పువ్వుల్లో దాగున్న ఔషధం!

ABN , First Publish Date - 2021-06-06T05:30:00+05:30 IST

పువ్వుల సువాసన, అందాలకు మనందరం దాసోహులమే! ఆయుర్వేదంలోని ప్రత్యేకమైన శాఖ

పువ్వుల్లో దాగున్న ఔషధం!

పువ్వుల సువాసన, అందాలకు మనందరం దాసోహులమే! ఆయుర్వేదంలోని ప్రత్యేకమైన శాఖ పుష్ప ఆయుర్వేదంలో కూడా పువ్వులతో నయం చేయగల రుగ్మతల ప్రస్తావన ఉంది. రకాన్ని బట్టి పూర్తి పువ్వును, రేకులను, పుప్పొడిలను ఔషధాల తయారీలో వాడతారు. ఇలా రుగ్మతల చికిత్సలో ఉపయోగపడే పువ్వులు ఇవే!


 మందారం: మందారంతో తయారుచేసిన ఆయుర్వేద తేనీటితో అధిక రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది. డయేరియా, పైల్స్‌, మెదడులో రక్తస్రావం, వెంట్రుకలు రాలడం, హైపర్‌టెన్షన్‌, దగ్గులకు కూడా మందారంతో తయారుచేసిన ఆయుర్వేద ఔషధం ఉపయోగపడుతుంది. 


 గులాబీ: గులాబీల్లో టానిన్లు, విటమిన్‌ ఎ, బి, సిలు ఉంటాయి. ఈ పువ్వులతో తయారైన ఎసెన్షియల్‌ ఆయిల్‌లో ఫ్యాటీ ఆయిల్‌, ఆర్గానిక్‌ యాసిడ్లు ఉంటాయి. గులాబీ రసాన్ని ఒంట్లోని వేడి, తలనొప్పులను తగ్గించడానికి వాడతారు. గర్భిణుల్లో తలెత్తే అతిమూత్ర సమస్యకు విరుగుడుగా ఎండబెట్టిన గులాబీలను తినిపిస్తారు. ఎండిన గులాబీ రేకులు పొట్ట శుభ్రం అవడానికి తోడ్పడతాయి. గులాబీలతో తయారైన మురబ్బాతో జీర్ణశక్తి మెరుగవుతుంది. గులాబీలు తింటే దగ్గు, ఆయాసాలతో పాటు జీర్ణాశయ సమస్యలైన డిస్‌పెప్సియా, అపానవాయు సమస్యలు తొలగిపోతాయి. రోజ్‌ వాటర్‌తో కళ్ల మంటలు తగ్గుతాయి. గులాబీ కషాయం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. 


 చంపక: సువాసనలు వెదజల్లే ఈ పువ్వులను చర్మ వ్యాధులు, దెబ్బలు, పుండ్ల వైద్యంలో ఉపయోగిస్తారు. చంపక కషాయం తలతిరుగుడు, జ్వరం, వెర్టిగో, దగ్గులను తగ్గిస్తుంది. 


 తామర: జ్వరాన్ని తగ్గిస్తుంది. దాహం తీరుతుంది. చర్మం మంటలు, బొబ్బలకు తామర సమర్ధమైన ఔషధం. డయేరియా, బ్రాంకైటిస్‌లకు విరుగుడుగా కూడా పని చేస్తుంది. 


 చామంతి: ఈ పూలతో తయారైన వేడి కషాయం తాగితే కీళ్ల నొప్పులు, జ్వరం తగ్గుతాయి. ఈ నీళ్లలో ముంచి తీసిన దూది ఉండలను అసటకు గురైన కళ్ల మీద ఉంచుకుంటే ఉపశమనం దక్కుతుంది. చామంతి కషాయం మలబద్ధకాన్ని నివారిస్తుంది.


 మల్లె: మల్లె తేనీరు తాగితే ఆందోళన, నిద్రలేమి తగ్గుతాయి. నాడీసంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణసంబంధ సమస్యలు, నెలసరి నొప్పి, ఇన్‌ఫ్లమేషన్‌లకు విరుగుడుగా కూడా మల్లె పూలు ఉపయోగపడతాయి. 


Updated Date - 2021-06-06T05:30:00+05:30 IST