దేవరయాంజాల్‌లోని భూములు మావే

ABN , First Publish Date - 2021-05-05T08:00:13+05:30 IST

దేవరయాంజాల్‌లోని భూములు తమవేనని, దేవాలయ భూములు కావని రైతు సమాఖ్య నేతలు వెల్లడించారు.

దేవరయాంజాల్‌లోని భూములు మావే

  • గ్రామంలో సీతారామచంద్రస్వామి 
  • ఆలయం పేరుతో భూములే లేవు
  • 75 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం
  • కావాలనే ఇబ్బంది పెడుతున్నారు
  • దేవరయాంజాల్‌ రైతు సమాఖ్య


మేడ్చల్‌, మే 4(ఆంధ్రజ్యోతి): దేవరయాంజాల్‌లోని భూములు తమవేనని, దేవాలయ భూములు కావని రైతు సమాఖ్య నేతలు వెల్లడించారు. మంగళవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసరలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దేవరయాంజాల్‌ రైతు సమాఖ్య అధ్యక్షుడు చింతల వెంకట మురళీకృష్ణారెడ్డి, కార్యదర్శి బి.నర్సింహారెడ్డి, కోశాధికారి బి.శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. దేవరయాంజాల్‌లో సీతారామచంద్రస్వామి ఆలయం పేరున భూములే లేవని 75 సంవత్సరాలుగా రైతులే సాగుచేసుకుంటున్నారని తెలిపారు. వాటిపై ఎండోమెంట్‌ అధికారుల దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. 1953 రెవెన్యూ నిబంధనల ప్రకారం నాటి హైదరాబాద్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ మెహతా (ఈస్టర్న్‌ డివిజన్‌, హైదరాబాద్‌. తేదీ 20.07.1953) అనుమతితో భూములను రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వివరించారు. 1923-24 నుంచి కౌలుదారులుగా ఉన్న వారి పేరిటే అప్పటి పట్టాదారులు ఆ భూములను 1953లో రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. 1923-24 నాటి పట్టాదారుల పేర్లు కూడా 1953 వరకు రికార్డుల్లో ఉన్నాయని వివరించారు. కాగా, చౌపస్లా, పైసలాపట్టి కాలం రైతుల పేరునే ఉన్నాయన్నారు. 


ఈ భూములకు శిస్తును కూడా రైతులే చెల్లిస్తున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని వెల్లడించారు. 1953లో రిజిస్ర్టేషన్‌ చేసిన డాక్యుమెంట్‌ ఉర్దూలో ఉందని, అయితే 1925-26 పహాణి తెలుగు భాషలో పుట్టించారని తెలిపారు. అంతా ఉద్దేశపూర్వకంగా చేసి, రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. ల్యాండ్‌ సీలింగ్‌ డిక్లరేషన్‌ కూడా రైతులే ఇచ్చారని, ఎయిర్‌ఫోర్సు వారికి ఇచ్చిన భూములకు సంబంధించిన పరిహారం కూడా రైతులకే ఇచ్చారని తెలిపారు. బలహీన వర్గాల వారికి సర్వేనంబర్‌ 684, 685, 687లోని దాదాపు 27 ఎకరాల్లో ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేశారని వెల్లడించారు. 1976లో జరిపిన సర్వేలో దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం ప్రభుత్వ జాబితాలో లేదని తెలిపారు. 

1996లో రామచంద్రస్వామి గుడిని రిజిస్ర్టేషన్‌ చేయించారని, తామంతా అంతకుముందు నుంచే భూముల్లో సాగుచేసుకుంటున్నట్టు వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఏవైనా అవకతవకలకు పాల్పడి ఉంటే విచారణ జరిపి నిగ్గు తేల్చాలి,  ఈ వివాదాన్ని మొత్తం గ్రామంలోని వందలాది ఎకరాల భూములకు ముడిపెట్టి రైతులకు నష్టం కల్గించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ భూముల హక్కులకు సంబంధించిన డాక్యుమెంట్లతో రఘునందర్‌రావు కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.   ఈ సమావేశంలో రైతు సమాఖ్య సభ్యులు సాదా నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రామకృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషోర్‌ సాయి, శ్రవంతిరెడ్డి, విజయ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-05T08:00:13+05:30 IST