Advertisement
Advertisement
Abn logo
Advertisement

కండలేరు కట్టకు గండి

  • ఆసియాలోనే అతిపెద్ద మట్టికట్ట
  • అనుకోనిది జరిగితే తీవ్ర నష్టం
  • పైకి బింకం..లోన అధికారుల్లో భయం


రాపూరు, డిసెంబరు 1 : ఆసియా ఖండంలోనే అతి పెద్ద మట్టికట్ట కండలేరు జలాశయానికి పడిన గండి నెల్లూరు జిల్లా వాసులను కలవరపెడుతోంది. దీంతో డ్యాం భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఇరిగేషన్‌ అధికారులు పైకి చెబుతున్నా లోలోన మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. నిండుకుండను తలపిస్తున్న జలాశయం మట్టికట్ట మీద రేయింబవళ్లు వాచ్‌ అండ్‌ వార్డు ఏర్పాటుచేసి పడిగాపులు కాస్తున్నారు. అయితే, మట్టికట్ట నిర్మాణం కాంట్రాక్టర్ల చిత్తానుసారం జరిగిందనే ఆరోపణలను నిజం చేస్తూ.. కట్టకు గండి పడింది. తొలి దశలో డ్యాంలో 15 టీఎంసీల నీటిని నిల్వ చేయగానే లీకేజీలు కనిపించాయి. అప్పటి ఇంజనీర్ల విజ్ఞప్తితో ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. డ్యాం నిర్మాణం అత్యంత అధ్వాన్నంగా ఉందని, 25 టీఎంసీలు నిల్వచేస్తే మట్టికట్ట కొట్టుకుపోతుందని ఆ కమిటీ అప్పట్లో ప్రకటించింది. మట్టికట్ట పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. దీంతో డ్యాం పటిష్టతకు చర్యలు తీసుకున్నారు. అనంతరం 30 టీఎంసీలు నిల్వ చేసినప్పుడు రివిట్‌మెంటు దెబ్బతినడంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే, గతేడాది  శ్రీశైలం, పెన్నా వరద కారణంగా 61 టీఎంసీలు నిల్వచేశారు. అప్పట్లో డ్యాం మట్టికట్టపైన ఒకట్రెండు చోట్ల కుంగడంతోపాటు లోపలి వైపు రివిట్‌మెంటు దెబ్బతినింది.  డ్యాం తెగిపోతుందన్న భయంతో దిగువ గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.


అయితే, అప్పట్లో ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, దెబ్బతిన్న రివెట్‌మెంటుకు మరమ్మతుల విషయాన్ని అధికారులు, నేతలు ఆ తర్వాత మరచిపోయారు. దీంతో తాజాగా 6.2 కిలోమీటరు వద్ద మట్టికట్టకు భారీ గండి పడింది. డ్యామ్‌ నిర్వహణకు నిధులు మంజూరు కాకపోవడంతో కట్టపై చెట్లు పెరిగి చిట్టడివిని తలపిస్తోంది.  హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పాచి పట్టి ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. కాగా, కండలేరు ఎంతో పటిష్టంగా ఉందని, ఎలాంటి ముప్పులేదని తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి ప్రకటించారు. డ్యాంను బుధవారం ఆయన పరిశీలించారు. గండి పడ్డ ప్రాంతంతోపాటు పలుచోట్ల కలియతిరిగారు. ఈ ఏడాది 62 టీఎంసీల నీటిని నిల్వచేస్తామన్నారు. డ్యాం ఎస్‌ఐ అనూష మాట్లాడుతూ డ్యాం మట్టికట్టపై అసత్య ఆరోపణలు చేస్తే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీచేసి సంచలనం సృష్టించారు. 


ఇదీ కండలేరు కథ..

1983లో అప్పటి ముఖ్యమంత్రి  ఎన్టీరామారావు చెన్నై వాసుల దాహార్తి తీర్చేందుకు తెలుగుగంగ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీఆర్‌తో కలిసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అనుమతి తీసుకున్నారు. సోమశిల నుంచి నేరుగా చెన్నై నగరానికి నీటిని తీసుకెళ్లాలని భావించారు. అయితే, నెల్లూరు జిల్లాలో డ్యాంలు నిర్మించి కాలువల ద్వారా రెండు జిల్లాలకు సాగు, తాగు నీటిని అందిస్తూ చెన్నైకు నీటిని తీసుకెళ్తే ఒనకూరే ప్రయోజనాలను జిల్లాకు చెందిన అప్పటి మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి వివరించడంతో కండలేరు డ్యాం నిర్మాణం జరిగింది. రాపూరు మండలంలోని చెల్లటూరు డ్యాం వద్ద పెంచలకోన నుంచి వచ్చే కండ్లేరు మీద రూ.152 కోట్ల ప్రాథమిక అంచనాతో ఈ జలాశయాన్ని ప్రారంభించి 1990లో తొలిసారి నీటిని నిల్వచేశారు. 1996లో తొలిసారిగా చెన్నైకి నీటిని విడుదల చేశారు.

Advertisement
Advertisement