Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేరు ఆగ్రోస్‌ది.. పెత్తనం కాంట్రాక్టర్లది..

కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాహనాల కొనుగోళ్లు

నిర్వహణ టీఎస్‌ ఆగ్రోస్‌దైనా పట్టించుకోని వైనం

నోరుమెదపని మున్సిపల్‌ యంత్రాంగం


కరీంనగర్/మంచిర్యాల/కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థకు టీఎస్‌ ఆగ్రోస్‌ గుదిబండగా మారింది. పారిశుధ్య, ఇతర విభాగం వాహనాలను మార్కెట్‌కంటే అధిక రేటుపై టీఎస్‌ ఆగ్రోస్‌ ద్వారా నగరపాలక సంస్థ కొనుగోలు చేసింది. ఆగ్రోస్‌కు చెందిన వివిధ ఏజెన్సీలు ఈ వాహనాలను సరఫరా చేశాయి. ఇంటింటా చెత్త సేకరణకు 50ఆటో ట్రాలీలు, ట్రక్‌ మౌంటెడ్‌ గార్బేజ్‌ కాంపాక్టర్లు, బిన్లు, జెట్టింగ్‌ మిషన్‌, ట్రక్‌ మౌంటెడ్‌ రోడ్‌ స్వీపింగ్‌ మిషన్‌, పొర్టబుల్‌ కాంట్రాక్టర్‌, ఆటో లిట్టర్‌ పిక్కర్‌, వైకుంఠరథాలు, ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. టీఎస్‌ ఆగ్రోస్‌ను ప్రభుత్వ ఏజెన్సీగా చెప్పినా ప్రైవేట్‌ ఏజెన్సీలే సరఫరాలో కీలకపాత్ర పోషించాయి. వాహనాల నిర్వహణ టీఎస్‌ ఆగ్రోస్‌దేనని చెప్పారు. టీఎస్‌ ఆగ్రోస్‌ ద్వారా సరఫరా చేసిన కాంపాక్టర్‌ బిన్లు సరఫరా జరిగినా రోజే ఊడిపోవడం, అప్పటి కమిషనర్‌, ఐఏఎస్‌ అధికారి ఉదయ్‌కుమార్‌ పరిశీలిస్తుండగానే ఇవి చోటుచేసుకోవడం నాణ్యతాలోపాలకు అద్దంపట్టింది. 


కాంపౌండ్‌ దాటని స్వీపింగ్‌ మిషన్లు

డీఎంఎఫ్‌టీ, 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల నుంచి 50 ఆటో ట్రాలీలు కొనుగోలు చేశారు. ఈ ట్రాలీలపై కార్పొరేషన్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లను పెట్టి ఇంటింటా చెత్త సేకరణ జరుపుతున్నారు. ఇవి మినహా మిగతా వాహనాలు కార్పొరేషన్‌ కాంపౌండ్‌ దాటడం లేదు. వాహనాలు వచ్చి ఏడాది గడుస్తున్నా అప్పుడప్పుడు డిస్‌ప్లేకు తీసుకువచ్చినట్టు గంటపాటు బయటతిప్పి మళ్లీ లోపల పెడుతున్నారు. ముఖ్యంగా రోడ్‌ స్వీపింగ్‌ యంత్రం, ఆటో లిట్టర్‌ పిక్కర్‌ యంత్రాలైతే బయటకుతీసిన పరిస్థితే లేదు. ఆటో ట్రాలీలు ప్రతిరోజు రిపేర్లు వచ్చి మూలకు ఉంటున్నాయి. సాధారణంగా కొత్త వాహనాలకు సర్వీసింగ్‌లు, ఇతర నిర్వహణ తప్పనిసరి ఉంటుంది. ఈ నిర్వహణ బాధ్యత అంతా టీఎస్‌ ఆగ్రోస్‌దేనని అధికారులు చెబుతున్నా ఆగ్రోస్‌ బాధ్యులు మాత్రం ఎవరూ ఉండడం లేదు. చాలా వాహనాలకు చిన్నచిన్న రిపేర్లను కూడా చేయలేని పరిస్థితి ఉంది. అలాగే వాహనాలు నడుపుతుండడంతో చాలా ట్రాలీలు దెబ్బతిన్నాయి. ఇంజన్‌ ఆయిల్‌ కూడా మార్చే పరిస్థితి లేకపోవడంతో చాలా వాహనాలు చెడిపోతున్నాయి. క్లచ్‌ప్లేట్లు దెబ్బతినడం, వైరింగ్‌ కాలిపోవడం వంటివి చోటుచేసుకున్నాయి. 50ట్రాలీల్లో ఆరు ట్రాలీలు మూలనపడ్డాయి. కార్పొరేషన్‌ అధికారులు ఆగ్రోస్‌కు సమాచారం ఇచ్చామని, వారిదే బాధ్యత అంటూ చేతులెత్తుతున్నారు. ఆగ్రోస్‌ అధికారులు మాత్రం ఇక్కడికి రాకుండా ముఖంచాటేస్తున్నారు.

ఏడాది తరువాత నిర్వహణ ఒప్పందం

రామగుండం నగరపాలక సంస్థ టీఎస్‌ ఆగ్రోస్‌ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలకు 8నెలలకు రిజిస్ర్టేషన్‌ చేసింది. ఇన్సూరెన్సులు లేకుండానే వాహనాలను రోడ్లపై తిప్పారు. గతంలో ఇలాగే వాహనాలను తిప్పగా ప్రమాదాలు కూడా జరిగాయి. ఆ వాహనాలను మూలనపడవేశారు. కార్పొరేషన్‌ అధికారులు లక్షలాది రూపాయలు బిల్లులు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఇటీవల నిర్వహణకు సంబంధించి ఒప్పందాలను చేసుకుంటున్నారు.వాస్తవానికి రెండేళ్లు టీఎస్‌ ఆగ్రోస్సే నిర్వహణ ఉంటుందని, పారదర్శకంగా కొనుగోలు చేశామంటూ పాలకవర్గ పెద్దలు, యంత్రాంగం చెప్పుకొచ్చింది. వాస్తవంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కార్పొరేషన్‌లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు కొనుగోలు చేసిన వాహనాలు ఇప్పుడు కార్పొరేషన్‌కే గుదిబండగా మారాయి.


టీఎస్‌ ఆగ్రోస్‌ సంస్థ పేర కొనుగోలు చేసినా, ఆ సంస్థకు సంబంధించిన ప్రైవేట్‌ ఏజెన్సీలే చక్రం తిప్పాయి. బిల్లులు తీసుకుపోవడం మినహా వాహనాల నిర్వహణ, వినియోగానికి సంబంధించి ఆ సంస్థ బాధ్యత లేకుండా పోయింది. కార్పొరేషన్‌ అధికారులు కూడా వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఇటీవల ట్రాలీలకు సంబంధించి మాత్రం టీఎస్‌ ఆగ్రోస్‌లో రిజిష్టర్‌ ఏజెన్సీ అయిన ఎస్‌డీఎస్‌ టెక్నాలజీతో కార్పొరేషన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మిగతా వాహనాలకు సంబంధించి వినియోగ నిర్వహణ విషయంలో స్పష్టత లేకుండాపోయింది. ఇటీవల ఎన్‌టీపీసీలో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు కార్పొరేటర్లు వాహనాల విషయాన్ని లేవనెత్తి మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. 

Advertisement
Advertisement