తడి ఆరని ఆరుపదుల జ్ఞాపకం

ABN , First Publish Date - 2021-06-13T05:54:54+05:30 IST

రక్తసంబంధీకులు కానివారితో అంతకు మించిన బంధం ఏర్పడితే దానిని ఏ విధంగా నిర్వచించాలి? మా కమతగాడు (పాలేరు) వెంకటయ్యతో బాంధవ్యం అలాంటిదే....

తడి ఆరని ఆరుపదుల జ్ఞాపకం

రక్తసంబంధీకులు కానివారితో అంతకు మించిన బంధం ఏర్పడితే దానిని ఏ విధంగా నిర్వచించాలి? మా కమతగాడు (పాలేరు) వెంకటయ్యతో బాంధవ్యం అలాంటిదే. ఇప్పటికీ నాకు, అతగాడికీ ఏర్పడిన బంధానికి మూలం ఏమిటో నాకు అంతుబట్టదు. కానీ వెంకటయ్య నా జీవన స్మృతులలో ఘనీభవించి నిలిచిపోయిన మనిషి.


వెంకటయ్య మా ఉమ్మడి కుటుంబానికి నా చిన్నప్పటి పాలేర్లలో ఒకడు. మాకుండే నూరెకరాల మాగాణం, 50 ఎకరాల మెట్టపొలం, నూరుకు పైగా గోవులు, గేదెల పనుల కోసం మా కుటుంబం పోషణలో అరవై, డెబ్బయ్‌ మంది పాలేర్లు ఉండేవారు. వాళ్ళలో వెంకటయ్య ఒకడు. అతని భార్య లక్ష్మి. నాకు అప్పుడు ఏడెనిమిదేళ్ళ వయస్సు. నెల్లూరు–నవాబుపేటలో మేనమామ ఇంటిలో ఉండి చదువుతూ ఉండేవాడిని. వెంకటయ్యకు నలభైఏళ్లు ఉండేవేమో. భారీగా నల్లని ఛాయతో, తలపాగ, బనియన్‌తో ఉండేవాడు. మెడలో వెండి తాయత్తు, తెల్లటి పలువరుస. వెంకటయ్య అంటే నాకు ఎంతో ఇష్టం. అతగాడూ నన్ను చేరదీసేవాడు. నేను సెలవులకు ఇంటికి వెళ్ళి అమ్మను చూసిన తరువాత వెంకటయ్య-–లక్ష్మి చుట్టూ తిరుగుతూండేవాడిని. మాకుండే వ్యవసాయ భూములు ఊరికి నాలుగు దిక్కుల పరుచుకుని ఉండేవి. పనులు మొదలవ్వగానే వెంకటయ్య–లక్ష్మీలను ఎటో ఒకవైపు పంపేవారు. నేను వాళ్లను వెతుక్కుంటూ వెళ్లి అక్కడే ఉండేవాడిని. వెంకటయ్య–లక్ష్మిలకు సంతానం లేదు. ఆ కారణం చేత నన్ను చేరదీసేవారేమో? అంతమంది పాలేర్లు ఉన్నా నేను వెంకటయ్యకు మాత్రమే ఎందుకు దగ్గరగా ఉండేవాడినో తెలియదు. అతడిని చూడకుండా ఉండలేకపోయేవాడిని.


వెంకటయ్య పొలంలో నాట్లు వేస్తున్నా, కలుపు తీస్తున్నా, కుప్ప నూరుస్తున్నా గట్టున కూర్చుని ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. పట్నం నుంచి వచ్చిన నాకు ఆ పనులన్నింటినీ చక్కగా వివరించి చెప్పేవాడు. అతను చెప్పే విధానం నాకు బాగా నచ్చేది. అలాగే నా స్కూలు కబుర్లు అడిగేవాడు. నాకు చెప్పిన పాఠాల గురించి చెప్పించుకునేవాడు. వెంకటయ్యకు చదువులేదు కానీ దానిపై ఆసక్తి, గౌరవం ఉన్నాయి. నేను పట్నం నుంచి వస్తున్నానంటే ‘మా అబ్బాయి గారు వస్తున్నారని’ వారం ముందు నుంచి అందరికి అబ్బురంగా చెప్పుకునేవాడంట. నిజానికి పట్నం నుంచి అతనే నన్ను తీసుకువచ్చేవాడు. మా మేనమామ ఊరికి (అల్లీపురం) మా ఊరికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం. స్కూలుకి పండుగ సెలవులు ఇవ్వగానే నన్ను తీసుకొచ్చేందుకు వెంకటయ్యని పంపేవారు. అతను వచ్చి నా మేనమామ సేతు రామిరెడ్డిగారికి నమస్కారాలు పెట్టి నన్ను బస్సులో తీసుకుపోయేవాడు. అప్పట్లో బస్సుల రాకపోకలు తక్కువగా ఉండేవి. నాకేమో ఎప్పుడెప్పుడు ఊరు వెళ్ళి అమ్మ ఒళ్ళో చేరతానా అన్న ఆతృత ఉండేది. బస్సెమో ఎంతకీ రాదాయే. నా ఆతృత గమనించే వాడో ఏమో వెంకటయ్య ‘‘పద బాబు..నడుచుకుంటూ పోదాం. ఆ బస్సు కంటే ముందే పోవచ్చు.’’ అని నన్ను భుజాలపై వేసుకుని కబుర్లు చెబుతూ, పాటలు పాడుతూ మా ఊరు తీసుకెళ్ళేవాడు. ‘వద్దు వెంకటయ్యా, నన్ను దింపు నడుస్తానంటే’ ససేమిరా అనేవాడు. ‘‘వద్దు బాబూ కాళ్ళు నొప్పులు పుడతాయి. మీకు అలవాటు లేదు’’ అనేవాడు. ఇలా రెండుమూడు సార్లు బస్సు ఆలస్యం కావడంతో అతను నన్ను భుజాలపై మోసుకొచ్చిన విషయం అమ్మతో మాటల్లో చెప్పినప్పుడు అమ్మ ఎంతో నొచ్చుకుంది. ‘‘తప్పు చేసావు నాన్నా... నిన్ను మోసుకుంటూ అంత దూరం నుంచి రావడం ఎంత కష్టం.’’ అని పదే పదే అనేది. వెంకటయ్యని పిలిచి వాడి కాళ్ళకి దండం పెట్టించి ‘‘బాబును అలా ఎత్తుకు రాకు. నీకు మాత్రం ఒళ్ళు నొప్పులు రావా! వాడేం పసిపిల్లవాడా?’’ అనేది. అతను మాత్రం ‘‘ఏముందమ్మా’’ అని నా వైపు అపురూపంగా చూసేవాడు. అంతకష్టం అతనికి ఇష్టంగా ఉండేది.


నేను అక్కడ ఉన్నన్ని రోజులు వెంకటయ్య, లక్ష్మి నన్ను నెత్తిన పెట్టుకుని చూసేవారు. నాకు వేరుగా భోజనం పెట్టాలని మా వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ నాకు వెంకటయ్యతో కలిసి తినడమే ఇష్టం. మా ఇంట్లో పెంచలమ్మ అని వంటమనిషి ఉండేది. నేను అమ్మకు దూరంగా వుండి చదువుకునే వాడిని కనుక, సరైన తిండి తిప్పలు ఉండవని పెంచలమ్మకు నన్నుచూస్తే జాలి, ప్రేమ. అందరికంటే ఎక్కువగా పెట్టాలని తాపత్రయపడేది. పాలేర్లకు ఏ ఇంట్లో అయినా మామూలు భోజనమే కదా పెట్టేది. పైగా మా ఇంట్లో అరవై డెబ్భై మంది రోజూ భోజనానికి కూర్చునేవారు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద డేగిశాలలో వండిపెట్టేవాళ్ళు. నేనూ వాళ్ళ వరుసలో వెంకటయ్య పక్కన కూర్చుని తినాలనుకునేవాడిని. కానీ పెంచలమ్మ నన్ను వేరుగా కూర్చొబెట్టి మా కుటుంబ సభ్యుల భోజనం పెట్టాలని చూస్తుండేది. కోడిగుడ్డు వేసి అందరికంటే కాస్త వెన్న ఎక్కువ వేయాలని తాపత్రయ పడేది. నాకేమో వెంకటయ్యతో కలిసి తినడమే బాగుండేది. 


వెంకటయ్యది తక్కువ కులమట. వాళ్ళంతా ఊరికి దూరంగా ఉండేవారు. వెంకటయ్య పొలం పనులు చేసాక ఇంటికి వెళ్ళబోతే నేను అక్కడికి పరిగెత్తేవాడిని. అమ్మ వారించేది కాదు. వెంకటయ్య మాత్రం ‘‘మీరు పెద్దింటోళ్ళు బాబు. మా ఇళ్ళకి రాకూడదు’’ అని అంటూనే నన్ను చేరదీసే వాడు. అతనూ-లక్ష్మి రాచమర్యాదలు చేసేవారు. గొడ్డు కారంతో ఉండే వాళ్ళ వంట నాకు కష్టంగా ఉన్నా అతని మీద ఇష్టంతో అక్కడే వాళ్లందరితో కలిసి తినేసేవాడిని. నాకు కడుపునిండా అన్నం పెట్టడంలో లక్ష్మి పడే ఆనందం అంతా ఇంతా కాదు. 


పండగలు, పబ్బాలకు కమతగాళ్ళందరికీ బట్టలు పెట్టడం మా ఇంటి సాంప్రదాయం. అలా బట్టలు ఇస్తున్నప్పుడు వెంకటయ్యకు ఓ జత ఎక్కువ ఇప్పించాలని నేను ప్రయత్నం చేసేవాడిని. కానీ అతను ససేమిరా అనేవాడు. ‘‘వద్దు బాబు. అలా వేరుగా చూడకూడదు. అందరూ సమానమేగా’’ అనేవాడు. నన్ను ఎంతగా చేరదీసినా మా ఇంట్లో ప్రత్యేకత పొందడం అతడికి ఇష్టం ఉండేది కాదు. కానీ, చాకలి సుబ్బి వ్యక్తిత్వం మరొకరకంగా ఉండేది. మా ఇంటికి వచ్చి బట్టలన్నింటిని పెద్ద మూట కట్టుకుని రేవుకి తీసుకుపోయి ఉతికి, శుభ్రం చేసి తీసుకొచ్చేది. అలా వచ్చినప్పుడల్లా నన్ను వెంటబెట్టుకొని తనింటికి తీసుకెళ్ళి సీసాలో దాచివుంచిన నిమ్మ ప్లేవర్‌ పిప్పరమెంట్లు అప్యాయంగా పెట్టేది. అందుకే అది కనిపిస్తే చాలు, దాని వెంట పరిగెత్తేవాడిని. ఊళ్ళో చాకలివాళ్ళు ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు కాదు. తాము పనిచేసే రెండు, మూడు ఇళ్ళల్లో అన్నం, కూర వేయించుకుని ఇంటికి తీసుకుపోయేవారు. సుబ్బికి భర్త లేడు. అదీ, కొడుకు అంతే. కానీ సుబ్బి మాత్రం అన్నం పెట్టించుకునేటప్పుడు గట్టిగా డిమాండ్‌ చేసి ఎక్కువ పెట్టించుకునేది. దానికి, కొడుకుకు అంత అవసరం లేదు. కానీ వెళుతూ గుడి దగ్గర ఆగి అక్కడ యాచకులకు కడుపు నిండా పెట్టేది. మిగిలినది ఇంటికి తీసుకువెళ్ళి తను, కొడుకు తినేవాళ్ళు. సోషలిజం అంటే ఇదేగా. ఎంతటి ఉదాత్తమైన మనస్సు! ఆ మనుషులు... నిష్కల్మష మనసులు, ఆప్యాయతలు ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కానరావు. అందుకే ఆ స్మృతులు నా మనసు తలుపు తట్టినప్పుడల్లా గుండె బరువెక్కుతుంది.

Updated Date - 2021-06-13T05:54:54+05:30 IST