నడ్డా టీమ్‌ ఒక చారిత్రక అవసరం

ABN , First Publish Date - 2020-09-29T06:22:21+05:30 IST

భారతీయ జనతాపార్టీలో ఏదైనా పదవి నిర్వహించడమంటే సాధారణ విషయం కాదు. అనేక పార్టీల్లో పదవి అలంకారప్రాయంగా ఉంటుంది. హోదాల కోసం, లెటర్‌హెడ్‌ల కోసం నేతలు పోటీ పడుతుంటారు...

నడ్డా టీమ్‌ ఒక చారిత్రక అవసరం

కొత్త సామాజిక వర్గాలను చేర్చుకుని వారికి అవకాశాలు కల్పించడం బిజెపికి ఒక చారిత్రక అవసరంగా మారింది. నిజానికి పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చాలా రోజుల నుంచిఎదురుచూస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో అరాచక పాలన, మతతత్వ ధోరణులు పెచ్చరిల్లిపోయాయి. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికీ అంతులేకుండా పోయింది. ఈ క్రమంలో బిజెపి ఆ రాష్ట్రాలపై దృష్టి సారించడం, అక్కడి నేతలకు జాతీయస్థాయిలో ప్రాధాన్యం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం.


భారతీయ జనతాపార్టీలో ఏదైనా పదవి నిర్వహించడమంటే సాధారణ విషయం కాదు. అనేక పార్టీల్లో పదవి అలంకారప్రాయంగా ఉంటుంది. హోదాల కోసం, లెటర్‌హెడ్‌ల కోసం నేతలు పోటీ పడుతుంటారు. ఒకసారి పదవి పొందిన తర్వాత తమ వ్యక్తిగత ఎజెండా కోసం పని చేస్తారు. బిజెపిలో బాధ్యతలు అంత సులభంగా రావు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పదవుల్లో ఉన్నవారు రాత్రింబగళ్లు పార్టీ సిద్ధాంతాలపై రాజీపడకుండా పార్టీ విస్తరణ కోసం పనిచేయవలసి ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి నేత భుజస్కంధాలపై పార్టీ కీలక బాధ్యతలు మోపుతుంది. రెండురోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించిన టీమ్ గురించి ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవల్సి ఉంటుంది. 17 కోట్లమంది కార్యకర్తలున్న పార్టీకి జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధులను మినహాయించి కేవలం 40 మందికి మాత్రమే కీలక బాధ్యతలు అప్పజెప్పారంటే వారి ప్రాధాన్యం ఏమిటో తేటతెల్లమవుతుంది.


ఫలానా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామా లేదా అని ఆలోచించే సంస్కృతి బిజెపికి ఎప్పుడూ లేదు. 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడినప్పుడు దేశమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం నిర్మించడం గురించి ఆలోచించారే కాని, ఫలానా రాష్ట్రంలో బలం ఉందా లేదా అని ఆలోచించలేదు. జనసంఘ్ తరఫున పోటీ చేసిన నేతలెవరూ తాము విజయం సాధించగలమా లేదా అన్నది పట్టించుకోకుండా అక్కడ తమ పార్టీని ఎంతమేరకు విస్తరించగలమా అని మాత్రమే ఆలోచించారు.


1955లో ఉత్తరప్రదేశ్‌లో అటల్ బిహారీ వాజపేయి మొట్టమొదటిసారి లక్నో నుంచి పోటీ చేసి అక్కడ మూడో స్థానం సంపాదించారు. 1957లో మూడు సీట్ల నుంచి జనసంఘ్ ఆయనను పోటీ చేయించింది. మథురలో నాలుగో స్థానంలోనూ, లక్నోలో రెండో స్థానంలోనూ నిలిచిన వాజపేయి బలరాంపూర్ నుంచి గెలుపొంది మొట్టమొదటిసారి లోక్‌సభలో ప్రవేశించారు. 1962లో ఆయన బలరాంపూర్, లక్నోల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఓడిపోయారు. 1967లో బలరాంపూర్ నుంచి ఆయన మళ్లీ పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లో తాము అడుగుపెట్టగలమా అని జనసంఘ్ నేతలు సంశయించలేదు. పట్టు వదలని విక్రమార్కుడి లాగా వాజపేయి లక్నో నుంచి ఓడిపోయినా సరే పోటీ చేస్తూ వచ్చారు. జనసంఘ్ 1980లో బిజెపిగా పరివర్తనం చెందిన తర్వాత ఆయన యుపిపై మరింత దృష్టి సారించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 1955 నుంచి మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన వాజపేయి 1991లో పోటీ చేసి విజయం సాధించిన తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు. 1991 నుంచి 2004 వరకు ఆయన అయిదుసార్లు పోటీ చేసి గెలుపొంది లక్నోను బిజెపికి తిరుగులేని కంచుకోటగా మార్చారు. ఆ తర్వాత కూడా లక్నో నుంచి మరో పార్టీ గెలిచింది లేదు. లాల్‌జీ టాండన్, రాజ్‌నాథ్ సింగ్ ఇద్దరూ వాజపేయి నెలకొల్పిన సంప్రదాయాన్ని అనుసరించి లక్నోలో బిజెపి కేతనం ఎగురవేశారు. ఇవాళ లక్నో మాత్రమే కాదు, మొత్తం ఉత్తరప్రదేశ్ బిజెపికి కంచుకోటగా మారింది. అసెంబ్లీలోనూ, లోక్‌సభలోనూ బిజెపిని ఢీకొనేందుకు ఇతర పార్టీలు నానా వ్యూహాలు పన్నాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ జనతాపార్టీ కూడా మారుతూ కొత్త పోకడలను సంతరించుకుంటూ వస్తోంది. 2014లో దేశంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు తన కృషిని వేగవంతం చేసింది. గతంలో బిజెపిని తేలికగా విస్మరించిన పార్టీలు ఇవాళ దానిని తక్కువ అంచనా వేయలేమని భయపడే పరిస్థితి వచ్చింది. అందుకు తగ్గట్లుగా కొత్త సామాజిక వర్గాలను చేర్చుకుని వారికి అవకాశాలు కల్పించడం బిజెపికి ఒక చారిత్రక అవసరంగా మారింది. నిజానికి పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో అరాచక పాలన, మతతత్వ ధోరణులు పెచ్చరిల్లిపోయాయి. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికీ అంతులేకుండా పోయింది. ఈ క్రమంలో బిజెపి ఆ రాష్ట్రాలపై దృష్టి సారించడం, అక్కడి నేతలకు జాతీయస్థాయిలో ప్రాధాన్యం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం.


బిజెపిని ఒకప్పుడు ఉత్తరాది పార్టీ అని విమర్శించేవారు. ఇవాళ ఆ విమర్శలకు ఆస్కారం లేదు. తమిళనాడుకు చెందిన జయశంకర్, నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆ రాష్ట్రంలో ఒక దళితుడు పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించగా, మరో బలమైన సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరికి జాతీయస్థాయిలో అత్యంత కీలకమైన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అదే తెలంగాణలో వెనుకబడినవర్గాలకు చెందిన సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి వరిస్తే బలమైన సామాజికవర్గాలకు చెందిన డికె అరుణకు జాతీయస్థాయిలో పార్టీ ఉపాధ్యక్ష పదవి, కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి లభించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడినవర్గాలకు కీలక ప్రాధాన్యం దక్కిందనడానికి నిదర్శనం- లక్ష్మణ్‌కు జాతీయస్థాయిలో బీసీ మోర్చా అధ్యక్ష పదవి రావడం, అదే వర్గానికి చెందిన ఈ వ్యాస రచయితను కార్యదర్శిగా కొనసాగించడం. 


విచిత్రమేమంటే బిజెపిలో ఇతర పార్టీలకు చెందిన వారు ఇమడలేరని, వారికి మంచి అవకాశాలు లభించవని విమర్శించేవారు ఇప్పుడు తమ విమర్శలను సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ నడ్డా టీమ్‌లో జాతీయస్థాయిలో ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవారు అయిదారేళ్ల క్రితం ఏ పార్టీల్లో ఉన్నారో వాళ్లు గ్రహించాలి. కేరళలో సిపిఐ(ఎం) నుంచి అబ్దుల్లా కుట్టి, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ముకుల్‌రాయ్ బిజెపిలో చేరారు. వారు ఇవాళ బిజెపిలో జాతీయస్థాయిలో ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శుల్లో కూడా పశ్చిమబెంగాల్‌కు చెందిన అనుపమ్ హజ్రా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పురంధేశ్వరి, డికె అరుణ బిజెపి సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వచ్చిన వారే. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు అధికార ప్రతినిధిగా ఉన్న కేరళకు చెందిన టామ్ వడక్కన్ ఇవాళ బిజెపికి జాతీయస్థాయిలో అధికార ప్రతినిధి! కేరళ, పశ్చిమ బెంగాల్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి బలోపేతం అయి విజయపథంలో సాగడానికి పార్టీ ఎంత ప్రాధాన్యాన్నిస్తోందో దీన్ని బట్టి అర్థమవుతోంది. అదే విధంగా ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఇద్దరికి ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులు దక్కడాన్ని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. ఇవాళ త్రిపుర, అస్సాంలో బిజెపి కేతనం ఎగురవేయడమే కాదు, మొత్తం ఈశాన్యమంతా బిజెపి వేపు చూస్తోంది.


నడ్డా టీమ్‌లో ఎందరో కొత్తవారికి, నవయువకులకు అవకాశాలు లభించాయి. బిజెపిలో గత ఎన్నికల ముందే చేరి ఎంపీగా విజయం సాధించిన తేజస్వి సూర్యకు యువమోర్చా బాధ్యతలు అప్పగించడం మొత్తం యువతకు ఉత్తేజకరంగా మారనుందనడంలో సందేహం లేదు. అదే విధంగా ఈ టీమ్‌లో మహిళలకు కూడా అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పాత కొత్తల మేలుకలయికగా కనిపిస్తున్న నడ్డా టీమ్ ఉత్సాహం ఉరకలు వేస్తున్న బిజెపి కొత్త రూపునకు అద్దం పడుతుందనడంలో సందేహం లేదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-09-29T06:22:21+05:30 IST