ఉదయం రద్దీ...మధ్యాహ్నం నిర్మానుష్యం

ABN , First Publish Date - 2021-05-17T03:53:23+05:30 IST

నగరంలోని మార్కెట్‌లు, దుకాణాలకు ఆదివారం జనం పోటెత్తారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు, మార్కెట్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

ఉదయం రద్దీ...మధ్యాహ్నం నిర్మానుష్యం
అల్లిపురం మార్కెట్‌లో భౌతిక దూరం పాటించకుండా గుమిగూడిన వినియోగదారులు

దుకాణాలు, మార్కెట్లలో కానరాని భౌతిక దూరం

కరోనా భయం మరిచి తోపులాటలు

విశాఖపట్నం, మే 16(ఆంధ్రజ్యోతి): నగరంలోని మార్కెట్‌లు, దుకాణాలకు ఆదివారం జనం పోటెత్తారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు, మార్కెట్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావడంతో జనమంతా ఇళ్లకు దారితీశారు. దీంతో ఉదయం రద్దీగా కనిపించిన ప్రాంతాలన్నీ మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారాయి. కరోనా ఉధృతంగా ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలంటూ పదేపదే చేస్తున్న హెచ్చరికలను పలువురు పెడచెవిన పెట్టారు. సరకులు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. భౌతికదూరం పాటించకపోతే కరోనా వైరస్‌ సోకుతుందనే ధ్యాస కూడా లేకుండా ఒకరిపై ఒకరు పడిపోయి దుకాణాలపైకి ఎగబడడం ఆశ్చర్యం కలిగించింది. కొందరైతే మాస్క్‌లు కూడా ధరించకుండా కనిపించడం కరోనా వ్యాప్తిపై వారిలో ఏ స్థాయిలో స్పృహ ఉందనే విషయం అర్థమవుతుంది. ఉదయం నుంచే నగరంలోని మద్యం, చికెన్‌, మటన్‌ దుకాణాలకు నగరవాసులు క్యూ కట్టారు. చేపలు కొనుగోలుకి వచ్చినవారితో హార్బర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని చేపల మార్కెట్‌ కిటకిటలాడాయి. హెచ్‌బీకాలనీ, పూర్ణామార్కెట్‌, పెదవాల్తేరు, అల్లిపురం మార్కెట్‌ వంటి ప్రాంతాల్లో మాంసం దుకాణాలు ఉదయం 12 గంటల వరకు రద్దీగా కనిపించాయి. మరోవైపు మద్యం దుకాణాలు వద్ద కూడా భారీగానే రద్దీ కనిపించింది. పెదవాల్తేరు, సిరిపురం, హెచ్‌బీకాలనీ, మద్దిలపాలెం, ఆరిలోవ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. 

Updated Date - 2021-05-17T03:53:23+05:30 IST