May 17 2021 @ 01:31AM

దీపం కొండెక్కింది!

అతని మనసు దీపం, మైత్రి దీపం, మాట దీపం, పాట దీపం, తీరు దీపం, పేరు దీపం...ఎందరి హృదయాల్లోనో చిరునవ్వులతో స్నేహ దీపాలను వెలిగించిన ధీరుడు కరోనా పెనుగాలికి తలవంచి ఆకస్మికంగా నిష్క్రమించటంతో అంతటా అంధకారం అలుముకొంది. కవితాసతి మౌనంగా రోధించింది. 


అదృష్టదీపక్‌ ప్రత్యేకమైన పేరు. అతని జీవనశైలి కూడా అంత విలక్షణమైనదే. రామచంద్రాపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థి దశలో మొగ్గ తొడిగిన మా స్నేహం అతను తుదిశ్వాస విడిచేవరకూ పరిమళిస్తూనే ఉంది. అతని పూర్తి పేరు సత్తి అదృష్టదీప రామకృష్ణారెడ్డి. కమ్యూనిస్ట్‌ కుటుంబ నేపథ్యం నుంచి సంక్రమించిన అభ్యుదయ భావజాలంతో తన పేరును కుదించుకొని కవిగా ‘అదృష్టదీపక్‌’ పేరునే ఖాయం చేసుకున్నాడు. బాల్యంలోనే గాయకునిగా, నటునిగా సాహిత్యాభిలాషిగా అందరి దృష్టిని ఆకర్షించిన దీపక్‌ క్రమంగా ‘ఎర్రజెండాయే నా అజెండా’ అంటూ అభ్యుదయ కవిగా ముద్ర వేసుకున్నాడు. అరసం, ప్రజా నాట్యమండలి మొదలైన సంస్థలలో నిబద్ధత గల సభ్యునిగా, కార్యకర్తగా తన పాత్రను నిజాయితీగా నిర్వర్తించాడు. విద్యార్థి దశలోనే మహా కవి శ్రీశ్రీని అభిమానించిన అదృష్ట దీపక్‌ ఆయన రచించిన ‘కొంతమంది కుర్రవాళ్లు...’అనే గేయాన్ని సభల్లో సమావేశాల్లో వీరావేశంతో ఆలపించేవాడు. ‘నేటి భారతం’ చిత్రంలో శ్రీశ్రీ రచించిన ‘అర్థరాత్రి స్వతంత్రం అంధకార బంధురం’ అనే చివరి సినీగేయానికి సహాయకునిగా వుండి దానిని పూర్తి చేయించాడు. 


అదృష్టదీపక్‌ ప్రధానంగా అభ్యుదయకవి, నటుడు. రావులపాలెం సి.ఆర్‌.సి. రామవరం మూలారెడ్డి నాటక కళా పరిషత్‌ మొదలైన ఎన్నో పరిషత్‌ల నాటక పోటీలకు నిష్కళంకమైన న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. కోకిలమ్మ పదాలు, అగ్ని, ప్రాణం, అడవి కవితా సంపుటాలను, దీపకరాగం సాహితీ వ్యాస సంపుటిని వెలువరించిన అదృష్ట దీపక్‌ ఇటీవ లే ఒక కథల సంపుటిని, మరో వ్యాస సంకలనాన్ని కూడా సాహిత్యలోకానికి కానుకలుగా అందించాడు. ఏది రాసినా గీటుకు రావాలనే తపన గలిగిన దీపక్‌ దిగజారుతున్న సాహిత్యపు విలువల గురించి తరచుగా తన ఆవేదనను వ్యక్తం చేసేవాడు. 


విద్యార్థి దశ నుంచే తెలుగు భాషా సాహిత్యాల మీద ప్రత్యేకాభిమానం ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న రామచంద్రాపురం వి.ఎస్‌. ఎమ్‌. కళాశాలలో ఎమ్‌.ఏ. చరిత్ర చదివిన దీపక్‌ ద్రాక్షారామం పి.వి.ఆర్‌. జూనియర్‌ కళాశాలలో చరిత్ర అధ్యాపకునిగా పనిచేశారు. బోధించింది చరిత్ర అయినా ఏ ఆంధ్రోపన్యాసకునికీ  తీసిపోనంత పట్టును తెలుగు భాషమీద సాధించారు. కనుకనే మాత్రాచ్ఛందస్సులో అద్భుతమైన గేయాలు, సినిమా పాటలు రాయడమే కాకుండా ఒక దిన పత్రికలో వారం వారం పదశోధన పేరుతో 630 వారాలుగా పదబంధ ప్రవేళిక శీర్షికను నిర్వహిస్తున్నాడు. ఈ శీర్షిక పట్ల యెందరో ప్రముఖులు ఆసక్తిని చూపించి పజిల్స్‌ను పూర్తి చేస్తున్నట్టు తెలిసిందని వారం క్రితమే ఆనందంగా అతను చెప్పిన మాటలు ఇంకా నా చెవి మరుగు కాలేదు. 


అదృష్ట దీపక్‌ రచన ‘ప్రాణం’ కవితా సంపుటి చదివిన మాదాల రంగారావు తను తీస్తున్న ‘యువతరం కదిలింది’ (1980) చలన చిత్రంలో అతన్ని గేయ కవిగా పరిచయం చేశారు. ఆ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో..’ అంటూ దీపక్‌ రాసిన పాట అప్పటి నుంచి పాతికేళ్ల పాటు నలబై సినిమా పాటల వరకూ రాయడానికి దారి దీపమైంది. అతను ‘నేటి భారతం’ చిత్రంలో రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ అనే పాట బహుళ ప్రాచుర్యాన్ని పొందటమే కాకుండా మద్రాస్‌ కళాసాగర్‌ అవార్డ్‌ను కూడా అందుకుంది. ‘అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు’ అంటూ ‘ఎర్రమల్లెలు’ (1981) చిత్రంలో రాసిన మేడే గీతం నేటికీ మేడే రోజున అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ వినిపిస్తూనే ఉంది. పాట రహస్యం తెలిసిన సినీ కవిగా మనసు కవి ఆత్రేయ ప్రశంసనందుకొనడ మే గాక అదృష్టదీపక్‌ ‘మానవత్వం పరిమళించే’ పాట ఒక పత్రిక ఎంపిక చేసిన నూరు గొప్ప సినిమా పాటలలో ఒకటిగా గుర్తింపు పొందింది. తను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధమైన చవుకబారు సినిమాపాటల్ని రాయడానికి అంగీకరించకపోవడం వల్ల, సామాజిక ప్రయోజనం కలిగిన పాటల్ని రాయించే దర్శక నిర్మాతలు పరిశ్రమకు దూరం కావడం వల్ల అదృష్టదీపక్‌ ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో నిలబడలేదు. ముఖస్తుతులకు, మొహమాటాలకు, ప్రలోభాలకు లొంగని రాజీపడని మనస్తత్వం కలిగిన నికార్సయిన కవి గనుకే అదృష్ట దీపక్‌ రాయవలసినన్ని రాయలేదు. అందుకోవలసినన్ని పురస్కారాలను అందుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక పురస్కారం, అ.ర.సం. వారి పురిపండా స్మారక పురస్కారం, రామచంద్రపురం గణితశాఖ వారి సి.వి. రామన్‌ పురస్కారం, నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం మొదలైనవి అతని మనసుకు నచ్చి స్వీకరించినవే. ఆత్మీయుల గుండెల నిండుగా అదృష్టదీపక్‌ అలదిన స్నేహగంధం యెప్పటికీ యిగిరిపోదు. దీపకరాగం నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది!

అదృష్ట దీపక్‌ ఆత్మీయ మిత్రులు పైడిపాల (99891 06162)