దబాయింపు భాష!

ABN , First Publish Date - 2020-09-28T06:25:15+05:30 IST

సెప్టెంబర్‌ ఏడు నాటి ‘వివిధ’లో మిత్రులు సామిడి జగన్‌రెడ్డి ‘ఈ స్థాయి సంకుచితత్వం అవసరమా!’ అంటూ నేను ‘వృథా పరిశోధన’ పేరిట...

దబాయింపు భాష!

‘‘అన్వేషి లైబ్రేరిలోని గృహలక్ష్మి పత్రిక నుంచి బండారు అచ్చమాంబ కథలు, నేను సంగిశెట్టి కలిసి సేకరించాము. ఆ సంపుటిలో నా పేరు ప్రస్తావించని తరీఖా ఈయనది’’ అన్నాడు జగన్‌ రెడ్డి. నా వెంబడి అన్వేషి లైబ్రెరీకి వచ్చినంత మాత్రాన ఆయన పేరుని ప్రస్తావించాలా? ఆ ఒక్క రోజుతోనే పరిశోధన పూర్తయిందా?  


సెప్టెంబర్‌ ఏడు నాటి ‘వివిధ’లో మిత్రులు సామిడి జగన్‌రెడ్డి ‘ఈ స్థాయి సంకుచితత్వం అవసరమా!’ అంటూ నేను ‘వృథా పరిశోధన’ పేరిట 17 ఆగస్టు నాడు రాసిన వ్యాసానికి జవాబిచ్చే ప్రయత్నం చేసిండు. జవాబులు లేకుంటే లేవు అని చెబితే కొంత మర్యాదగా ఉండేది! కాని పచ్చి అబద్ధాలను సత్యాలుగా నమ్మించే ప్రయత్నం చేసిండు. పైగా దబాయింపు భాష! 


‘‘తెలుగు అకాడమి ‘ఆధునిక తెలంగాణ సాహిత్య చరిత్ర’ అన్న పేరుతో అనేక వక్రీకరణలతో పుస్తకం అచ్చేసింది. దీని సహసంపాదకత్వంలో సంగిశెట్టి సభ్యుడు. సహరచ యిత కూడ. ఇందులో తెలంగాణలో ‘భావకవిత్వం రాలేదు’ అని వక్రీకరించారు. వక్రీకరణలకు దిగినవారిలో సంగిశెట్టి భాగస్వామి. కనుక మొదట ఈయన తెలంగాణ సమా జానికి పాఠకులకు క్షమాపణలు చెప్పాలి’’ అన్నాడు. వారెవ్వా! ఏమి దబాయింపు. ‘తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర’ పుస్తకానికి ఒకే ఒక్కరు ఆచార్య రవ్వా శ్రీహరి సంపా దకులుగా వ్యవహరించారు. రచయితలల్లో అందరికన్నా చివర ఉన్నది నా పేరే! ఇందులో కవిత్వానికి సంబంధిం చిన వ్యాసం నేను రాయలేదు. నాకు సంబంధం లేని దానికి నేను క్షమాపణ చెప్పాలా! 


‘‘సంగిశెట్టి ఆళ్వారుస్వామిపై ‘సార్థక జీవనం’ పేరుతో ఒక పుస్తకం అచ్చేశాడు. అందులో చివరిదశలో ఆళ్వారు స్వామి సీపిఐని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతిని దాచి తెలంగాణ సమాజాన్ని దగాచేసేందుకు సంగిశెట్టి ఒడి గట్టాడు’’ అన్నాడు జగన్‌ రెడ్డి. ఆళ్వారుస్వామి కాంగ్రెస్‌ పార్టీలో చేరిండా? నేను చేసిన పరిశోధనల్లో ఎక్కడా కూడా ఈ విషయం తారసపడలేదు. తమరి దగ్గర కచ్చితమైన ఆధారాలుంటే బయటపెట్టండి? 


‘‘‘వెట్టిమాదిగ’ కథను భాగ్యరెడ్డివర్మ రాసినట్లు ఈయన కథల సంకలనాల్లో చెలామణి చేస్తున్నాడు.’’ అనేది మరో ఆరోపణ. ‘వెట్టిమాదిగ’ కథ 1932లో ‘భాగ్యనగర్‌’ పత్రికలో ‘అజ్ఞాతవాసి’ పేరిట అచ్చయింది. పత్రిక సంపాదకుడు మారు పేరుతో రచనలు చేయడమనేది మామూలు విషయం. అయినా ఈ సంకలనంలో ‘వెట్టిమాదిగ’ పక్కన అజ్ఞాత వాసి అని పేరును స్పష్టంగా పేర్కొనడమయింది. ‘భాగ్య నగర్‌’ పత్రిక సంపాదకులు భాగ్యరెడ్డివర్మ. 


‘‘ఉస్మానియా తెలుగుశాఖను గొప్ప పరిశోధన కేంద్రంగా రాయప్రోలు సుబ్బారావు తీర్చిదిద్దాడు. ఆ శాఖలో ఒకనాడు పరిశోధక విద్యార్థినైన నేను రాయప్రోలు కవితను వేస్తే తప్పేమిటి? ఊటుకూరు సత్యనారాయణ, సన్నిధానం సూర్య నారాయణ, ఇంద్రగంటి నాగేశ్వరశర్మ ఖమ్మం జిల్లావాసు లన్నది నాకు రూఢీగా తెలుసు. ఈయనకు తెలియనంత మాత్రాన అవి అసత్యలయితాయా?’’ అని వివరణ ఇచ్చారు. 


ముందుగా ఊటుకూరు సత్యనారాయణ గురించి మాట్లా డుకుందాం! వీరు కృష్ణాజిల్లాలోని గంపలగూడెం సమీపంలో గల అర్లపాడు గ్రామంలో ఒక సంపన్న నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 1905 మార్చి 14న అచ్యుతరావు, రంగనా యకమ్మ దంపతులకు జన్మించారు. (వెంకటప్పయ్య, వెలగా, నరసింహారావు, ఎం.ఎల్‌; సంపాదకులు: 20వ శతాబ్ది తెలుగువెలుగులు. పొ.శ్రీ.తె.వి.వి., 2005, పేజి. 902).


రెండో వ్యక్తి సన్నిధానం సూర్యనారాయణ. ‘‘వీరు వైదిక నిష్ఠాగరిష్టులైన పండిత వంశంలో గోదావరి జిల్లాలో కండ్రిక అగ్రహారంలో 10-12-1897న సుబ్బయ్య, బుచ్చినరసమ్మ దంపతులకు జన్మించారు.’’ అని చీమకుర్తి శేషగిరిరావు రాసిండ్రు. (20వ శతాబ్ది తెలుగు వెలుగులు- రెండవ భాగం; పేజి. 1017). అంటే వీరిద్దరూ ఖమ్మం జిల్లావారు కారు.


‘‘కోకిలా!/ లేమావి చివురులను లెస్సగా మేసేవు/ ఋతురాజు వచ్చెనని అతి సంభ్రమము తోడ/ మావి కొమ్మల మీద మైమరచి పాడేవు/ తిన్న తిండెవ్వారిదే కోకిలా!/ పాడు పాటెవ్వారిదే కోకిలా!...’’ - ఈ కవితను కాళోజి నారాయణరావుగారు రాయప్రోలు సుబ్బారావుని అధిక్షేపిస్తూ రాసిండు. 2001లో వెలువడ్డ కాళోజి కవితల సంపూర్ణ సంకలనంలో ఇది ఉంది. అందులో వివరణ ఇలా ఉన్నది. ‘‘1943 శబ్దాను శాసన గ్రంథాలయ వార్షి కోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా జరిగిన కవి సమ్మేళనానికి రాయప్రోలు సుబ్బారావుగారు అధ్యక్షులు. నిజాం వ్యతిరేకోద్యమం ముమ్మరంగా సాగుతున్న ఈ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతిగా పని చేస్తూ తెలంగాణ ప్రజల పోరాటంలో పాలు పంచుకోలేదనే విమర్శ ఆ రోజుల్లో రాయ ప్రోలుపై ఉండేది.’’


‘‘సారస్వత చర్చ చేసినపుడు మనసులో ఉన్నమాట చెప్పాలి సిందే. హైదరాబాదు దురదృష్టం చేత నాకెవ్వరున్నూ సుబ్బారావు గారి శిష్యవర్గంకాని, అనుయాయులు కానీ, కానవచ్చుట లేదు. వేదంవారి శిష్యులు చాలామంది ప్రసిద్ధులున్నారు. వారి శిష్యులం మేము అని సగర్వంగా చెప్పుకొంటారు. శ్రీ తిరుపతి వెంకటకవులవద్ద రెండు నెలలైనా పాఠము చెప్పుకొని వారి శిష్యులమండీ అని చెప్పుకొనేవారు చాలామంది. మరి వారి వద్ద క్షుణ్ణంగా పాండిత్య కవిత్వ సంపదలను సంపాదించుకొన్నవారి సంఖ్య కూడా నూటికి పైగా ఉండవచ్చును. అట్టి వర్గాన్ని సుబ్బారావుగారు సిద్ధము చేసినట్లు గానరాదు’’ అని సురవరం రాశారు (సురవరం ప్రతాపరెడ్డి: తెలంగాణ వ్యాసాలు; పేజి 16). 


1945 ప్రాంతంలో నిజాం ప్రభుత్వం సహాయంతో రాయప్రోలు సుబ్బారావు, కురుగంటి సీతారామభట్టాచార్య, కాసీంఖాన్‌లు కలిసి ‘హైదరాబాదాంధ్ర సాహిత్య పరి షత్తు’ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా పనిచేస్తుందని ఆనాడే తెలం గాణ సాహితీ ప్రియులు వీరి పేర్లలోని మొదటి అక్షరాల పేరిట ‘రాకాసీ’ పరిషత్తు అని పిలిచేవారు. ఇట్లాంటి రాకాసీ పరిషత్తు సంస్థను నడిపించిన రాయప్రోలు సుబ్బారావుని సామిడిగారు ‘తెలుగు శాఖను గొప్ప పరిశోధక కేంద్రం’గా తీర్చిదిద్దిన వ్యక్తిగా పొగిడినారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే రాయప్రోలు సుబ్బారావు రాసిన కవిత పేరు ‘రెడ్డి కన్నియ’. సామిడిగారు కేవలం కులాభిమానంతోనే ఈ కవితను జోడించాడు. 


‘‘ఆదిపూడి సోమనాథరావు, ఆదిపూడి ప్రభాకరామాత్య ఇద్దరు సోదరులు. గద్వాలలో జన్మించినవారు’’ అన్నాడు. ఇంతకన్నా దబాయింపు మరేమీ ఉండదు. ఆదిపూడి సోమనాథరావు (1867-1941) తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించాడు (తెలుగు సాహిత్య కోశం). ‘‘ప్రభాకరామాత్యుని వ్యావహారిక నామము ప్రభాకరరావు (1871-1933). గృహనామము ఆదిపూడివారు. శాండిల్యస గోత్రులు. ఆర్వేల నియోగులు. తండ్రి బుచ్చివెంకయ్య, తల్లి రామలక్ష్మమ్మ. బుచ్చి వెంకయ్యగారి జనకులు వెంకట్రా యులుగారును, నందిరాజు సూరప్పగారును బావమఱదులు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని ఆదిపూడి వీరి జన్మస్థానము’’ (‘ఆంధ్రభారతము-ఏడంకముల దృశ్యప్రబం ధము’, రచన ఆదిపూడి ప్రభాకరామాత్య, 1971 - పుస్త కంలో నందిరాజు రాఘవేంద్రరావు రాసిన పరిచయం). 


‘‘నిజానికి ఆంధ్ర రచయితలను తెలంగాణ ఖాతాలో చేర్చడం మొదలు పెట్టింది సంగిశెట్టియే. అందుకు సాక్ష్యం ఒక పెద్దాయన పురమాయింపు మేరకు సంకలనం చేసిన వాసుదేవరావు కథలు, తాడి నాగమ్మ కథల సంపుటి. వీరు పూర్తిగా కోస్తాంధ్రకు చెందిన రచయితలు’’ అని రాశాడు జగన్‌ రెడ్డి. వాసుదేవరావు తెలంగాణ వాడు అనేది ఖరారు చేసింది నేను కాదు. సుప్రసిద్ధ విమర్శ కులు, పరిశోధకులు, ఆచార్యులు కె.కె. రంగనాథాచార్యులు. ఆయన హైదరాబాదీ కాదంటే ఏ జిల్లావాడో, ఆధారా లతో సహా నిరూపిస్తే దాన్ని సవరించుకోవచ్చు. ఇక తాడి నాగమ్మ ‘‘1908 జూలై ఆరున బల్లా పుల్లయ్య, బల్లా మహాలక్ష్మి దంపతులకు జన్మించారు.... బల్లా పుల్లయ్య స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మోరిపాలెం గ్రామం’’ (తాడి నాగమ్మ కథలు, రచనలు - పేజి. 17) అని నేను ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో వివరంగా రాసిన. ఈమె స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా మోరిపాలెం అని వివరంగా చెప్పిన. గురజాడను కాదని బండారు అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలిగా నేను నిలబెట్టడానికి చేసిన ప్రయ త్నాన్ని దిగజారడంగా పోల్చిండు. సంతోషం. అచ్చమాంబ కథలు ఒక్క దగ్గరికి వచ్చిన తర్వాత తెలంగాణ కథా సాహిత్య చరిత్ర మారిపోయింది. ఈ విషయంలో స్త్రీ వాదులు చేసిన కృషి గొప్పది.  


‘‘ఈయన సహసంపాదకునిగా వెలువడిన ‘మలితరం తెలంగాణ కథ’ అన్న గ్రంథంలో రాయలసీమకు చెందిన చిత్తూరు మాజీ ఎంపీ కమ్యూనిస్టు నాయకుడు రాటకొండ నరసింహారెడ్డి, సిరిగూరి జయరావు కథలను చేర్చాడు’’ అన్నాడు జగన్‌ రెడ్డి. ఇంతకన్నా పెద్ద జోక్‌ ఇంకొకటి ఉండదు. సుజాతారెడ్డితో కలిసి నేను సంకలనం చేసిన ‘తొలినాటి కథలు’ పుస్తకంలో మొత్తం 46 కథలున్నాయి. అందులో సారువారు పేర్కొన్న రాటకొండ నరసింహా రెడ్డి, సిరిగూరి జయరావు కథలు లేవు. 


‘‘అన్వేషి లైబ్రేరిలోని గృహలక్ష్మి పత్రిక నుంచి బండారు అచ్చమాంబ కథలు, నేను సంగిశెట్టి కలిసి సేకరించాము. ఆ సంపుటిలో నా పేరు ప్రస్తావించని తరీఖా ఈయనది’’ అన్నాడు. నా వెంబడి అన్వేషి లైబ్రెరీకి వచ్చినంత మాత్రాన ఆయన పేరుని ప్రస్తావించాలా?  కథలన్నీ ఒక్క గృహ లక్ష్మిలోనే దొరికినాయా? ఆ ఒక్క రోజుతోనే పరిశోధన పూర్తయిందా?  


సామిడి జగన్‌రెడ్డి నేను ‘వృథా పరిశోధన’లో లేవ నెత్తిన అంశాలను మసిబూసి మారెడుకాయ చేసే ప్రయత్నం చేసిండు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. వీటన్నింటికీ విషయాలవారిగా జవాబిచ్చాను. తుది తీర్పు ఇవ్వాల్సింది ఈ విషయంలో పరిజ్ఞానం ఉన్న విషయనిపుణులు. తెలంగాణ సాహితీ సమాజం. 

సంగిశెట్టి శ్రీనివాస్‌

(చర్చ ముగిసింది)


Updated Date - 2020-09-28T06:25:15+05:30 IST