ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయం

ABN , First Publish Date - 2022-01-20T05:19:30+05:30 IST

ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా నగరంలో పట్టణ ప్రగతి నిధులతో మొదటి దశలో 30 ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు నగర మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు.

ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయం
ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభిస్తున్న మేయర్‌ వై సునీల్‌రావు

- నగరంలో పట్టణ ప్రగతి నిధులతో 30 ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు  

- మేయర్‌ వై సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 19: ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా నగరంలో పట్టణ ప్రగతి నిధులతో మొదటి దశలో 30 ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు నగర మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. బుధవారం నగరంలోని 4వ డివిజన్‌లో రూ. 12 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను స్థానిక కార్పొరేటర్‌ నుజహత్‌ ఫర్హీన్‌అలీతో కలిసి మేయర్‌ ప్రారంభించారు. అలాగే రూ. 2 లక్షలతో చేపట్టిన యూజీడీ పైపులైన్‌ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా మొదటి విడతగా 3.50 కోట్ల రూపాయలతో 30 ఓపెన్‌ జిమ్‌లను ప్రజల ఆరోగ్యం కోసం నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఓపెన్‌ జిమ్‌కు రూ. 10 నుంచి 12 లక్షలు కేటాయించి వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్‌ పరిధిలో ఒక ఓపెన్‌ జిమ్‌ ఉండాలనే సంకల్పంతో మొత్తం 60 ఓపెన్‌ జిమ్‌లకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. మొదటి విడత కింద ఇప్పటి వరకు దాదాపు 26 ఓపెన్‌ జిమ్‌లను ప్రారంభించామని తెలిపారు. రెండవ విడత కూడా మిగతా ప్రాంతాల్లో మరో 30 ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవసరం ఉన్న చోట కూడా ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 4వ డివిజన్‌ పరిధిలో పేద మధ్యతరగతికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం అయినందున వారికి అందుబాటులో ఉండేవిధంగా వివిధ రకాల పరికరాలతో కూడిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చామన్నారు. డివిజన్‌లో ప్రధాన సమస్యగా మారిన ప్రవిస్టా డ్రైనేజీ సమస్యను కూడా స్మార్ట్‌ సిటీలో పెట్టి త్వరలోనే టెండర్లు పిలిచి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రైనేజీ సమస్యతో స్థానిక ప్రజలు దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ప్రాధాన్యతగా తీసుకొని త్వరలోనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఖాన్‌పురా రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌ సమి, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ హైమద్‌ హుస్సేన్‌, డీఈ మసూద్‌ అలీ, ఏఈ గఫూర్‌ డివిజన్‌ ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T05:19:30+05:30 IST