అమెరికాలో ఇవే ఖరీదైన ఎన్నికలు!

ABN , First Publish Date - 2020-10-30T10:17:31+05:30 IST

వచ్చే నెల 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్ర సృష్టించనున్నా

అమెరికాలో ఇవే ఖరీదైన ఎన్నికలు!

  • 700 కోట్ల డాలర్ల ఖర్చు!!
  • రెండు పార్టీలకూ భారీగా విరాళాలు
  • సేకరణలో ట్రంప్‌, బైడెన్‌ పోటాపోటీ

సెంట్రల్ డెస్క్: వచ్చే నెల 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చరిత్ర సృష్టించనున్నాయి. అధికార రిపబ్లికన్‌ పార్టీ, విపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ కలిసి ఎంతలేదన్నా 700 కోట్ల డాలర్లు(సుమారు రూ.52,101 కోట్లు) ఖర్చుచేయనున్నట్లు అంచనా. దానికి తగినట్లే  రెండు పార్టీలకు భారీఎత్తున విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వీటి సేకరణలో అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ ప్రత్యర్థి జో బైడెన్‌ నడుమ పోటాపోటీ నెలకొంది. కరోనా కారణంగా ప్రచారంతో పాటు విరాళాల సేకరణ కూడా తొలుత మందకొడిగా సాగినా.. పోలింగ్‌ తేదీ దగ్గరవుతున్నకొద్దీ బడాబడా పారిశ్రామికవేత్తలు, టెక్‌ బాస్‌లు, హాలీవుడ్‌ నటులు, దర్శకులు, నిర్మాతల నుంచి ఉన్నత ఉద్యోగులు.. చిరుద్యోగుల వరకు ఇంకా విరాళాలు ఇస్తూనే ఉన్నారు. 



బైడెన్‌కు హాలీవుడ్‌ దన్ను..

2016 ఎన్నికల్లో ట్రంప్‌ 50 కోట్ల డాలర్లు సేకరించి ఖర్చుపెట్టారు. సొంతగా 6.6 కోట్ల డాలర్లు పార్టీ ప్రచారానికి  ఇచ్చారు. నాటి డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఇందులో సగమైనా సేకరించలేకపోయారు. అయితే ఈ ఏడాది జూలై నాటికే ట్రంప్‌ బిలియన్‌ డాలర్లు సేకరించారు. ఇప్పటికీ భారీగా విరాళాలు ఆయనకు వస్తూనే ఉన్నాయి. ఆయన కుమారుడు డొనాల్డ్‌ జూనియర్‌ స్నేహితురాలు కింబర్లీ విరాళాల సేకరణకు నేతృత్వం వహిస్తున్నారు. అయితే బైడెన్‌ డెమెక్రాటిక్‌ ప్రైమరీల్లో పెద్దగా విరాళాలు సేకరించలేకపోయారు. పార్టీలోని ఆయన ప్రత్యర్థులు బెర్నీ శాండర్స్‌, ఎలిజిబెత్‌ వారెన్‌లతో ఆయన పోటీపడలేకపోయారు. అయితే సౌత్‌ కరోలినా ప్రైమరీలో కీలక నేతలంతా ఆయనకు మద్దతివ్వడంతో శాండర్స్‌, వారెన్‌ బరి నుంచి వైదొలిగారు. 18.7 కోట్ల డాలర్లతో బైడెన్‌ ప్రచారం ప్రారంభించారు. హాలీవుడ్‌లో అత్యధికులు ఆయనకు ఆర్థికంగా దన్నుగా నిలబడ్డారు. డెమోక్రాటిక్‌ అభ్యర్థిత్వం కోసం పోటీపడి దెబ్బతిన్న న్యూయా ర్క్‌ మాజీ మేయర్‌, పారిశ్రామికవేత్త మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ తాజాగా పార్టీకి 6 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. ట్రంప్‌, బైడెన్‌ ఇద్దరూ రోజుకు 50 లక్షల డాలర్ల చొప్పున సేకరిస్తున్నారు. కరోనా కారణంగా బాధిత ప్రజలకు ట్రంప్‌ ప్రభుత్వం తలో 1.200 డాలర్లు ఇచ్చింది. ఆ చెక్కులను డెమోక్రాట్‌ సానుభూతిపరులు నేరుగా బైడెన్‌కు పంపించడం గమనార్హం.


సందడి తగ్గినా ఖర్చు తగ్గలేదు..

కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి రాజకీయ వాతావరణంలో స్తబ్ధత ఏర్పడింది. భౌతిక ప్రచారాలు లేవు. పార్టీల నేతలు మాత్రం జూమ్‌ ద్వారా ఉధృతంగా ప్రచారం నడిపిస్తున్నారు. టీవీ ప్రకటనలు ప్రచారం యాడ్లు, డిజిటల్‌ మీడియా, పోలింగ్‌, బెలూన్లు తదితరాలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసేనాటికి రెండు పార్టీలూ ఎంతలేదన్నా 700 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తాయని అంచనా. అమెరికాలో ఎన్నికల్లో పార్టీలకు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు లేదు. అయినప్పటికీ విరాళాలివ్వడం ద్వారా తమ స్టేటస్‌, పలుకుబడిని పెంచుకోవడానికి పలువురు సంపన్నులు ప్రయత్నిస్తారు. ఒకప్పుడు విరాళాలపై పరిమితులుండేవి. అయితే 2010లో సుప్రీంకోర్టు దానిని ఎత్తివేసింది. 

Updated Date - 2020-10-30T10:17:31+05:30 IST