ఉప ఎన్నికలో జోరు పెంచిన ప్రధాన పార్టీలు

ABN , First Publish Date - 2021-04-03T08:15:08+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సన్నద్ధతలతో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి.

ఉప ఎన్నికలో జోరు పెంచిన ప్రధాన పార్టీలు
బూత్‌కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

తిరుపతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు ర్యాలీలు, ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న నేతలు, కార్యకర్తలు. మరోవైపు ఆయా వర్గాలు, పార్టీ శ్రేణులతో నేతల సమావేశాలు. ఇలా శుక్రవారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సన్నద్ధతలతో ప్రధాన పార్టీలు జోరు పెంచాయి.


‘తెలుగు’ తమ్ముళ్లకు  ప్రాధాన్యమిస్తాం 

తెలుగుదేశం పార్టీ బూత్‌ కన్వీనర్లతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రేణిగుంటలో సమావేశమయ్యారు. మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని, కార్యకర్తలకు ప్రాధా న్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఉప ఎన్నికకు శ్రేణులను సన్నద్ధులను చేశారు. మాజీ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు,నేతలు పులివర్తినాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, నరసింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. మరోవైపు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే హేమలత, నఇంఛార్జి జేడీ రాజశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, పుంగనూరు శ్రీనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఎన్‌ కండ్రిగలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రచారం నిర్వహించారు. తిరుపతి నగర టీడీపీలో యువతను క్రియాశీలం చేయడంపై తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా 4వ తేదీన నగరంలో చైతన్యయాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించి ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. నారా లోకేష్‌ పాల్గొననున్న ఈ కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. 


వైసీపీ ప్రచారం

తిరుపతి నగరం కొర్లగుంట, తుడా రోడ్డు, తాతయ్యగుంట ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేపట్టిన ప్రచారంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, పేర్ని నానీ, టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. దళితుల ఆత్మీయ సదస్సులో మంత్రి పేర్ని నాని, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ తదితరులు పాల్గొని పార్టీ విజయానికి సహకరించాలని అభ్యర్థించారు. పిచ్చాటూరులో మాజీ ఎమ్మెల్సీ జయచంద్రనాయుడును మంత్రి కొడాలి నానీ, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు కలిశారు.


హోదా అవుట్‌ డేటెడ్‌: బీజేపీ 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడమనేది అవుట్‌ డేటెడ్‌ అంశమని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ తదితరులు తేల్చిచెప్పారు. తిరుపతిలో వీరు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్‌ రెడ్డి, సామంచి శ్రీనివాస్‌ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాగా, రేణిగుంట, ఏర్పేడు మీదుగా శ్రీకాళహస్తి వరకూ పార్టీ అభ్యర్థి రత్నప్రభ రోడ్‌ షో నిర్వహించారు. తిరుపతిలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల జేఏసీ సమావేశంలో బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌, సీపీఎంల ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చింతా మోహన్‌ సత్యవేడు, నాగలాపురం మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట సత్యవేడు కాంగ్రెస్‌ ఇంఛార్జి పెనుబాల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఇక సీపీఎం అభ్యర్థి యాదగిరి గెలుపు కోసం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ప్రచారం కూడా నిర్వహించారు.


తిరుపతికి చేరుకున్న నారా లోకేష్‌   

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంటలోని నక్షత్ర కన్వెన్షన్‌ హోలులో ఆయన నాయకులతో సమావేశమయ్యారు.ఉప ఎన్నికలకు పార్టీ యంత్రాంగం ఏ మేరకు సన్నద్ధమైందన్న విషయమై వారితో సమీక్షించారు. నాయకుల మధ్య సమన్వయం, ప్రచార బాధ్యతలను ఆయన ప్రధానంగా పర్యవేక్షించనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు తిరుపతి లోక్‌సభ పరిధిలోనే అందుబాటులో ఉంటున్నారు. శనివారం లోకేశ్‌ పాల్గొనే కార్యక్రమాల వివరాలు తెలియరాలేదు. మొత్తానికీ ఆయన తిరుపతి చేరుకోవడంతో పార్టీ యంత్రాంగంలో ఓ విధమైన అప్రమత్తత కనిపించింది. 


నేడు తిరుపతిలో పవన్‌ పాదయాత్ర

తిరుపతి(జీవకోన), ఏప్రిల్‌ 2: తిరుపతిలో శనివారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్‌ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు విమానాశ్రయం నుంచి నేరుగా ఎంఆర్‌పల్లె సర్కిల్‌ వద్దకు చేరుకుంటారన్నారు. అక్కడ్నుంచి ఎయిర్‌భైపాస్‌ రోడ్డు మీదగా శంకరంబాడి సర్కిల్‌ వరకు పాదయాత్రగా వచ్చి బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గెలుపుకోసం పవన్‌ చేపట్టే పాదయాత్రలో పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణలోని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం తిరుపతి ప్రచారంలో పాల్గొననున్నారు.

Updated Date - 2021-04-03T08:15:08+05:30 IST