Abn logo
Jul 29 2021 @ 00:53AM

మైకులు పీకి, బల్లలు విరిచి.. సభా హక్కులంటే కుదరదు!

  • ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు తప్పవు
  • అది భావ ప్రకటన స్వేచ్ఛ కానే కాదు
  • క్రిమినల్‌ చట్టం నుంచి వారికి మినహాయింపు ఉండదు
  • కేరళ కేసులో సుప్రీం సంచలన తీర్పు
  • 1995లో బడ్జెట్‌ సమావేశంలో విపక్ష సీపీఎం విధ్వంసం
  • స్పీకర్‌ కుర్చీనీ విసిరేసిన ఎమ్మెల్యేలు
  • అప్పుడు కేసు పెట్టిన కాంగ్రెస్‌ సర్కారు
  • అధికారంలోకి రాగానే ఎత్తేసిన లెఫ్ట్‌


న్యూఢిల్లీ, జూలై 28: చట్ట సభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కాగితాలు చించి, మైకులు పీకి, బల్లలు విరగ్గొట్టి... అది తమ హక్కు అని, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని చెబితే కుదరదని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది కచ్చితంగా ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడమేనని, దీని కింద వారు క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ‘ప్రజా ఆస్తుల ధ్వంసం’... సభా హక్కుల కిందికి రాదని తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేల సభాహక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. అసెంబ్లీలో ప్రజా ఆస్తులను విధ్వంసం చేసి.. తమకు ప్రివిలేజ్‌(సభా హక్కులు) కింద మినహాయింపు ఉందంటే కుదరదని స్పష్టం చేసింది. ‘క్రిమినల్‌ చర్య’ సభ బయట చేసినా.. వెలుపల చేసినా క్రిమినల్‌ చర్యే అవుతుందని, చట్టం నుంచి వారికి వెసులుబాటు ఉండదని తేల్చిచెప్పింది.


1995లో కేరళ అసెంబ్లీలో నాటి ఆర్థిక మంత్రి కేఎం మణి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా విపక్ష సీపీఎం సభ్యులు ఆందోళనకు దిగారు. ఆరుగురు విపక్ష సీపీఎం ఎమ్మెల్యేలు సభలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మైకులను విరగ్గొట్టారు. సభాపతి కుర్చీని పోడియం నుంచి అవతలికి విసిరేశారు. ప్రిసైడింగ్‌ అధికారి బల్లపై ఉన్న కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశా రు. వీరిలో ప్రస్తుత విద్య, కార్మిక మంత్రి శివన్‌కుట్టి, మాజీ మంత్రి కేటీ జలీల్‌, మాజీ ఎమ్మెల్యేలు ఈపీ జయరాజన్‌, కె.అజిత్‌, సీకే సదాశివన్‌, కె.కుంజమ్మెద్‌ ఉన్నారు. 

వీరిపై నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఆ కేసులు ఎత్తివేసింది. కేరళ హైకోర్టు ఇందుకు అంగీకరించలేదు. దాంతో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 12న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌షాల ధర్మాసనం విచారణ జరిపింది. సదరు నేతలు విచారణ ఎదుర్కోవలసిందేనని తేల్చిచెప్పింది.


‘ఎమ్మెల్యేలు తమకున్న సభాహక్కులు, మినహాయింపుల ద్వారా క్రిమినల్‌ చట్టం నుంచి మినహాయింపు కోరలేరు. అలాంటి మినహాయింపులను కోరితే వారిని ఎన్నుకున్న భారతీయ ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ప్రజా ఆస్తుల విధ్వంసానికి పాల్పడడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో సమానంగా పరిగణించలేం’ అని స్పష్టం చేసింది.


అయితే ఆ సమయంలో విపక్షంతో పాటు అధికారపక్ష సభ్యులూ గందరగోళానికి పాల్పడ్డారని సీపీఎం నేతల తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ తెలిపారు. అధికార పక్షం కూడా సమానంగా తప్పు చేసిందన్నారు. దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ గర్భగుడి అయిన అసెంబ్లీలో కుర్చీలు విసిరేయడం, ఫర్నిచర్‌, సామగ్రి ధ్వంసం చేయడం న్యాయసమ్మతమేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ప్రవర్తనను ధర్మాసనం తప్పుబట్టింది.


‘మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరేం సందేశం ఇస్తున్నారు? సభలో ఈ వికృత చర్యలకు వారిని బాధ్యులను చేయాల్సిందే. లేదంటే ఇలాంటి ప్రవర్తనకు అంతే ఉండదు’ అని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసే ముందు స్పీకర్‌ అనుమతి కావాలని రాజ్యాంగంలో, ఇతర నిబంధనల్లో లేదని స్పష్టం చేసింది.


ఆ మంత్రి రాజీనామా చేయాలి: బీజేపీ

కేరళ ప్రభుత్వ పని తీరును సుప్రీంకోర్టు తీర్పు ఎత్తిచూపిందని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్య, కార్మిక మంత్రి శివన్‌కుట్టి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ డిమాండ్‌ చేశారు.