Abn logo
Aug 10 2021 @ 23:21PM

విలీనం... విరుద్ధం!

సచివాలయం కార్యాలయం

మహిళా పోలీసుల విలీనం మాన్యువల్‌కు వ్యతిరేకం
పోలీస్‌ శాఖలో భిన్నవాదనలు
సమాన హోదా ఇవ్వడంపై కానిస్టేబుళ్ల పెదవివిరుపు


రణస్థలం(శ్రీకాకుళం): 
గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను పోలీస్‌ శాఖలో విలీనం చేయడంపై ఆ శాఖలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానిస్టేబుళ్లతో సమానంగా హోదా కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిర్ణయం పోలీస్‌ మాన్యువల్‌కు వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ ఇదే చర్చ సాగుతోంది. కొద్దిరోజుల కిందట విలీన ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం...తాజాగా యూనిఫారంతో పాటు ఇతర అలవెన్స్‌లు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆగస్టు 15 నుంచి తప్పనిసరి చేశారు.


గ్రామ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 11 శాఖలకు చెందిన ఉద్యోగులను సచివాలయాల్లో నియమించింది. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు, పోలీసులకు ప్రాథమిక సమాచారం అందించేందుకుగాను మహిళా పోలీసులను భర్తీ చేసింది. 930 గ్రామ, వార్డు సచివాలయాలకుగాను...850 మంది మహిళా పోలీసులు నియమితులయ్యారు. ఏడాదిన్నర కిందట జిల్లా స్థాయి కమిటీ సారధ్యంలో వీరి నియామక ప్రక్రియ జరిగింది. శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా నేరుగా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. ఈ ఏడాది అక్టోబరుతో వీరి ప్రొబెషనరీ పిరియడ్‌ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విలీన ప్రక్రియను పూర్తిచేసింది.


కానిస్టేబుల్‌ హోదాను కల్పిస్తూ...ప్రాధాన్య క్రమంలో వివిధ సదుపాయాలు కల్పిస్తోంది. దీనిపై పోలీస్‌ శాఖలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నాలుగు దశలు దాటాల్సి ఉంటుంది. ముందుగా ఎత్తు, ఛాతి కొలతల్లో అర్హత సాధించాలి. తరువాత పరుగు పందెం, హైజంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్స్‌ వంటి శరీర దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించాలి. తరువాత తుది రాత పరీక్ష, మెడికల్‌ ఫిట్‌నెస్‌లో అర్హత పొందాలి. ఇన్ని దాటుకొని మెరిట్‌ సాధిస్తేనే ఉద్యోగానికి ఎంపికవుతారు. ఒక ఏడాది పాటు కఠోరమైన, క్రమశిక్షణతో కూడిన శిక్షణ పూర్తిచేస్తేనే తుదిగా కానిస్టేబుల్‌గా విధుల్లో చేరుతారు అటువంటి కానిస్టేబుల్‌తో సమానంగా పోలీస్‌ శాఖలో విలీనం చేయడం మాన్యువల్‌కు విరుద్ధమన్న వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాలు, బాధ్యతలు అప్పగించడం అనాలోచిత చర్యగా పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

విధులు కత్తిమీద సాము

పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్ల విధులు కత్తిమీద సామే. శాంతిభద్రతల పర్యవేక్షణలో కానిస్టేబుల్‌దే కీలక పాత్ర. పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. పేరుకే ప్రభుత్వం వీక్లీ ఆఫ్‌ ఇచ్చినా స్టేషన్లలో సిబ్బంది కొరత, ఇతరత్రా కారణాలు చూపి నిత్యం డ్యూటీలు వేస్తుంటారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖుల బందోబస్తు, నిందితులను కోర్టుకు తరలించడం, జైలుకు అప్పగించడం వంటి విధుల్లో తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇంతా చేస్తున్న కానిస్టేబుళ్లకు రెండు, మూడు సంవత్సరాలకు బదిలీ తప్పనిసరి. ఎన్నికల నిర్వహణ సమయంలో కోడ్‌ వచ్చిన నాటి నుంచి ముగిసే వరకూ విధుల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అటువంటి కానిస్టేబుల్‌తో సమానంగా మహిళా పోలీసులకు హోదా కల్పించడంపై పోలీసు శాఖలో ఎక్కువ మంది పెదవి విరుస్తున్నారు.