మిల్లర్ల మాయాజాలం

ABN , First Publish Date - 2021-06-21T05:57:04+05:30 IST

ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు ధాన్యం అమ్ముకునే వద్ద సైతం అగచాట్లు తప్పట్లేదు.

మిల్లర్ల మాయాజాలం
న్యాయం చేయాలని ఇంటి వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న రైతులు

 ట్రక్‌ షీట్లు ఇవ్వకుండానే ధాన్యం దిగుమతి
 నాణ్యత పేరుతో నగదులో కోత
 న్యాయం చేయాలని అన్నదాతల నిరసన

వేములపల్లి, జూన 20 :
ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతన్నకు ధాన్యం అమ్ముకునే వద్ద సైతం అగచాట్లు తప్పట్లేదు. గతంలో దళారులను ఆశ్రయించి మోసపోతుండగా అలాకాకుండా ఉండేందుకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు అం డగా నిలిచింది. ప్రస్తుతం మిల్లర్ల మాయాజాలంతో ప్రభుత్వ ధాన్యం కేం ద్రాల్లో సైతం సైతం దోపిడీకి గురవడంతో ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయాధికారులు ధ్రువీకరించి గ్రేడింగ్‌ నిర్ధారించిన పిదపే నిర్వాహకులు ధాన్యం కొనుగో లు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధర అందిస్తున్నారు. కాని ధాన్యం దిగుమతి సమయంలో మిల్లర్లు మరోమారు ధాన్యం నాణ్యత లేదంటూ తరు గు పేరుతో కోత విధించడంతో రైతులు నష్టపోతున్నారు. కోత విషయ మై నిర్వాహకులు రైతులకు తెలపడంలో బిల్లులు చెల్లిస్తుండడంతో రైతు ల ఖాతాల్లో నగదు తక్కువగా జమ కావడంతో నష్టపోతున్నామని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయాధికారులు దృవీకరించిన ధా న్యాన్ని మిల్లర్లు మరోమారు నాణ్యత లేదని ధాన్యంలో కోత విధించడం ఎంతవరకు సమంజసమని, నిర్వాహకులు సైతం ఈవిషయంలో అంటిముట్టనట్లుగా వ్యవహరించి మిల్లర్లకు అనుకూలంగా మారుతున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
 తరుగు పేరుతో దోపిడీకి తెర
మండలంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సల్కునూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి రైతులకు ట్రక్‌ షీట్లు(కొనుగోలు పత్రాలు) ఇవ్వకుండానే ధాన్యాన్ని దిగుమతి చేశారంటూ పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో ధాన్యం కాంటా వేసే సమయంలో రైతులకు నోటిమాటగా మీకాంటాను వేశామని హమాలి ఛార్జీలు వసూలు చేసిన నిర్వాహకులు రశీదులు ఇవ్వకుండానే మిల్లుకు ధాన్యాన్ని తరలించారు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో నగదు జమా అయినవారు తాము మార్కెట్‌లో దోపిడీకి గురయ్యామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఇదేంటని నిర్వాహకులను అడగ్గా మిల్లులో  దిగుమతి సమయంలో ధాన్యం నాణ్యతగా లేదని, తేమ శాతం అధికంగా ఉందని సాకులు చెబుతూ కోత విధించినట్లు చెబుతున్నారు.
 న్యాయం కోసం అన్నదాతల అగచాట్లు
తరుగు పేరుతో దోపిడీకి గురయ్యామని గుర్తించిన పలువురు రైతులు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఒక లోడు ధాన్యంలో పది మంది రైతులకు సంబంధించి ఒక క్వింటాకు 12కేజీల చొప్పున తరుగు పేరుతో 30క్వింటాళ్ల మేర కోత విధించి రూ.56,640 నష్టపరిచినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదుతో తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిసింది. మరో రైతు సైతం కొద్ది రోజుల క్రితం తనకు పది క్వింటాళ్ల మేర కోత విధించి నష్టపరిచినట్లు తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. నేటి వరకు తన ఖాతాలో నగదు జమ కాకపోవడంతో స్వగృహంలో అర్ధనగ్నంగా శనివారం నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్న వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే విషయమై ఐకేపీ నిర్వాహకుడిని వివరణ కోరగా తరుగు విషయమై రైతులకు సమాచారం అందించగా కొందరు రైతులు మిల్లర్లతో మాట్లాడుకున్న పిదపే వారి అంగీకారంతోనే తరుగు తీయడం జరిగిందని, కొందరు మాత్రం మిల్లుల వద్దకు రావడానికి నిరాకరించినట్లు పేర్కొన్నారు.
అమ్మిన దానికి నగదుకు పొంతన లేదు
- బంటు నందు, రైతు, ఆమనగల్లు


లక్ష్మీదేవిగూడెం గ్రామ సమీపంలో సల్కునూరు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో మా నాన్న  మట్టయ్య పేరుమీద 119బస్తాల ధాన్యం కాంటా వేసి 47.60 క్వింటాళ్ల ధాన్యం విక్రయించా. కానీ బ్యాంక్‌ ఖాతాలో నగదు జమయ్యే సమయానికి 44.80క్వింటాలకు గాను రూ.1888 చొప్పున రూ.88,582మాత్రమే జమయ్యాయి. 2.80క్వింటాళ్ల మేర తరుగు కింద రూ.5,286 నష్టపోయాం.
రూ.10వేలు నష్టపోతున్నాం
- ముండ్ల గురవయ్య, రైతు, ఆమనగల్లు

పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో నా భార్య గురవమ్మ పేరున 335బస్తాల ధాన్యాన్ని విక్రయించా. మిల్లులో దిగుమతి చేసే సమయంలో 13బస్తాల ధాన్యాన్ని తరుగు పేరుతో కోత విధించి 322బస్తాలకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1888 చొప్పున రూ.2,43,174గా రశీదు ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నిస్తే మిల్లు యజమాని ధాన్యం నాణ్యతగా లేదని కోత విధించినట్లు తెలిపారు. దీంతో సుమారు రూ.10వేల మేరా నష్టపోయాను. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోని తగిన న్యాయంచేసి ఆదుకోవాలి.

Updated Date - 2021-06-21T05:57:04+05:30 IST