చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత

ABN , First Publish Date - 2022-06-23T07:40:57+05:30 IST

చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత

చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత

ఆర్‌అండ్‌బీ శాఖలో బదిలీల బేరం 

ఆర్‌అండ్‌బీ భవన్‌ పక్కనే మరో ఆఫీసు

నేత బావమరిది, ఇద్దరు అధికారుల మకాం

జిల్లాలవారీగా వేలంపాట.. జాబితా తయారీ

నేషనల్‌ హైవే పోస్టులకు భారీ డిమాండ్‌

ఎస్‌ఈ పోస్టుకు ఏకంగా 40 లక్షలు 

ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు

లక్షలే లక్షలు 


ఏఈఈ పోస్టుకు 5 లక్షలు. డీఈకి 10 లక్షలు. ఈఈకి 20-25 లక్షలు. ఎస్‌ఈకి ఏకంగా 40-50 లక్షలు.. ఆర్‌అండ్‌బీ శాఖలో బదిలీలకు ఓ అధికార పార్టీ నేత ఖరారు చేసిన రేట్లు ఇవి. ఆర్‌అండ్‌బీ భవన్‌ పక్కనే ఆఫీసు తెరిచి మరీ వేలం పాట మొదలెట్టారు. బావమరిది, ఇద్దరు జూనియర్‌ అధికారులతో కలిసి వ్యవహారం నడిపిస్తున్నట్టు సీఎంవోకు ఫిర్యాదులు వెళ్లాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రోడ్లు వేయడానికి రోడ్లు, భవనాల శాఖలో సొమ్ములు లేవు. పనుల్లేక ఆ శాఖ కార్యాలయాలు బోసిపోతున్నాయి. ఈఎన్‌సీ కార్యాలయంలో నిశ్శ్దబ్దం రాజ్యమేలుతోంది. కానీ ఆ శాఖలో అధికారుల బదిలీలు కాసుల వర్షం కురిపిస్తోంది. బదిలీల వ్యవహారంలో ఓ అధికార పార్టీ నేత అంతా తానై నడిపిస్తున్నారు. అధికారులు ఆయన వద్దకు క్యూ కడుతున్నారు. నేషనల్‌ హైవే విభాగంలోని ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈఈ పోస్టులకు భారీగా డిమాండ్‌ ఉంది. దీన్ని పసిగట్టిన నేత పోస్టును బట్టి వేలం పాట మొదలుపెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. తొలుత చూసీ చూడనట్లు వదిలేసినా వ్యవహారం శ్రుతిమించడంతో నివేదిక కోరినట్లు తెలిసింది. రోడ్లు, భవనాల శాఖలో ఇంజనీర్ల బదిలీల్లో ఈఎన్‌సీ కార్యాలయానిదే కీలకపాత్ర. బదిలీల సమయంలో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు సిఫారసులు చేయడం సర్వసాధారణం. నిబంధనలకు లోబడి అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ ఈసారి అధికార పార్టీ నేత బదిలీలను తన గుప్పిట్లోకి తీసుకున్నారు. అంతా తానై నడిపిస్తున్నట్లు తె లిసింది. ఆర్‌అండ్‌బీ భవన్‌ పక్కనే మరో ఆఫీసు తెరిచారు. ఈ నేత బావమరిది, ఇద్దరు జూనియర్‌ అధికారులను అక్కడ అందుబాటులో ఉంచారు. బదిలీలు కావాలనుకున్నవారు ఆ ఆఫీసుకే రావాలని వర్తమానం పంపించారు. కొద్దిరోజులుగా అక్కడికి అధికారులు క్యూ కడుతున్నారు. జిల్లాల వారీగా బదిలీలపై బేరసారాలు మాట్లాడుకుంటున్నారు. చివరకు జిల్లా స్థాయి సూపరింటెండెంట్‌ల బదిలీలు కూడా ఇక్కడికి చేరాయి. 

జీరో బేస్డ్‌ బదిలీలు

గతంలో జీరో బేస్డ్‌ బడ్జెట్‌ గురించి విన్నాం. ఇప్పుడు ఆర్‌అండ్‌బీలో జీరో బేస్డ్‌ బదిలీలకు తెరతీశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు, అంతకుమించి ఒకే చోట పనిచేస్తున్నవారిని మార్చాలి. మూడేళ్లకు పైగా పనిచేస్తున్న వారి నుంచి ఆప్షన్‌లు తీసుకోవచ్చు. ఏడాది, రెండేళ్లుగా పనిచేస్తున్న వారిని మార్చడానికి వీల్లేదు. కానీ బదిలీల్లో ఎక్కువగా దండుకోవాలన్న ఉద్దేశ్యంతో అధికార పార్టీ నేత జీరో బేస్డ్‌ విధానం తీసుకొచ్చారు. అదేంటంటే పరిపాలనా కారణాలతో బదిలీ చేయడం. ఒక అధికారి ఏడాది లేదా రెండేళ్లుగా పనిచేస్తున్నా పరిపాలనా కారణం పేరు చెప్పి బదిలీ చేసుకోవడమే జీరో బేస్డ్‌ విధానం. ఈ లెక్కన మూడేళ్ల లోపు పనిచేస్తున్న వారు తమ పోస్టును కాపాడుకునేందుకు ఒక రేటు, కోరుకున్న చోట పోస్టింగ్‌ కావాలనుకుంటే మరో రేటు ఖరారు చేసినట్లు తెలిసింది. 


పోస్టును బట్టి రేట్లు 

బదిలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆఫీసులో అధికార పార్టీ నేత, ఆయన బావమరిది మంత్రాంగం నడుపుతున్నట్లు తెలిసింది. విభాగం, డివిజన్‌, పోస్టును బట్టి రేట్లు ఖరారు చేశారు. ఏఈఈకి 5 లక్షలు, డీఈకి 10 లక్షలు, ఈఈకి 20-25 లక్షలు (డివిజన్‌ను బట్టి), ఎస్‌ఈకి 40-50 లక్షల మేర రేట్లు ఖరారు చేసినట్లు ఆ ఆఫీసుకు కౌన్సిలింగ్‌కు హాజరై వచ్చిన అధికారులు చెబుతున్నారు. ‘‘అబ్బో.. భూముల రేట్ల కంటే బదిలీ బేరం ఎక్కువగా ఉంది. ఈ ధరలు భరించడం మా తరం కాదు. గడిచిన మూడేళ్లుగా పనులు కూడా లేవు. అంతంత సొమ్ము ఎక్కడ పెడతాం’’ అంటూ ఓ అధికారి వాపోయారు. డివిజన్‌ల ఈఈ, ఎస్‌ఈ పోస్టులకు  భారీ డిమాండ్‌ ఉంది. ఈ పోస్టులకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరు ఎక్కువ ఇస్తే వారి పేరును ఈఎన్‌సీకి పంపిస్తామని ముందే చెబుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెండు నేషనల్‌ హైవే డివిజన్‌లు ఉన్నాయి. వాటికి ఎస్‌ఈతో పాటు ఈఈ, డీఈ, ఏఈఈ పోస్టులకు బదిలీలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఎన్‌హెచ్‌ విభాగంలో జోరుగా పనులు సాగుతున్నాయి. ఇక్కడ పనిచేసేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. ఎన్‌హెచ్‌ ఎస్‌ఈ పోస్టును కోరుకుంటున్న ఓ అధికారితో ఏకంగా 65 లక్షలకు ఓ జూనియర్‌ అధికారి బేరం కుదిర్చారు. చివరకు 40 లక్షలకు ఓకే అయినట్లు తెలిసింది. అయితే రాయలసీమకు చెందిన అధికారి 50 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో మొదట హామీ పొందిన అధికారిని పిలిచి మాట్లాడి బుజ్జగించి మరో డివిజన్‌ను సూచించినట్లు తెలిసింది. కోస్తాంధ్రకు సంబంధించి సస్పెన్షన్‌లో ఉన్న ఓ ఎస్‌ఈ పోస్టింగ్‌తో పాటు ఏలూరు ప్లేస్‌  కోరుకుంటున్నట్లు తెలిసింది. ఇందుకు 40 లక్షలు ఆఫర్‌ చే సినట్లు తెలిసింది. ఇదే ప్రాంతానికి చెందిన మరో అధికారి గుంటూరు పోస్టు కోరుకుంటున్నారు. ఆయనకు ఏకంగా 50 లక్షలు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. కొత్తగా జిల్లాలు, డివిజన్‌ల సంఖ్య పెరగడంతో  కొన్ని పోస్టులకు వేలం పాట తరహాలో రేట్లు ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేత ఖరారు చేసిన జాబితాను ఈఎన్‌సీకి పంపిస్తారు. వాటిని ఆయన ఆమోదించాల్సిందేనని చెబుతున్నారు. అందులో ఒక్కటి కూడా మార్చడానికి వీల్లేదని ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలిసింది.


సీఎంవోకు ఫిర్యాదులు

ఆర్‌అండ్‌బీలో బదిలీల బేరసారాలపై సీఎంవోలో ఓ కీలక అధికారి ఆరా తీసినట్లు తెలిసింది. దీనిపై ఆర్‌అండ్‌బీ నుంచి ఓ నివేదిక వెళ్లినట్లు తెలిసింది. అధికార పార్టీ నేత, ఆయన బావమరిది, ఇద్దరు అధికారులు బదిలీల్లో తలదూర్చినట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నం చేసింది. స్పందించేందుకు వారు నిరాకరించారు. 

Updated Date - 2022-06-23T07:40:57+05:30 IST