మీటరుంటేనే ఉచితం

ABN , First Publish Date - 2021-01-17T08:44:37+05:30 IST

రాష్ట్రంలో 1983 నుంచి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు లేవు. అంతకుముందున్న మీటర్లను ఎన్టీ రామారావు ముఖ్యమంత్రికాగానే తొలగించారు.

మీటరుంటేనే ఉచితం

  • మోటార్‌కు మీటరు తప్పనిసరి.. 
  • అంగీకరిస్తేనే ఉచిత విద్యుత్తు
  • రైతుల నుంచి 2 అంగీకార పత్రాలు
  • మీటరుకు, బ్యాంకు ఖాతాకు చెరొకటి!
  • రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ప్రక్రియ
  • మార్చిలోపు శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు
  • ఏప్రిల్‌ నుంచి ఇతర జిల్లాల్లో అమలు


సాగుకు ఉచిత విద్యుత్తు కావాలా? అయితే... మోటారుకు కరెంటు మీటరు పెట్టాల్సిందే! ఇది సర్కారు వారి ఆదేశం! వ్యవసాయ కనెక్షన్లకూ మీటర్లు బిగించాలని నిర్ణయించిన సర్కారు... దీని అమలు దిశగా మరో అడుగు ముందుకు వేసింది. రైతులు తమ వ్యవసాయ పంపుసెట్లకు మీటరు పెట్టుకుంటేనే ఉచిత విద్యుత్‌ లభిస్తుందని స్పష్టం చేసింది. దీనిపై విద్యుత్‌ పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌లు) ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో విద్యుత్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తున్నారు. 


అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1983 నుంచి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు లేవు.  అంతకుముందున్న మీటర్లను ఎన్టీ రామారావు ముఖ్యమంత్రికాగానే తొలగించారు. కరెంటు వాడకంతో నిమిత్తం లేకుండా శ్లాబ్‌ పద్ధతిలో బిల్లు చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టారు. పంపుసెట్ల సామర్థ్యాన్ని బట్టి ఏడాదికి కొంత మొత్తం చెల్లించే పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత సీఎం అయిన చంద్రబాబు సైతం ఇదే పద్ధతిని కొనసాగించారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి దీనిని కూడా పూర్తిగా ఎత్తివేసి... వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించారు. ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినా అదే పద్ధతి అమలు అవుతోంది.  ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం మళ్లీ పంపుసెట్లకు మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదనంగా అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరించి... ‘మోటారుకు మీటరు’ పెట్టాలని నిర్ణయం తీసుకొంది. ఎప్పటి నుంచో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నప్పటికీ... కొత్తగా మీటర్ల ఏర్పాటుకు ‘జగనన్న ఉచిత విద్యుత్‌ సరఫరా పథకం’ పేరుతో కొత్త విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం తన మోటర్‌కు మీటర్‌ పెట్టుకోవడానికి అంగీకరించే రైతులకు మాత్రమే ఉచిత విద్యుత్‌ పథకం అమలవుతుంది. ఎవరైనా రైతులు ఇందుకు ఒప్పుకోకపోతే ఉచిత విద్యుత్‌ వర్తించదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేశారు. 


దీని ప్రకారం... రైతుల నుంచి రెండు రకాల అంగీకార పత్రాలను సేకరిస్తున్నారు. ఒకటి... మీటర్‌ ఏర్పాటుకు, రెండోది... తన పేరుతో ఒక బ్యాంక్‌ ఖాతా ఏర్పాటు చేసేందుకు! కరెంటు బిల్లుకు సరిపడా మొత్తాన్ని ప్రభుత్వమే రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ఆ తర్వాత రైతు ప్రమేయం లేకుండానే అదే మొత్తం డిస్కమ్‌లకు బదిలీ చేస్తుంది. ఇలా తన ఖాతాలో డబ్బు వేయడానికి... తీయడానికి కూడా రైతులు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. కేంద్రం విధించిన షరతుల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలోపు ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో, అంటే ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలి.


శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 31 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అందులో ఆరువేలు ‘పెయిడ్‌’ విభాగంలో ఉన్నాయి. అంటే...  ఇవన్నీ ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులకు చెందినవి. వారికి ఉచిత విద్యుత్‌ వర్తించదు. మిగిలిన పాతిక వేల మంది రైతుల నుంచి అధికారులు అంగీకార పత్రాలను సేకరించారు. వారి మోటర్లకు మీటర్లు అమర్చే కార్యక్రమం కూడా ప్రారంభించినప్పటికీ... అది ప్రస్తుతం నెమ్మదిగా నడుస్తోంది. ఈ మీటర్లు ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది. అక్కడ రైతుల ధర్నా కారణంగా రవాణా స్తంభించి, ఇంతవరకూ మీటర్లు అందకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరుకు ఈ జిల్లాలో మీటర్ల ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వరకూ స్మార్ట్‌ మీటర్లు కాకుండా మామూలు మీటర్లే పెడుతున్నారు. 


స్మార్ట్‌ మీటర్లు అయితే వాడకం సమాచారం దానంతట అదే విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుతుంది. మామూలు మీటర్ల రీడిం గ్‌ నమోదు చేసేందుకు ప్రతి నెలా వాటి వద్ద కు సిబ్బంది వెళ్లాల్సిందే. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు సమయం లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లా వరకూ మామూలు మీటర్లు పెట్టాలని నిర్ణయించారు. మిగిలిన జిల్లాల్లో స్మార్ట్‌ మీట ర్లు పెట్టాలని నిశ్చయించారు. మీటర్ల ఏర్పాటు ఎప్పుడు జరిగినా ముందుగా అన్ని జిల్లాల్లో రైతుల నుంచి అంగీకార పత్రాలు మాత్రం సేకరించాలని నిర్ణయించారు. ఆ పని అన్ని జిల్లా ల్లో జరిగి పోతోందని అధికార వర్గా లు తెలిపా యి. ఏప్రిల్‌ తర్వాత ప్రైవేటు ఏజెన్సీల ద్వారా స్మార్ట్‌ మీటర్లు బిగించాలని నిర్ణయించారు.

Updated Date - 2021-01-17T08:44:37+05:30 IST