Abn logo
Sep 24 2021 @ 00:21AM

తరాల తేడా లేని అధికార లాలస

విశ్రాంత జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించాలి? ‘ఇంకా ఎందుకు ఆడుతున్నారు అని ఒక విధమైన అసహనంతో అభిమాన కోటి అడిగినప్పుడు కాక, ఎందుకు ఇంత ఆకస్మికంగా వైదొలుగుతున్నారని వారు ఆశ్చర్యంతో ప్రశ్నించినప్పుడే వీడ్కోలు తీసుకోవాలి..’ -మన తాతల తరంలోని క్రికెట్ దిగ్గజం విజయ్ మర్చంట్ (1911–87)అన్నమాటగా దీన్ని ప్రస్తావిస్తుంటారు. 1951లో ఇంగ్లండ్ టీమ్‌కు వ్యతిరేకంగా అద్భుతమైన, ప్రతిభావంతమైన సెంచరీ సాధించిన శుభసందర్భంలో టెస్ట్ క్రికెట్ నుంచి తాను శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్టు విజయ్ ప్రకటించారు. 


అవును, విశ్రాంత జీవితంలోకి ప్రవేశించేందుకు సరైన సమయమేదో నిర్ణయించుకోవడం అంత తేలికేమీ కాదు-– కనీసం క్రికెట్‌లో. ‘నీ ఆట ఇక చాల్లేవయ్యా, కొత్తవారికి అవకాశమిద్దాం’ అంటూ మిమ్ములను సదా సతమతం చేసేందుకు సెలక్షన్ బోర్డ్ అనేది ఒకటి ఉంది. కార్పొరేట్ కంపెనీలలో అయితే ఒక సిఇఓ ఎప్పుడు రిటైర్ కావాలో నిర్ణయం తీసుకునేది సంస్థ నిర్వాహకులే. బ్యూరాక్రసీలో అయితే ఒక ఉద్యోగి లేదా అధికారి ఎన్నేళ్లకు రిటైర్ కావాలో అధికారికంగా నిర్దేశితమై ఉంటుంది. మరి, రాజకీయరంగం భిన్నమైనది. ఇక్కడ రిటైర్మెంట్ వయస్సునకు పరిమితి ఉండదు. కొత్త వారికి బాధ్యతలు సాఫీగా అప్పగించేందుకు ఎలాంటి వ్యవస్థీకృత యంత్రాంగమూ ఉండదు. ఈ కారణంగానే సమకాలీన భారత రాజకీయ నాయకత్వంలో తరం మార్పు అనేది ఇక బృహత్ సవాల్‌గా, మహా అవరోధంగా ఉంది. 


పంజాబ్‌లో ఇటీవలి రాజకీయ ఉపద్రవాన్నే చూడండి. క్విట్ ఇండియా ఉద్యమ సంవత్సరంలో జన్మించిన 79 ఏళ్ల ముఖ్యమంత్రిని బలవంతంగా తొలగించారు. అక్కడ ప్రభుత్వ నాయకత్వంలో మార్పు జరిగిన తీరు గౌరవ ప్రదంగా లేదు. కెప్టెన్ అమరీందర్ సింగ్ తొమ్మిది సంవత్సరాల నుంచి పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు విజయం సాధించిపెట్టిన ఘనత ఆయనదే. 2016లో శాసనసభ ఎన్నికల సందర్భంగా అవే తనకు చివరి ఎన్నికలు అని ఆయన స్పష్టంగా ప్రకటించారు. అయితే ఈ ఏడాది తొలినాళ్ళలో అమరీందర్ తన మనసు మార్చుకున్నారు. ‘ప్రజలకు సేవ చేసేందుకై’ తాను అధికారంలో కొనసాగుతానని ఆయన నొక్కిచెప్పారు. పాటియాలా మహారాజా కుటుంబ వారసుడు అమరీందర్. ఈ కులీనవంశ సంజాతుడు ఒక సైనిక చరిత్రకారుడు, ఒక పాక ప్రవీణుడు, ఒక క్రీడాకారుడు, కథలు చెప్పడంలో ఒక మహానేర్పరి. అయితే ముఖ్యమంత్రి దంతగోపురంలో ఉంటే ఎలా? నిత్యం ప్రజలను కలుస్తుండాలి. ప్రజలకే కాదు సహచర శాసనసభ్యులకు సైతం ఆయన దర్శనం దుర్లభ్యం. అయినా ఆయనను ఆక్షేపించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అలసించింది. తొలగించేందుకు చాలాకాలం ఊగిసలాడింది. ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితేనేం, ఈ కెప్టెన్ శౌర్యవంతుడు. రాజకీయ సమరక్షేత్రాన్ని వదిలి వెళ్ళాలని ఆయన భావించడం లేదు! 


సుదీర్ఘకాలంగా పలు పదవులను నిర్వహించి, వయస్సు పైబడుతున్న తరుణంలో కూడా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ఆరాటపడుతున్న నాయకుడు అమరీందర్ ఒక్కరే కాదు. కాంగ్రెస్‌లో అటువంటి నేతలు ఇంకా ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వయస్సు రీత్యా సప్తపదిలోకి ప్రవేశించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 70 ఏళ్ళ నాయకుడు తన యువప్రత్యర్థి సచిన్ పైలట్‌కు అవకాశం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని 73 ఏళ్ల హరీశ్ రావత్ ఆరాటపడుతున్నారు. హర్యానాలో ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న 74 ఏళ్ల భూ పీందర్‌సింగ్ హూదా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, -దిగ్విజయ్ సింగ్ ద్వయం (ఇరువురూ సప్తపదుల ఉత్తరార్థంలో ఉన్న నేతలే సుమా!) తమ అధికార క్రీడల్లో యువనేత జ్యోతిరాదిత్య సింధియాను ఓడించడమే కాదు, అసలు పార్టీనుంచే పంపించారు. ఇక కాంగ్రెస్ అధిష్ఠానాన్ని చూస్తే ఆ మహానేతలలో పలువురు ౭0వ వడిలో ఉన్నవారే. అష్టపదుల్లో ఉన్న ఒక కురువృద్ధుడు కూడా ఆ ప్రతిష్ఠాత్మక కార్యవర్గంలో ఉన్నారు. 


ఏడు సంవత్సరాల క్రితం జాతీయ రాజకీయాలలోకి నరేంద్ర మోదీ ఒక మహాశక్తిగా ప్రవేశించేంతవరకు బీజేపీ నాయకత్వం వయస్సుపరంగా కాంగ్రెస్ నాయకత్వానికి భిన్న మైనది కాదు. కొత్త ప్రధానమంత్రి చేపట్టిన తొలి రాజకీయ చర్యలలో ఒకటి– ‘మార్గదర్శక్ మండల్’ను సృష్టించడం. పార్టీ నాయకత్వానికి మార్గనిర్దేశం చేసే ‘ఉత్కృష్ట నేతల’ సముదాయమే ఆ వేదిక. నిజమేమిటంటే పార్టీలోని వాజపేయి–-ఆడ్వాణీ తరం నాయకులు అందరినీ కీలక విధాననిర్ణయ సంస్థలకు వెలుపల ఉంచడమే దాని లక్ష్యం. మరింత స్పష్టంగా చెప్పాలంటే క్రియాశీల రాజకీయాల నుంచి సదరు పెద్దల నిష్క్రమింపజేయడమే అసలు ఉద్దేశం.


ఏమైనప్పటికీ ‘మార్గదర్శక్ మండల్’ భావన సహేతుకమైనదిగా విదితమవుతోంది. ‘సీనియర్’ నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగేందుకు 75 సంవత్సరాల వయస్సు నిబంధనను విధించి, అమలుపరచడం ద్వారా నాయకత్వంలో తరం మార్పును, పార్టీ శ్రేణుల నుంచి ఎటువంటి వ్యతిరేకత ప్రబలకుండా సాధించడంలో బీజేపీ సఫలమయింది. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులు 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఉన్నవారే. పలువురు తమ యాభైలలో ఉన్నవారు. దేవేంద్ర ఫడణవీస్, యోగి ఆదిత్యనాథ్‌ తమ నలభైలలోనే ముఖ్యమంత్రులయ్యారు. ఇందుకొక మినహాయింపు కర్ణాటక బీజేపీ అధినేత బిఎస్ యడ్యూరప్ప. 78 ఏళ్ళ పండు వయస్సులో ఉన్న యడ్యూరప్పను అనేక ప్రయత్నాల తరువాత ఎట్టకేలకు గతనెలలో ముఖ్యమంత్రి పదవి నుంచి సాగనంపారు. ఇంతకాలం ఆయన తిరుగులేని నాయకుడుగా కొనసాగగలగడానికి ప్రధానకారణం బీజేపీలో అటువంటి శిఖరసమానుడైన లింగాయత్ నాయకుడు మరొకరు లేక పోవడమే.


బీజేపీ నాయకత్వంలో ఇటువంటి తరం మార్పును నరేంద్రమోదీ ఎలా సాధించారు? పార్టీలో నిరాక్షేపణీయమైన సర్వోత్కృష్ట నాయకుడుగా వెలుగొందుతుండడమే అందుకు ప్రధాన కారణం. పార్టీలో మోదీ స్థానం సమున్నతమైనది. అపరిమిత అధికారాలు ఆయనకు స్వాయత్తమైనాయి. తత్కారణంగానే మోదీ తాను అనుకున్నది సాధించగలుగుతున్నారు. గత వారం గుజరాత్ మంత్రిమండలిపై ఆయన నిర్వహించిన సర్జికల్ స్ట్రైకే అందుకొక తిరుగులేని నిదర్శనం. మోదీ కంటే తక్కువ నిరంకుశత్వంతో వ్యవహరించే నాయకుడయితే అలా ప్రభుత్వాధినేతను మార్చివేసి, సంపూర్ణంగా కొత్త మంత్రిమండలికి అవకాశం కల్పించేందుకు సాహసించేవాడు కాదు. అలా సాహసిస్తే ఏమి జరుగుతుందో కాంగ్రెస్ నాయకత్వానికి ఇటీవలి సంవత్సరాలలో బాగా తెలిసివచ్చింది.


ఆసక్తికరమైన విషయమేమిటంటే కుటుంబ జాగీర్లుగా నడపబడుతున్న ప్రాంతీయ పార్టీల అధినేతలు సైతం ‘రిటైర్’ కావడానికి సుముఖంగా లేరు. తమ సొంత కుమారులు, కుమార్తెలకు సైతం అధికారాన్ని అప్పగించేందుకు వారు అంత తేలిగ్గా అంగీకరించడం లేదు. విసుగూ వేసట లేని 80 ఏళ్ల శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత నాయకుడుగా వెలుగొందుతున్నారు. ఒక అర్ధ శతాబ్దం పాటు ముత్తువేల్ కరుణానిధి డిఎంకెకు చిహ్నంగా భాసించారు. -యూపీ, బిహార్‌కు చెందిన ఘటనాఘటన సమర్థులు ములాయం సింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్‌లు యువతరం యాదవ్ నాయకులకు నాయకత్వాన్ని వదిలిపెట్టారంటే అందుకు కారణం, ఇరువురూ అనారోగ్య సమస్యలతో సతమత మవుతుండడమేని చెప్పి తీరాలి. ఒడిషాలో 75 ఏళ్ళ నవీన్ పట్నాయక్ అలసిపోయిన నేతగా కన్పిస్తున్నారు. బిజూ జనతాదళ్‌లో ఆయనే ఏకైక అగ్ర నాయకుడు. నవీన్ వారసుడు ఎవరన్న విషయమై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. 


మన రాజకీయ పార్టీలలో కొట్టొచ్చినట్టు కన్పించేది ఏమిటి? అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడడమే కాదూ? ఈ పరిస్థితుల్లో దేశ జనాభాలో యువపౌరుల సంఖ్య, వయస్సు మీరుతున్న రాజకీయ నాయకత్వం మధ్య ఒక సమతుల్యత నెలకొనడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. రాజకీయాలలో ‘అనుభవం’, ‘స్థాయి’కి అమిత ప్రాధాన్యమున్నందున అటువంటి సమతుల్యతను సాధించడం మరింత సమస్యాత్మకంగా ఉంది. అయితే ఏదీ కష్టసాధ్యం కాదు కదా. కనుక నాయకత్వంలో వృద్ధాప్య సంబంధిత ప్రతిష్టంభనను అధిగమించేందుకు కొన్ని ఆచరణాత్మక సూచనలు చేయడానికి సాహసిస్తున్నాను. అవి: (1) ఏ శాసనసభ్యుడు లేదా పార్లమెంటుసభ్యుడు అయినా సరే గరిష్ఠంగా నాలుగు లేదా ఐదు పర్యాయాలకు మించి చట్ట సభలకు ఎన్నిక కాకుండా ఒక శాసనాన్ని తీసుకురావాలి. (2) పార్టీ సంస్థాగత పదవులలో నాయకత్వ మార్పిడి సూత్రాన్ని కచ్చితంగా పాటించి తీరాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా పార్టీ అధ్యక్షుడుగా రెండు పర్యాయాల కంటే ఎక్కువసార్లు ఉండకూడదు. అధ్యక్ష పదవీకాలం గరిష్ఠంగా నాలుగు సంవత్సరాలుగా ఉండాలి. (3) పార్టీ కమిటీలతో సహా అన్ని స్థాయిలలోనూ ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రాన్ని అమలుపరిచి తీరాలి. (4) శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో సగం టిక్కెట్లను విధిగా యాభై సంవత్సరాల లోపు వయస్సువారికే ఇవ్వాలి. (5) భిన్న తరాల నాయకుల మధ్య ఆరోగ్యకరమైన, తక్కువ ఘర్షణాయుతమైన సంబంధాలను ప్రోత్సహించేందుకు క్రమబద్ధమైన రాజకీయ మార్గదర్శక వ్యవస్థను సృష్టించాలి. 


ఏ రాజకీయ పార్టీనాయకత్వమైనా ఈ సూచనలను నిర్భయంగా, నిస్సంకోచంగా అమలుపరిచేందుకు చొరవ చూపుతుందా? లేక అధికారాన్ని సాధ్యమైనంత సుదీర్ఘకాలం నిలుపుకోవడాన్నే పరమలక్ష్యంగా పెట్టుకుంటుందా? ఇదీ, ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. బీజేపీ విషయాన్ని చూస్తే పార్టీ నాయకత్వంలో తరాల అంతరాన్ని తొలగించి కొత్త తరం నేతలకు ప్రాధాన్యం కల్పించే మార్గంగా ‘మార్గదర్శక్ మండల్’ను చూస్తున్నారు. మరి, 2025 సంవత్సరంలో 75వ వసంతంలోకి ప్రవేశించనున్న నరేంద్ర మోదీ, తన సీనియర్ల విషయంలో అమలుపరిచిన ‘రిటైర్మెంట్’ సూత్రాన్ని తనకూ వర్తింప చేసుకుంటారా? లేక, ‘ప్రజాసేవ’ చేసేందుకే అధికారంలో మరింత కాలం కొనసాగాలని నిశ్చయించుకున్నట్టు నొక్కి చెప్పుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్, ఇంకా పలువురు నాయకుల వలే ‘ప్రధానసేవక్’ సైతం వ్యవహరిస్తారా?

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

ప్రత్యేకంమరిన్ని...