మందులో మంత్రాంగం...జిల్లాల్లో పెత్తనం

ABN , First Publish Date - 2021-06-15T08:04:59+05:30 IST

‘ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ’... ఈ సంస్థ ప్రతినిధి వస్తే చాలు! జిల్లా కలెక్టర్‌ అయినా సరే... అన్ని సమావేశాలు రద్దు చేసుకుంటారు. ఎన్ని పనులున్నా పక్కన పెడతారు! ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం తలుపు కూడా తట్టకుండా నేరుగా లోపలికి

మందులో మంత్రాంగం...జిల్లాల్లో పెత్తనం

ఐటీ సలహాదారు ‘యూనీ’ దందా

అదీ అదాన్‌ డిస్టిలరీస్‌ అడ్రస్‌లోనే! 

రెండింటికీ కేసిరెడ్డితోనే లింకు

నెలనెలా రాజకీయ నివేదికలు

వాటి ఆధారంగా సర్కారు చర్యలు

కలెక్టర్లపై సూపర్‌బాస్‌లు



పేరు... కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి! ఆయన రాజ్‌ కసిరెడ్డిగా సుప్రసిద్ధుడు! పదవి... రాష్ట్ర ఐటీ సలహాదారు! చేసేది... మద్యంలో మంత్రాంగం! మందుబాబులు కోరుకునే మంచి బ్రాండ్‌లకు మంగళం పలికి... సొంత సరుకును దించడంలో ఆయనదే కీలక పాత్ర అనే ఆరోపణలు! దీనిపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. అయితే... ఇంత దందా వెనుక కేవలం ‘ఒక సలహాదారు’ మాత్రమే ఉంటారా? లేక... పెద్దల పాత్ర కూడా ఉందా? అనే అనుమానాలు ఇప్పటికే తలెత్తాయి. ‘ఆయనతో కచ్చితంగా పెద్దలకూ లింకు ఉంది’ అనేందుకు ఇప్పుడు ఆధారాలు లభించాయి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో లింకులున్న సంస్థ ప్రతినిధులు వెళితే... కలెక్టర్లు కూడా లేచి స్వాగతం పలకాల్సిందే! ప్రజాప్రతినిధులకూ వారంటే ‘భయంతో కూడిన గౌరవం’! పెద్దలతో సంబంధాలకు ఇదే ప్రబల నిదర్శనం! అదేమిటో, ఎలాగో మీరూ చూడండి!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ’... ఈ సంస్థ ప్రతినిధి వస్తే చాలు! జిల్లా కలెక్టర్‌ అయినా సరే... అన్ని సమావేశాలు రద్దు చేసుకుంటారు. ఎన్ని పనులున్నా పక్కన పెడతారు! ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం తలుపు కూడా తట్టకుండా నేరుగా లోపలికి వచ్చినా సరే... ‘రండి, కూర్చోండి’ అని స్వాగతం పలుకుతారు. వారు అడిగిన సమాచారం అందిస్తారు. ఇదీ... ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌వోఏ) ‘పవర్‌’! వీరంతా యూనీ కార్పొరేట్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ నియమించిన వ్యక్తులు. ఆ ఐటీ కంపెనీ అడ్రస్‌ వెతుకుతూపోతే... ఏపీలో మద్యం మార్కెట్‌ను ఏలుతున్న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దగ్గర ఆగుతుంది. ‘మందు దందా’లో చక్రం తిప్పుతున్న కేసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి (రాజ్‌ కసిరెడ్డి) ఎఫ్‌వోఏలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఏమిటి ఈ ఏజెన్సీ?

వైసీపీ సర్కారు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వలంటీర్లకు శిక్షణ ఇచ్చి... ప్రభుత్వానికీ వారికీ మధ్య సమన్వయం కోసం అవసరమైన  సాంకేతిక సహకారం అందించేందుకు ప్రభుత్వం ఒక ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. రామ్‌ ఇన్ఫోటెక్‌ అనే కంపెనీని ఎఫ్‌వోఏగా ఎంపిక చేసింది. ఈ కంపెనీకి నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.68.6 కోట్లు చెల్లిస్తారు. అయితే... మధ్యలో ‘యూనీ కార్పొరేట్‌  సొల్యూషన్స్‌’ అనే సంస్థతో రామ్‌ ఇన్ఫోటెక్‌ జత కలిసింది. సాంకేతిక సహకారాన్ని రామ్‌ ఇన్ఫోటెక్‌ అందిస్తుండగా, మానవ వనరులను సమకూర్చే బాధ్యత ఈ యూనీ కార్పొరేట్‌ది. ఈ సంస్థ కార్యాలయం... ప్లాట్‌ నెం. 26, 27, డోర్‌ నెంబర్‌7-66/2/ ప్రశాంతి హిల్స్‌, ఖాజాగూడ రోడ్‌, హైదరాబాద్‌ అనే చిరునామాలో ఉంది. అసలు విషయం ఏమిటంటే... రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో ‘సుప్రీం’ వేగంతో దూసుకుపోతున్న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అడ్రస్‌ కూడా ఇదే! మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు... అధికారులకు యూనీ కార్పొరేట్‌ ప్రతినిధులు ‘సూపర్‌ బాస్‌’లుగా మారారు. పేరుకే వలంటీర్లకు శిక్షణ, పర్యవేక్షణ! వీరు చేసేదంతా అధికారులపై పెత్తనం, రాజకీయ సమాచార సేకరణే. ప్రతీ మండలంలో ఒక ఎఫ్‌ఓఏ ప్రతినిధి ఉంటారు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో మరొకరు, జిల్లా స్థాయిలో ఇంకొకరు ఉంటారు. ఎవరి స్థాయిలో వారు అధికారులపై ‘నిఘా’ వేస్తారు. వలంటీర్ల విధులను పర్యవేక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అయినా సరే... కేవలం అధికారులపై నిఘా వేసి, వారి నుంచి తమకు అవసరమైన సమాచారం రాబట్టేందుకే ఎఫ్‌వోఏను ఏర్పాటు చేశారు. ఇదంతా ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి పర్యవేక్షణలోనే జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. ప్రైవేటు ఏజెన్సీకి ఇంత పవర్‌ ఎలా వచ్చిందని ఆరాతీస్తే... దాని మూలాలు అదాన్‌ డిస్టిలరీ్‌సతో లింక్‌ అయినట్లు తేలింది. 


ఏం చేస్తారంటే... 

అధికార యంత్రాంగంపై ఎఫ్‌వోఏ ప్రతినిధులు పెత్తనం చేస్తారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? వారిని ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు? వారి వ్యాపకాలు ఏమిటి? అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లాస్థాయిలో ప్రభుత్వ పథకాల ఫలితాలు ఎలా ఉన్నాయి?... ఇలాంటి అంశాలపై పక్కా సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా జిల్లాల వారీగా ‘రాజకీయ నివేదికలు’ పంపిస్తారు. అవి నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరుతాయి. వాటిపై సీఎం స్థాయిలో సమావేశాలు జరుగుతాయి. ఆ నివేదికలపై తక్షణ చర్యలు కూడా ఉంటాయి. ఇటీవలి దాకా... ఈ చర్యలకు కారణం ఏమిటి, దీని వెనుక ఎవరున్నారనేది మిస్టరీగా ఉండేది. కానీ... ఇటీవలి కాలంలో ఈ ఏజెన్సీ ప్రతినిధులు బాగా రెచ్చిపోవడం మొదలైంది. ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి... కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఇతర ముఖ్య అధికారులను కలుస్తున్నారు. వీరు ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన వారని, తప్పనిసరిగా వారు చెప్పింది పాటించాలన్న ఆదేశాలు రావడంతో అధికారులకు వారిని భరించక తప్పడంలేదు. వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా కొందరు అధికారులపై బదిలీ వేటు పడింది. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పెద్దలు తలంటిన సందర్భాలూ బయటకొచ్చాయి. దీంతో ఎఫ్‌ఏవో ప్రతినిధులు సూపర్‌బా్‌సలుగా మారిపోయారు. కొన్ని జిల్లాల్లో అధికారులు సైతం వీరిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరు మరో అడుగు ముందుకేసి కొందరు మంత్రులపైనా ‘నిఘా’ పెట్టినట్లు చర్చ సాగుతోంది.

Updated Date - 2021-06-15T08:04:59+05:30 IST