Advertisement
Advertisement
Abn logo
Advertisement

తగ్గుముఖం!

  • ఉమ్మడి జిల్లాలో అత్యల్పానికి హెచ్‌ఐవీ కేసులు
  • సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు 
  • నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : పులిరాజాకు ఎయిడ్స్‌ వస్తుందా.. అంటూ దశాబ్ధాల కిం దట హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేశారు. ఎయిడ్స్‌ ఎలా సోకుతుంది. వ్యాధి రాకుండా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలతో హోరెత్తించాయి. దీంతో ఏటేటా హెచ్‌ఐవీ కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్‌ నివారణ సంస్థ చేపడుతున్న పలు కార్య క్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైద్యశాఖ ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ బాధితులను గుర్తించి అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేస్తుంది. 


2019-20లోనే కేసులు అధికం..

మూడేళ్ల కాలంలో హెచ్‌ఐవీ కేసులను పరిశీలిస్తే.. 2019-20 సంవత్సరంలోనే కేసులు అధికంగా ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని రంగారెడ్డి జిల్లాలోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో 1,45,433 మందికి పరీక్షలు చేయగా ఇందులో 781కి పాజిటివ్‌గా తేలింది. ఎక్కువగా నగర శివారులోని శేరిలింగంపల్లి, కొండాపూర్‌, చందానగర్‌, మహేశ్వరం ప్రాంతాల్లో ఎయుడ్స్‌ కేసులు అత్యధికకంగా నమోదయ్యాయి. విచ్చల విడి శృంగారం వల్ల, ఎయిడ్స్‌ రోగి నుంచి రక్తమార్పిడి, సిరంజీలు వాడకం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. మృతుల సంఖ్యను పరిశీలిస్తే 2010 నుంచి 2019 వరకు 928 మంది ఈ వ్యాధిబారిన పడి మృతి చెందినట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. 


అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలి

హెచ్‌ఐవీని జీరో శాతం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నాం. అనుమానం ఉంటే.. వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేస్తారు. పేరు, వివరాలు గోప్యంగానే ఉంచబడతాయి. ఎయిడ్స్‌ పట్ల భయం వీడాలి. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రతిఒక్కరూ ఆప్యాయంగా మెలగాలి. 

- అరుణకుమారి, ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారి


అవగాహన కల్పిస్తున్నాం

అవగాహన కల్పిస్తున్నాం. హెచ్‌ఐవీ పట్ల విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. హెచ్‌ఐవీ రాకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా గ్రామాల్లో ముందుకు వెళ్తున్నాము. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందేలా కృషి చేస్తున్నాము.

- డాక్టర్‌ సన్మాన్‌


మూడేళ్లగా నిర్వహించిన హెచ్‌ఐవీ పరీక్షలు, పాజిటివ్‌లు (జనరల్‌ అండ్‌ గర్భిణులు)

సంవత్సరం పరీక్షలు పాజిటివ్‌

2019-20 2,03,316 825

2020-21 1,41,619 827

2021-22 69,040 458

మొత్తం 4,13,975 2,110

Advertisement
Advertisement