పట్టణ ప్రకృతిపై మేడ్చల్‌ జిల్లాలో బృహత్‌ ప్రణాళిక

ABN , First Publish Date - 2022-01-17T04:07:46+05:30 IST

పట్టణ ప్రకృతిపై మేడ్చల్‌ జిల్లాలో బృహత్‌ ప్రణాళిక

పట్టణ ప్రకృతిపై మేడ్చల్‌ జిల్లాలో బృహత్‌ ప్రణాళిక

  • బృహత్‌ వనాల ఏర్పాటుకు మేడ్చల్‌ జిల్లాలో ఐదు మండలాల్లో స్థలాల సేకరణ పూర్తి
  • చకచకా సాగుతున్న పనులు
  • వనాల్లో మొక్కలు నాటడం ప్రారంభం

( ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో అడవులపెంపకం, పల్లె, పట్టణ ప్రకృతి వనాల పెంపకంపై జిల్లాయంత్రాంగం దృష్టి సారించింది. పక్కా ప్రణాళితో ముందుకెళ్తుండడంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీనికితోడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి  ఆదాయంతో పాటు ఆహ్లాదం పంచాలనే లక్ష్యంతో కొత్తగా పల్లెప్రకృతి బృహత్‌ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.  ఐదునుంచి పది ఎకరాల్లో వనాలను ఏర్పాటు చేసేందుకు  లక్ష్యం కాగా, ఇప్పటికే జిల్లాలో ఐదు మండలాల్లో స్ధలాల సేకరణతోపాటు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో జిల్లాలోని ఐదు మండలాల్లో  ఏర్పాటు చేసిన బృహత్‌ వనాల పనులు ఊపందుకున్నాయి. కీసర మండలం పరిధిలోని అడవిలో  1,284 ఎకరాల్లో 1.47 లక్షల మొక్కలను పెంచుతున్నారు. తొమ్మిది మునిసిపాలిటీల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలను తీర్చిదిద్దుతున్నారు.  

 మండలాల వారీగా స్థలాల సేకరణ

 బృహత్‌ పల్లెప్రకృతి వనాలకు మేడ్చల్‌జిల్లాలో ఘట్‌కేసర్‌ మండలంలో కాచవానిసింగారంలో 8ఎకరాలను సేకరించారు. ఈ స్థలంలో వేయి మొక్కలను నాటారు. శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట్‌లో 10 ఎకరాలు సేకరించగా అందులో ఐదు వేల మొక్కలు నాటారు. మేడ్చల్‌ మండలం శ్రీరంగవరంలో 10 ఎకరాల భూమిని సేకరించారు. ఈభూమిలో ఎక్కువ రాళ్లు ఉండడంతో వాటిని తొలగించి చదను చేయడానికి కొంత అలస్యం అవుతోంది. ప్రస్తుతానికి 400 మొక్కలు నాటారు. మూడుచింతలపల్లి మండలంలోని జగన్‌గూడలో 9 ఎకరాలు సేకరించారు. అందులో 6 వేల మొక్కలునాటారు. కీసర మండలం చీర్యాలలో 10 ఎకరాల భూమి సేకరించారు. ఒక్కొక్క బృహత్‌ సంపద వనాన్ని పెంచడానికి ఈజీఎస్‌ నుంచి నుంచి రూ. 45 నుంచి రూ. 60 లక్షలు ఖర్చుచేస్తున్నారు. దీనికి తోడుఈవనాలకు దాతలు అవసరమైన మేరకు చేయూతందిస్తున్నారని జిల్లాగ్రామీణ అభివృద్ధి అధికారి పద్మజ తెలిపారు.

అర్థిక వనరుల కోసం

బృహత్‌ప్రకృతి వనాలతో ప్రధానంగా ఒక వైపు ఆదాయం, మరో వైపు కాలుష్యం నివారణ,  ప్రజలకు ఫిక్‌నిక్‌ స్పాట్‌గా అభివృద్ధి చేయడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ముందుకుగా స్థలాన్ని చదను చేసిన అనంతరం పండ్లు, సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటడంతోపాటు ఆదాయం వచ్చె టేకు, గంధం, నీలగిరి, ఉసిరి, జామ, మామిడితో, పూలు, ఇతర మొక్కలు నాటుతున్నారు. ఐదు నుంచి పదేళ్లలోపు నాటిన మొక్కలు  పెద్దవై ఆదాయం సమకూరనుందని అధికారులు పేర్కొన్నారు.  అప్పటి వరకు వనాల సంరక్షణకు గ్రామీణ ఉపాధిహామీ, పదిశాతం గ్రీనరీ నిధులు వెచ్చిస్తున్నారు.

సహకరిస్తున్నాం:  కొంతం వెంకటరెడ్డి సర్పంచ్‌, కాచవానిసింగారం

బృహత్‌ ప్రకృతి వనంలో భాగంగా  గ్రామంలో ఎనిమిది ఎకరాల స్థలం కేటాయించాం. ఈవన్నాన్ని అభివృద్ధి చేయడానికి పంచాయతీ, గ్రామస్థుల పరంగా సహకారం అందిస్తాం. అధికారులు  సిబ్బందితో మొక్కలు నాటిస్తున్నారు. ప్రస్తుతం ఎకరం భూమిలో వనాన్ని పెంచాం.


Updated Date - 2022-01-17T04:07:46+05:30 IST