బుసక తోడేళ్లు!

ABN , First Publish Date - 2020-07-01T09:47:35+05:30 IST

మండ లంలోని రొయ్యూరు సొసైటీ భూముల్లో తోడేళ్లు పడ్డాయి. మానవ రూపంలో ఉన్న ఈ తోడేళ్లు అక్రమ పద్ధతుల్లో అర్ధరాత్రుల్లో బుసక

బుసక తోడేళ్లు!

రొయ్యూరులో అర్ధరాత్రి ఎస్సీ సొసైటీ భూముల్లో బుసక తవ్వకాలు

తొమ్మిది లారీలను నిలిపివేసిన సొసైటీ సభ్యులు

క్షమాపణ చెప్పి లారీలను విడిపించి తీసుకెళ్లిన వైసీపీ నేతలు


తోట్లవల్లూరు, జూన్‌ 30 : మండ లంలోని రొయ్యూరు సొసైటీ భూముల్లో తోడేళ్లు పడ్డాయి. మానవ రూపంలో ఉన్న ఈ తోడేళ్లు అక్రమ పద్ధతుల్లో అర్ధరాత్రుల్లో బుసక తోడేస్తున్నాయి. రాజకీయ అండతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఈ దారుణాన్ని సోమవారం అర్ధర్రాతి సొసైటీ సభ్యులు అడ్డుకోవడంతో తోడేళ్ల రంగు బయట పడింది. వారు అధికార పార్టీ నేతల అనుచరులేనని స్పష్టమైంది.


పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు బుసక దందాకి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. సొసైటీ సభ్యులు కలిసి కట్టుగా బుసక తవ్వకాలను అడ్డుకుని తొమ్మిది లారీలను రొయ్యూరు క్వారీ రహదారిలో చెక్‌పోస్టు దగ్గర నిలిపివేశారు. ఆ లారీల డ్రైవర్ల వద్ద ఎలాంటి అనుమతి పత్రాలూ లేకపోవటంతో మంగళవారం మధ్యాహ్నం వరకు అక్కడే నిలిపేశారు. అధికారులకు తెలిపినా ఎవ్వరు స్పందించలేదు. కేసు పెట్టేందుకు సొసైటీ సభ్యులు సిద్ధమవడంతో ఉయ్యూరుకు చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు, స్థానిక వైసీపీ నాయకులు రంగప్రవేశం చేసి సొసైటీ పెద్దలతో మాట్లాడారు.


అక్రమాన్ని అంగీకరించారు. లారీలను విడిచి పెట్టాలని ప్రాధేయపడ్డారు. చేసిన పని తప్పేనని క్షమాపణలు చెప్పారు. సొసైటీ పెద్దలు మెత్తబడటంతో బుసకను దళితవాడలోని కమ్యూనిటీహాలు ఆవరణలో పోసి లారీలను విడిపించుకు వెళ్లారు. గతంలో ఈ భూముల్లో బుసక అనుమతి వచ్చింది. సొసైటీ సభ్యులందరు వ్యతిరేకించటంతో నాటి కలెక్టర్‌ లక్ష్మీకాంతం అనుమతులు రద్దు చేశారు.


రహదారికి ప్రమాదకరం 

మండలంలోని వల్లూరుపాలెం(సౌత్‌వల్లూరులంక)లో రెండు రోజులుగా జరుగుతున్న బుసక తవ్వకాలపై తోడేళ్లదిబ్బలంక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది ఒడ్డున తమ గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే బుసక తవ్వకాలు చేపట్టటంతో రహదారి వరదలకు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు. చాలా లోతుగా బుసక తీయటంతో రహదారి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వైసీపీ నేతలు దొంగల్లా తయారయ్యారు

వైసీపీ నాయకులు ఇసుక, బుసక దొంగల్లాగా తయారయ్యారు. అన్ని క్వారీల్లో వైసీపీ నాయకులు దందా నిర్వహిస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలతకు ఇసుక అక్రమాలను అరికట్టాలని వినతి పత్రం ఇచ్చిన రోజునే ఎస్సీ సొసైటీ భూముల్లో ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు దొంగతనంగా బుసక తవ్వకాలు చేపట్టటం శోచనీయం. అర్ధరాత్రి బుసక తవ్వకాలు చేసిన విషయమై జేసీ విచారణ చేసి నిందితులను శిక్షించాలి.

- వీరంకి వెంకట గురుమూర్తి, మాజీ ఎంపీపీ

Updated Date - 2020-07-01T09:47:35+05:30 IST