Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 10:34AM

TN: అభ్యర్థుల ఎంపికపై పార్టీల ‘స్థానిక’ కసరత్తు

ఒకటి రెండు రోజుల్లో జాబితాలు


చెన్నై(ఆంధ్రజ్యోతి): తొమ్మిది జిల్లాల్లో రెండు విడతలుగా నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై డీఎంకే, అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయాలను ప్రకటించనున్నాయి. అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా లను ఆయా జిల్లాలకు చెందిన పార్టీ కార్యదర్శులు ఇటీవలే పార్టీ అధిష్ఠానవర్గానికి సమర్పించారు. అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలను పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి శనివారం సాయంత్రం జిల్లాల కార్యదర్శులు అందజేశారు.


అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే వైదొలగటంతో తక్కిన మిత్రపక్షాలు తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని పట్టుబడుతు న్నాయి. కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, విల్లుపురం, కల్లకుర్చి, తిరునల్వేలి, తెనకాశి జిల్లాలలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అక్టోబరు 6, 9 తేదీల్లో రెండు విడతలుగా జరుగనున్నాయి. గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు పార్టీల రహితంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పదవులకు పోటీ చేసేవారికి ఇండిపెండెంట్‌ గుర్తులను కేటా యించనున్నారు. జిల్లా యూనియన్‌ (పరిషత్‌) సభ్యులు పంచాయతీ యూనియన్‌ వార్డు సభ్యుల పదవులకు పార్టీలపరంగా ఎన్నికలు జరుగను న్నాయి. తొమ్మిది జిల్లాల్లో మొత్తం 270003 పదవులకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.


డీఎంకే కూటమి...

స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే, దాని మిత్రపక్షాలు కలసికట్టుగా పోటీ చేయనున్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, డీపీఐ, తమిళగ వాళ్వురిమై కట్చి, కొంగునాడు మక్కల్‌ కట్చి, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలు తక్కిన పార్టీల కంటే ఎక్కువ సీట్లు పొందటానికి తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను ఆయా జిల్లాశాఖల నాయకులకు అప్పగించింది. గత వారం రోజులు జిల్లా శాఖ నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అదే సమయంలో డీఎంకే మిత్రపక్షాలకు చెందిన స్థానిక నాయకులు తమకు కేటాయించాల్సి సీట్లను గురించి తెలియజేస్తూ నివేదికలను అందజేశారు. ఈ నివేదికలను డీఎంకే జిల్లా శాఖ నాయకులు పార్టీ అధిష్ఠానానికి ఇటీవలే సమర్పించారు. డీఎంకే గెలిచేందుకు అవకాశాలు కలిగిన స్థానాలు గురించి, ఆ స్థానాలలో గెలిచేందుకు అవకాశమున్న అభ్యర్థుల గురించి జిల్లా శాఖ నాయకులు అధిష్ఠానానికి తెలియజేశారు. 


అన్నాడీఎంకే కూటమి...

అన్నాడీఎంకే కూటమి నుంచి పీఎంకే వైదొలగటంతో ప్రస్తుతం కూటమిలోని బీజేపీ అధిక సీట్ల కోసం పట్టుబడుతోంది. స్థానిక ఎన్నికల పొత్తుపై రెండు పార్టీల మధ్య త్వరలో సమావేశం జరుగనుంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై పాత్రికేయులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ కొనసాగుతుందని, స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ ఎక్కువస్థానాల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రకటించారు. అన్నాడీఎంకే కూడా అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను జిల్లా శాఖ నాయకులకు అప్పగించింది. ఆయా జిల్లా శాఖల నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పార్టీ అధిష్టానవర్గానికి కొద్ది రోజులకు ముందే సమర్పించారు. జిల్లా శాఖ నాయకులు పంపిన ఆశావహుల జాబితాలను అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజులలోపున వీరు అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే అవకాశముంది.



TAGS: DMK AIDMK

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement