Abn logo
Sep 25 2021 @ 01:28AM

బైరు మల్లయ్య జీవితం ఆదర్శనీయం

ఔరవాణిలో బైరు మల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 నార్కట్‌పల్ల, సెప్టెంబరు 24: పేదల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ, పెత్తందారులు భూస్వాములకు వ్యతిరేకంగా తుది శ్వాస వరకు పోరాడిన బైరు మల్లయ్య  జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కొనియాడారు. నార్కట్‌పల్లి మండలం ఔరవాణిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కల్లుగీత కార్మికోద్యమ నిర్మాత బైరు మల్లయ్య కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సాయుధ పోరాటంలో సామాన్య కుటుంబంలో జన్మించి పేదల పక్షాన నిలిచి గ్రామ రక్షక దళంలో కీలక నేతగా ఎదిగారన్నారు. కల్లుగీత కార్మికోద్యమాన్ని ముండుండి నడిపించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని, గీతకార్మిక ఉద్యమం అంటే బైరు మల్లయ్య గుర్తుకొస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కల్లుగీత కార్మికులకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని నీరా పాలసీని తీసుకువచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భూమి భుక్తి, విముక్తి కోసం బైరు మల్లయ్య చేసిన పోరాటం ఎనలేనిదన్నారు. నాటి పోరాట చరిత్రను ప్రభుత్వం భావితరాలకు అందించినట్లయితే ఎంతోమందికి ఉపయుక్తమవుతుందని, చరిత్రపుటల్లో బైరు మల్లయ్య పోరాటం నిలిచిందని అన్నారు.  కార్యక్రమం ఆరంభానికి ముందు కళాకారులు ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్యగౌడ్‌, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, పల్లె రవికుమార్‌ పాల్గొన్నారు.