Abn logo
Sep 25 2020 @ 00:00AM

తల్లి భాషే తల్లివేరు

Kaakateeya

  • మాతృభాషను కాపాడుకోవడం అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే! ‘‘ప్రజలు అన్నది, విన్నదే మన భాష. రాతల్లో, గీతల్లో ఉన్నది కాదు’’ అన్నారు వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామమూర్తి. అది నిన్నటి మాట. కానీ ఎప్పుడో రెండువేల అయిదు వందల సంవత్సరాల కిందటే అమ్మ నుడి ఆవశ్యకతను బుద్ధుడు తెలియజేశాడు.


భావాల్ని వ్యక్తం చేయడం జీవులకు ఉన్న ఒక ప్రాథమిక లక్షణం. పశువులు తోక ద్వారా, తల ఊపడం ద్వారా, కాళ్ళు నేలకు రాయడం ద్వారా, బుస కొట్టడం ద్వారా భావాలను వ్యక్తం చేస్తాయి. పక్షులు కూడా రెక్కలాడించడం, రకరకాల ధ్వనుల్ని చేయడం ద్వారా భావాలను వ్యక్తం చేస్తాయి. ఈ వ్యక్తం చేసే విధానాలే క్రమంగా భాషగా మారాయి. భాష మీద కూడా ఆయా ప్రాంతాల వాతావరణం, నాగరికత, సంస్కృతి - సంప్రదాయాలు... వీటన్నిటి ప్రభావం ఉంటుంది. మన మీద ఈ ప్రభావం చూపించే భాషనే ‘మాతృభాష’ అంటాం. అంటే ‘అమ్మ నుడి’. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మాతృభాష ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. అందుకే పిల్లలకు మాటలు రావడం మొదలయ్యాక, అతి కొద్ది కాలంలోనే మనం నేర్పని పదాలు కూడా నేర్పినట్టే పలుకుతూ ఉంటారు. మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. మాతృభాషలో అవగాహనే కాదు, మన సంస్కృతి, జీవన విధానం కూడా ఉంటాయి. ఒక విషయాన్ని మాతృభాషలో వింటే... ఆ విన్న దానికి టీకా, అర్థ, తాత్పర్యాలతో పని ఉండదు. ఆ భావం కొబ్బరి నీళ్ళలా శరీరంలో కలిసిపోతుంది.


మాతృభాషను కాపాడుకోవడం అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే! ‘‘ప్రజలు అన్నది, విన్నదే మన భాష. రాతల్లో, గీతల్లో ఉన్నది కాదు’’ అన్నారు వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామమూర్తి. అది నిన్నటి మాట. కానీ ఎప్పుడో రెండువేల అయిదు వందల సంవత్సరాల కిందటే అమ్మ నుడి ఆవశ్యకతను బుద్ధుడు తెలియజేశాడు.


బుద్ధుని కాలంలో పండిత భాషగా సంస్కృతం ఉండేది. ప్రబోధాలన్నీ ఆ భాషలోనే చెప్పాలనే నియమం ఉండేది. కానీ బుద్ధుడు ఆనాటి ప్రజల భాష అయిన పాలీ భాషను తన ప్రబోధాలకు ఎంచుకున్నాడు. బౌద్ధం బాగా ప్రచారం పొందిన కొన్నాళ్ళకు యెమేలుడు, తేలుకుడు అనే ఇద్దరు భిక్షువులు బుద్ధుని దగ్గరకు వచ్చి - భగవాన్‌! ఇప్పుడు మీ ప్రవచనాలతో ఈ జంబూ ద్వీపం మారుమ్రోగిపోతోంది. మీ వచనాలకు అంత ఆదరణ లభించిది. కానీ ఈ బుద్ధ వచనాలు మరింతగా రాణించాలంటే, ఎక్కువకాలం నిలబడి ఉండాలంటే వాటిని సంస్కృత భాషలోకి మార్చాలి. మేమిద్దరం సంస్కృత పండితులం. చక్కని ఛందస్సుతో పొందుపరచి మీ వచనాలన్నిటినీ సంస్కృతంలోకి మార్చుతాం. అందుకు మీరు అనుమతించాలి’’ అని అడిగారు.


వెంటనే బుద్ధుడు బౌద్ధ సంఘాన్ని సమావేశపరచి - ‘‘భిక్షువులారా! నా ప్రబోధాలను ప్రజల భాషలోనే ఉంచండి. పండిత భాషలోకి వాటిని ఎన్నడూ మార్చకండి’’ అని చెప్పాడు.


అప్పుడు తేలకుడు ‘‘భగవాన్‌! పాలీ భాష కూడా కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రమే మాట్లాడుకొనే భాష. భిక్షువులు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలకు పాలీ భాష కూడా పరాయి భాషే అవుతుంది కదా! అప్పుడేం చేయాలి?’’ అని అడిగాడు.


‘‘ తేలకా! ఇందులో ఏమీ లేదు తికమక! మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల స్థానిక భాషలకి బుద్ధ వచనాలను మార్చి చెప్పండి. ఎక్కడైనా, ఎప్పుడైనా బుద్ధ వచనాలు ఆయా ప్రజల మాతృ భాషల్లో ఉంటే తప్పు కాదు’’ అన్నాడు.


‘‘అలాగే భగవాన్‌!’’ అన్నాడు తేలకుడు వినమ్రంగా.


బుద్ధునికి సంస్కృతంతో పాటు ఆనాటికి ఉన్న కొన్ని ముఖ్య భాషల్లో మంచి పరిజ్ఞానం ఉందని వారందరికీ తెలుసు. మాతృభాష వల్ల కలిగే అవగాహన మరే భాష వల్లా సాధ్యం కాదని బుద్ధుడు గ్రహించే అలా ప్రకటించాడు. ‘తల్లి భాష జ్ఞానార్జనకు తల్లివేరు’ అని బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది!

- బొర్రా గోవర్ధన్‌

Advertisement
Advertisement
Advertisement