హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తీవ్రం

ABN , First Publish Date - 2021-12-08T05:43:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఏపీ ఎన్‌జీవో నంద్యాల అధ్యక్షుడు టి.మణిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి బీసీ వుశేన్‌రెడ్డి హెచ్చరించారు.

హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తీవ్రం
ధర్నా చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు

  1. ఏపీ ఎన్‌జీవో నంద్యాల అధ్యక్షుడు మణిశేఖర్‌రెడ్డి
  2. నల్లబ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల నిరసన


నంద్యాల, డిసెంబరు 7: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని  ఏపీ ఎన్‌జీవో నంద్యాల అధ్యక్షుడు టి.మణిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి బీసీ వుశేన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణను ప్రారంభించారు. మొదటి రోజు విధులకు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్‌జీవో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ 55శాతం ఫిట్‌మెంట్‌తో ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రూ.1600 కోట్లు ఏపీజీఎల్‌ఐ, జీపీఎఫ్‌ తదితర లోన్లకు సంబంధించిన బడ్జెట్‌ను ఇంతవరకు రిలీజ్‌ చేయ కపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుంటే  ఈనెల 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏపీఎన్‌జీవో నాయకులు, కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. 


నంద్యాల(నూనెపల్లె): ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేవీ శివయ్య డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం స్థానిక నూనెపల్లె మున్సిపల్‌ హైస్కూల్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు, సీపీఎస్‌ రద్దు తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం చలపతి, మున్సిపల్‌ పాఠశాలల అధ్యక్షుడు గాలయ్య, ప్రధాన కార్యదర్శి దస్తగిరి   పాల్గొన్నారు. 


ఆళ్లగడ్డ: ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కోటకందుకూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు మంగళవారం ధరించి నిరసన తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు ప్రసాదరెడ్డి, ఎస్‌ఎల్‌టీ కార్యదర్శి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


శిరివెళ్ల: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని ఏపీటీఎఫ్‌ 1938 జిల్లా అదనపు కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు మహమ్మద్‌ ఖాసీం, జిల్లా కార్యదర్శి పీవీ ప్రసాద్‌ కోరారు.  రాష్ట్ర ఉమ్మడి జేఏసీల ఐక్యవేదిక పిలుపు మేరకు ఏపీటీఎఫ్‌, యూటీఎ్‌ఫల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి 55 శాతం ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్‌ చేశారు.  ఉపాధ్యాయ సంఘాల నాయకులు వరాహమయ్య, వెంకటేశ్వర్లు, గురువయ్య, వెంకట రమణ, షమీమ్‌బాను, ప్రమోదిని, సుధాకుమారి, యాసీన్‌ బాబు పాల్గొన్నారు.


చాగలమర్రి: ఏపీ ఐకేజేఏసీ పిలుపు మేరకు మండలంలోని చిన్నవంగలి ఉన్నత పాఠశాల, చాగలమర్రి బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పీఆర్సీని ప్రకటించాలంటూ నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రకటించారు.  10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ తరగతులకు హాజరవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు కోటయ్య, జీవయ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-08T05:43:43+05:30 IST