రూ.3వేల కోట్ల వినియోగంపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-01-20T04:38:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా తెచ్చిన మూడు వేల కోట్ల రూపాయల నిధులలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యాయో.. ఏఏ పనుల కోసం ఖర్చు చేశారో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి డిమాండ్‌ చేశారు.

రూ.3వేల కోట్ల వినియోగంపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలి
విలేకరులతో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి


రాయచోటి, జనవరి 19: వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా తెచ్చిన మూడు వేల కోట్ల రూపాయల నిధులలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యాయో.. ఏఏ పనుల కోసం ఖర్చు చేశారో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి  శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చక్రాయపేట నుంచి రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలకు చెరువులు నింపుతూ.. వెలిగల్లుకు కలుపుతూ ఒక పైపులైన్‌ వేయనున్నట్లు శంకుస్థాపన చేశారని, ఆ పథకం కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో.. ఎంత పని పూర్తి అయిందో చెప్పాలన్నారు. అలాగే చిన్నమండెం, సంబేపల్లె మండలాలకు తాగునీటి పేరుతో రెండు జీవోలను తెచ్చారని, ఇప్పటి వరకు ఆ పనులు కనీసం ప్రారంభమయ్యాయా అని ప్రశ్నించారు. రాయచోటి మునిసిపాలిటీలో అండర్‌ గ్రౌండు డ్రైనేజి పనులు చేపడుతామని చెప్పారని, అయితే ఇప్పటికీ పట్టణంలో మురికినీటి కాలువలు ఎక్కడ చూసినా కంపుకొడుతున్నాయని ఎద్దేవా చేశారు. పట్టణంలో ట్రాపిక్‌ సిగ్నళ్లు, ట్రాపిక్‌ పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేయగానే.. మొత్తం అభివృద్ది జరిగినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో మీరు చెప్పిన.. ఆ మూడు వేల కోట్ల రూపాయలలో ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారో..? గణాంకాలతో సహా చెప్తే.. రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తాము కూడా సంతోషిస్తామని ఆయన అన్నారు.  కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష, మాజీ జడ్‌పిటిసి సభ్యులు నరసారెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోనమల ఖాదర్‌వలి, మాజీ మండల అధ్యక్షులు అనుంపల్లె రాం ప్రసాద్‌రెడ్డి, పెమ్మాడపల్లె సర్పంచ్‌ వాసు, మాజీ సర్పంచ్‌ బసయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:38:52+05:30 IST