భగవంతుడి భాష!

ABN , First Publish Date - 2021-06-25T05:30:00+05:30 IST

మానవుడికి ఈశ్వరుడు ప్రసాదించిన అపురూపమైన వరం చిరునవ్వు. ఇది ఒక ప్రేమపూరితమైన భాష. నలుగురితో

భగవంతుడి భాష!

మానవుడికి ఈశ్వరుడు ప్రసాదించిన అపురూపమైన వరం చిరునవ్వు. ఇది ఒక ప్రేమపూరితమైన భాష. నలుగురితో ఉన్నప్పుడు ఎవరి ముఖంలోనూ చిరునవ్వు కనిపించకపోతే... వారిని కలుసుకోవడంలో ఆనందం ఉండదు. ఒక వ్యక్తి వచ్చి, మధురమైన చిరునవ్వుతో పలకరించినప్పుడు... అక్కడ వాతావరణం మారిపోతుంది.


మన జీవితాల్లో చిరునవ్వు ఒక అమూల్యమైన నిధి. దాన్ని కొనలేం. అరువు తెచ్చుకోలేం. అప్పుగా ఇవ్వలేం. దొంగిలించలేం. దాన్ని ఇవ్వనంత  వరకూ ఎలాంటి ఉపయోగం లేదు. అయితే అది ఇవ్వడం వల్ల తరిగిపోదు. మరింత పెరుగుతుందనేది మరచిపోకూడదు. మన చిరునవ్వు మీద మనకు పూర్తి అధికారం ఉంది. దాన్ని మనం ఎప్పుడు కావాలన్నా ఇవ్వవచ్చు. మరి చిరునవ్వుల విషయంలో మనం ఎందుకు పిసినారులుగా మారిపోతున్నాం?


కొందరు తమకు అందం తక్కువగా ఉందనే న్యూనతతో ఉంటారు. నిజానికి చిరునవ్వే అందం. ఎవరిని కలిసినా చిరునవ్వుతో మాట్లాడడం నేర్చుకోండి. ఒకవేళ నిజంగా సౌందర్య లోపం ఉన్నా, దాన్ని చిరునవ్వు భర్తీ చెయ్యడమే కాదు, వినూత్న సౌందర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. 



అమెరికాకు చెందిన ఒక ప్రసిద్ధ వాణిజ్యవేత్తకు ‘‘మీ విజయ రహస్యం ఏమిటి?’’’ అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఎదురయింది. ‘‘నా విజయం వెనుక ఉన్న ఏకైక రహస్యం నా చిరునవ్వే!’’ అని ఆయన బదులిచ్చాడు. ‘‘అన్ని పరిస్థితులలోనూ చిరునవ్వుతోనే ఉంటాను. నా జీవితంలో సమస్యలు రాలేదని కాదు. చాలా పెద్ద సమస్యలనే ఎదుర్కొన్నాను. వాటివల్ల నా వ్యాపారం దెబ్బతింది. కోట్ల సంపదను నష్టపోయాను. ‘నాది’ అనే ప్రతి దాన్నీ కోల్పోయాను. కానీ ఈ సమస్యలేవీ మానసిక ప్రసన్నతనూ, చిరునవ్వునూ నా నుంచి దూరం చెయ్యలేకపోయాయి. ఆ విధంగా ఆ సమస్యలు నా ముందు ఓడిపోయాయి. నా సంపద నాకు తిరిగి వచ్చింది’’ అని చెప్పాడు. 



ఒకసారి ఆలోచించి చూడండి... చిరునవ్వు మీ నుంచి ఏదీ తీసుకోదు. మీకు చాలా ఇస్తుంది. దాని కోసం మీరు నయాపైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మీ నుంచి పొందేవారు చాలా సంతృప్తి చెందుతారు. వారి మనసులో అది స్థిరంగా నిలిచిపోతుంది. ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు... మధురమైన చిరునవ్వుతో పలకరిస్తే, వాళ్ళు అలసట మరచిపోతారు.  చిరునవ్వు భగవంతుడి భాష. అందుకే దేవతా విగ్రహాలు చిరునవ్వు చిందిస్తూ ఉంటాయి. చిరునవ్వు ప్రేమ భాష. చిరునవ్వు లేని ప్రేమ ఉండనే ఉండదు. చిరునవ్వు ప్రేమ పరిభాష. అది అందరినీ మిత్రులుగా చేస్తుంది. శత్రువులు లేకుండా చేస్తుంది. మనసుల మధ్య దూరాలు చిరునవ్వుతో తొలగిపోతాయి.


చిరునవ్వు గొప్ప ఔషధం. అది చింతలను దూరం చేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. చిరునవ్వు ఆత్మ తాలూకు శక్తి. చిరునవ్వు నవ్వే వారిని చూస్తే... మన ముఖం మీద చిరునవ్వు దానంతట అదే మొలకెత్తుతుంది. చిరునవ్వు చక్కగా అలంకరించిన ఒక ఇల్లులాంటిది. అనవసరమైన గంభీరతను తొలగించుకొని, ముఖం పైకి చిరునవ్వును తేగలిగితే... నెమ్మదిగా ఈ చిరునవ్వుతో కూడిన వ్యక్తిత్వం మీ జీవితంలో ఒక భాగమైపోతుంది. మనిషి జన్మించింది నవ్వుతూ ఉండడానికే! మనసును ఆనందమయం చేసుకోండి. అప్పుడు మీ ముఖాన్ని చిరునవ్వు ప్రకాశింపజేస్తుంది.


ఒక్కసారి ప్రకృతిని గమనించండి. పూలూ, పచ్చని ఆకులూ నవ్వుతూ కనిపిస్తాయి. మరి మనం మన జీవితాల్లో ఎందుకు చిరునవ్వును దూరం చేసుకుంటున్నాం? ఏడుపు ద్వారా దుఃఖాన్ని మరింత పెంచుకోవద్దు. చిరునవ్వు మాత్రమే దుఃఖానికి మందు. మన జీవితం చిరునవ్వుతో నిండిన పాటలా ఉండాలి. సంతోషంలో, ఆత్మ సౌందర్యంలో జీవించే కళను మనం నేర్చుకోవాలి.


 బ్రహ్మకుమారీస్‌

70324 10931


Updated Date - 2021-06-25T05:30:00+05:30 IST