Advertisement
Advertisement
Abn logo
Advertisement

చర్య వెనుక మర్మం

ఒక రాజ్యంలో ఓ జెన్‌ గురువు ఉండేవాడు. ఆయన జీవన విధానం, విచిత్రమైన ప్రవర్తన అందరినీ ఆకర్షించేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఈ సంగతులు విన్నాడు. అందరూ పొగుడుతున్న ఆ గురువును చూసి తీరాల్సిందేననుకున్నాడు. రాజమహల్‌కు ఆయనను తీసుకురమ్మంటూ మంత్రిని పంపాడు. 


ఆ గురువును మంత్రి కలుసుకొని ‘‘మా మహారాజు మిమ్మల్ని చూడాలనీ, మీ అమృత వాక్కులు వినాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ రోజు మీరు మా రాజమహల్‌కు వేంచేసి, మా రాజావారికి కొన్ని మంచి మాటలు చెప్పాలని మనవి చేసుకుంటున్నాం’’ అన్నాడు.


‘‘సరే! పదండి’’ అంటూ మంత్రి వెంట రాజమహల్‌కు ఆ గురువు వచ్చాడు. 

రాజు ఎంతో సంతోషంగా ఆయనకు ఎదురేగి, నమస్కరించి, స్వాగతం పలికాడు. మహల్‌లోకి తీసుకువచ్చి, ఉన్నతాసనంపై కూర్చోబెట్టాడు. చేతులు జోడించి నిలబడి, ‘‘మీ గొప్పతనం గురించి దేశ ప్రజలు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు. తమరు దయచేసి మాకు ఏదైనా బోధించండి. మీ బోధ వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది’’ అన్నాడు.

అప్పుడు ఆ గురువు అటూ ఇటూ గంభీరంగా చూశాడు. పిడికిలి బిగించి, తన ముందు ఉన్న బల్ల మీద మూడుసార్లు బలంగా కొట్టాడు. ఆసనం నుంచి లేచి, మారు మాట్లాడకుండా బయటకు నడిచి, తన కుటీరానికి వెళ్ళిపోయాడు.

రాజుతో సహా అందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. కొంతసేపటికి తేరుకున్న రాజు తన మంత్రితో ‘‘మంత్రిగారూ! దీని అర్థం ఏమిటి? ఆ గురువు గురించి బాగా తెలిసిన మీకే ఆయన చర్య వెనుక మర్మం బోధపడి ఉండాలి. దయచేసి వివరించండి’’ అని అడిగాడు,

‘‘రాజా! ఈ రోజు గురువుగారు మనకు ఎంతో ఉపయోగకరమైన, ముఖ్యమైన బోధ చేశారు. దాన్ని గ్రహిస్తే మనం ధన్యులమవుతాం’’ అన్నాడు మంత్రి.


రాజు ఆశ్చర్యపోతూ ఇది ముఖ్యమైన బోధా? బల్ల మీద పిడికిలితో మూడుసార్లు గట్టిగా కొట్టడం మంచి బోధా? దాని అర్థం ఏంటో మీరే చెప్పండి’’ అన్నాడు.

‘‘మహారాజా! ఈ అందమైన తోటలను, వైభవోపేతమైన ఆసనాలను, మహలును, దీనిలో మనం గడుపుతున్న జీవితాలను చూసిన గురువుగారు... ఈ రాజ్యం, ఈ సంపద, ఈ వైభవాల్లో ఏ ఒక్కటీ శాశ్వతం కాదనీ, ఇవేవీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవనీ, ఇవి శాశ్వతమని కలలు కంటూ ఎంతో విలువైన కాలాన్ని, జీవితాన్నీ వృధా చేస్తున్నామని స్పష్ట్టం చేశారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా నిద్రలో, మోహంలో, మాయలో, భ్రాంతిలో ఉంటారు. ఇకనైనా లేవండి, మేల్కొనండి, ఈ కలల నుంచి బయటపడండి’ అని తన చర్య ద్వారా బోధిస్తూ గురువుగారు బల్ల మీద పిడికిలితో గట్టిగా కొట్టారు. అవి బల్ల మీద కాదు, మన వీపు మీద వేసిన దెబ్బలు. పగటి కలలుకంటూ నిద్రపోతున్న మనల్ని ఎంతో దయతో ఆయన తట్టి లేపారు’’ అన్నాడు మంత్రి. 

రాచమడుగు శ్రీనివాసులు

Advertisement
Advertisement