం, నిస్సహాయత...

‘ఇలాంటి జీవితాల్ని మార్చే ఆయుధం చదువే!’ అంటారు దీపశిఖ.

ఈ కొవిడ్‌ కాలంలో... తనలాంటి వలస కార్మికుల పిల్లలకు ఆమె ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నారు. వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు.


‘‘సొంత ఊళ్ళ నుంచి జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్ళిన కుటుంబాలు ఎక్కడ కనిపించినా... వాళ్ళలో నన్ను నేను చూసుకుంటాను. భాష, సంస్కృతి పూర్తిగా వేరైన చోటుకు వెళ్ళి బతకాల్సి రావడం ఒక ఎత్తయితే, సరైన పని దొరక్క, పేదరికంలో కొట్టుమిట్టాడే దుర్భర స్థితి మరో ఎత్తు. ఈ ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. దానికి నేనే ఉదాహరణ’’ అంటారు దీపశిఖా దేవ్‌. వలస కార్మికుల పిల్లల్లో బడికి వెళ్ళే వారి సంఖ్య తక్కువ. కిందటి ఏడాది కరోనా మొదలైనప్పటి నుంచీ ఆ అరకొర చదువులకు కూడా నోచుకోని పిల్లలెందరో! అలాంటి పిల్లలకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నారు పంథొమ్మిదేళ్ళ దీపశిఖ. 


అలాంటి జీవితం రాకూడదని...

ఆమె కుటుంబం అసోంలోని మార్ఘెరిటా పట్టణం నుంచి కేరళలోని కన్నూర్‌కు వలస వచ్చింది. అప్పటికి దీపశిఖ వయసు ఆరు నెలలు. ‘‘నాకు ముగ్గురు అన్నలు. నేనే ఆఖరుదాన్ని. నా బాల్యంలో జ్ఞాపకాలంటే మా అమ్మా, నాన్నా మధ్య గొడవలే. మా నాన్న విపరీతంగా తాగేవాడు. ఇంటికి వచ్చి అమ్మతో గొడవ పడేవాడు. నిత్యం గృహహింసకు గురవడంతో మా అమ్మ మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు. కొన్నిసార్లు నాన్న మీద కోపాన్నీ, విసుగునూ మా మీద చూపించేది’’ అంటూ ఆనాటి రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘అలా పెరుగుతూ, లోకాన్ని చూస్తున్న కొద్దీ మా పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో నాకు క్రమంగా అర్థమయింది. మా అమ్మ అనుభవిస్తున్న జీవితంలాంటిది నాకు రాకూడదు. మరింత మెరుగ్గా, గౌరవంగా బతకాలంటే చదువొక్కటే మార్గమని తెలిసింది’’ అంటారామె. అప్పటి నుంచీ ఉన్నత విద్యనే ఆమె తన లక్ష్యం చేసుకున్నారు. ‘‘ఇంట్లో సరైన వాతావరణం లేకపోవడంతో... తెల్లవారుజామున మూడు గంటలకు లేచి చదువుకొనే దాన్ని. ఈలోగా, మా నాయనమ్మ మరణించిన వార్త రావడంతో మా నాన్న అసోం వెళ్ళారు. ఎన్నాళ్ళైనా తిరిగి రాలేదు. ఏం జరిగిందని వాకబు చేస్తే... స్మగ్లింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు అతనికి ఏడాదికి పైగా శిక్ష పడిందనీ, జైల్లో పెట్టారనీ తెలిసింది’’ అని చెప్పారు దీపశిఖ. 

ఇలాంటి అవకాశాల్ని ఊహించలేదు...

అలాంటి సమయంలో ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఒక రోజు ఆమె పాఠశాలను ఛైల్డ్‌ లైన్‌ అధికారులు సందర్శించారు. ‘బడిలో, ఇంట్లో పిల్లలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?’ అని వాకబు చేశారు. ‘‘నన్ను వాళ్ళు ప్రశ్నించినప్పుడు మా ఇంట్లో వాతావరణం గురించి చెప్పాను.


నాకు చదువుకోవాలని ఉందనీ, సాయం చెయ్యాలనీ అడిగాను. ‘కైరోస్‌ కన్నూర్‌’ అనే సంస్థ మా ప్రాంతంలో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అధికారుల సిఫార్సుతో... ‘కైరోస్‌ ఇండియా’ ద్వారా ‘కేరిటాస్‌ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ నా బాధ్యతను స్వీకరించింది. పిల్లల సంరక్షణ చూసే సాంత్వన భవన్‌లో నన్ను చేర్చారు’’ అన్నారు దీపశిఖ. అందులో చేరాక, తనలాంటి పిల్లలు ఎందరో ఆమెకు పరిచయమయ్యారు. వారి పరిస్థితులు తనకన్నా దుర్భరంగా ఆమెకు కనిపించాయి. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో... ఎస్సూరులోని హోలీమౌంట్‌లోకి మారారు. అక్కడే టెన్త్‌ పూర్తి చేశారు. ఆ తరువాత ఢిల్లీలో ప్లస్‌ 2 చదివే అవకాశాన్ని ఆమెకు ‘కేరిటాస్‌ ఇండియా’ కల్పించింది. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో బిఎ సంస్కృతం చదువుతున్నారు. ‘ఇలాంటి అవకాశాలు నాకు వస్తాయని ఊహించలేదు’ అంటున్న ఆమె రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ క్రీడాకారిణి కూడా. 




ఆ దిశలోనే నా ప్రయాణం

కిందటి ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో. ఢిల్లీ నుంచి కేరళకు వచ్చిన దీపశిఖ కొవిడ్‌ బాధితుల సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచీ కేరళలో పెరిగిన ఆమె మలయాళంతో పాటు మాతృభాష అస్సామీ, హిందీ, బెంగాలీ, ఆంగ్లం కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ఈ నేపథ్యంలో, వలస కార్మికుల సమస్యలపై సర్వే చేసే బాధ్యతను ఆమెకు ‘కేరిటాస్‌’ ఇండియా అప్పగించింది. ‘‘ఆ సర్వే సందర్భంగా వలస కార్మికులూ, వారి పిల్లల స్థితిగతులను మరింత దగ్గరగా చూశాను. ఆ పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. అందుకే ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాను.


దీనికి ‘కేరిటాస్‌’, ‘ కైరోస్‌ కన్నూర్‌’ సంస్థలు సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తున్నాయి’’ అని వివరించారు దీపశిఖ. ‘పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం, న్యూనతా భావాన్ని తొలగించడం, సమాజంతో ఎలా కలిసిపోవాలో, విద్య వల్ల ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చెప్పడం కూడా చదువులో భాగమే!’’ అంటారామె. కరోనా బారిన పడి, ఈ మధ్యే కోలుకున్న ఆమె రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ‘‘మనం జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళ తీవ్రతను తగ్గించే ఏకైక మార్గం చదువే. నా అన్నల్లో ఒకరు ఎంఫిల్‌ పూర్తి చేశారు. మరొకరు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. వాళ్ళు నాకు అండగా నిలబడుతున్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారిని కావాలనీ, నాలాంటి నేపథ్యం ఉన్నవారికి ఇంకా సాయపడాలనీ నా కోరిక. ఆ దిశగానే నా ప్రయాణాన్ని మలచుకుంటున్నాను’’ అని చెబుతున్న దీపశిఖ ఎందరో వలస కార్మికుల పిల్లలకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు.


‘‘మనం జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళ తీవ్రతను తగ్గించే ఏకైక మార్గం చదువే. ఎప్పటికైనా ఉన్నతాధికారిని కావాలనీ, నాలాంటి నేపథ్యం ఉన్నవారికి ఇంకా సాయపడాలనీ నా కోరిక. ఆ దిశగానే నా ప్రయాణాన్ని మలచుకుంటున్నాను’’ 

Updated Date - 2021-06-16T05:30:00+05:30 IST