Jul 25 2021 @ 00:00AM

పేరూ రావాలి...సినిమా ఆడాలి!

  • సత్యదేవ్‌... ఇమేజ్‌ ఛట్రంలో చిక్కుకోని నటుడు!
  • ఎటువంటి పరిమితులూ పెట్టుకోని కథానాయకుడు!
  • ఎటువంటి నేపథ్యం లేకుండా చిత్రసీమలో పైకొచ్చినోడు!
  • కరోనా కాలంలోనూ ఖాళీ లేకుండా చిత్రీకరణలు చేశారు.
  • చూస్తుండగానే సత్యదేవ్‌ పరిశ్రమకొచ్చి పదేళ్లు పూర్తయింది.
  • ఈ సందర్భంగా సత్యదేవ్‌తో ‘నవ్య’ ఇంటర్వ్యూ...


 పదేళ్ల ప్రయాణంలో మీ లక్ష్యాల్ని చేరుకున్నారా?

శ్రద్ధగా పని చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుందని నా నమ్మకం. చేసిన ప్రతి సినిమా కన్విక్షన్‌తో చేయాలనుకున్నా. అంతే తప్ప... ‘ఇప్పుడీ సినిమా చేస్తే మరో మెట్టు ఎక్కుతాం’ అని ఎప్పుడూ అనుకోలేదు. వందశాతం ప్రయత్నలోపం లేకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ పని చేశా.


పరిశ్రమలోకి వచ్చాక మీలో మీరు గమనించిన మార్పు?

డబ్బుల పట్ల ఎక్కువ గౌరవం పెరిగింది. సినిమాల పరంగా చూసినా... డబ్బులు పెట్టే నిర్మాతలంటే గౌరవం ఎక్కువైంది. సినిమాలపై ప్రేమతో కోట్లు ఖర్చుపెడుతున్నారు. కష్టపడుతున్నారు. వాళ్లకు న్యాయం జరగాలనీ, లాభాలు రావాలనీ బలంగా కోరుకుంటా. నేను చేస్తున్న సినిమాలు, చూస్తున్న మనుషుల వల్ల పెరిగిన గౌరవం అది. ఒకవేళ నాకు డల్‌గా అనిపించినా... నిర్మాతలు, ఫైనాన్షియర్లను గుర్తుచేసుకుంటా. ఉదాహరణకు... ‘తిమ్మరుసు’ చిత్రాన్ని 39 రోజుల్లో, సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేశాం. దాంతో నిర్మాత హ్యాపీ. ఎందుకంటే... షెడ్యూళ్లు పెరిగితే వడ్డీలు పెరుగుతాయి. ఆర్టిస్టుల డేట్స్‌ ఇష్యూ వస్తుంది. సింగిల్‌ షెడ్యూల్‌ అయితే ఆ సమస్యలు ఉండవు. నేనూ క్యారెక్టర్‌లో ఉండొచ్చు.


హీరో అయిన తర్వాత కూడా ఇతర సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. కథలు, పాత్రల ఎంపికలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?

వందశాతం పాజిటివ్‌ ఎనర్జీతో సెట్స్‌లో అడుగుపెట్టాలి. ఎప్పుడూ నా ఆలోచన అదే! కథ విన్నప్పుడు నమ్మకం కలగకపోతే చేయను. నాకు చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కథలు విన్నప్పుడు ‘హై’ రాలేదు. అందుకే, ఆ చిత్రాలు చేయలేదు. నాకు ‘హై’ వచ్చిన ఏ కథనూ వదల్లేదు. పాత్ర చిన్నదా? పెద్దదా? సినిమానా? ఓటీటీ కంటెంటా (‘లాక్డ్‌, గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’)? అనేది చూడలేదు. చేస్తూ వచ్చాను.


‘హీరో అయ్యాక క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నావ్‌?’ అని సలహాలిచ్చిన శ్రేయోభిలాషులు ఉంటారుగా?

‘హీరోగా చేస్తున్నావ్‌. ఇటువంటి చిన్న పాత్రలు ఎందుకు?’ అని చాలామంది అన్నారు. నేను కెరీర్‌ ప్రారంభించినప్పుడు అటువంటి లెక్కలు, రూల్స్‌ పెట్టుకోలేదు. ఇప్పుడెందుకు? ఎట్‌ లీస్ట్‌... నన్ను నేను మోసం చేసుకోకూడదని అనిపించింది. నాకు నచ్చింది చేద్దామనే ముందుకు వెళ్తున్నా.


ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోతే ఎలా ఉంటుంది? 

సినిమాలు జనాల్లోకి వెళ్లినా, వెళ్లకపోయినా... నా పాత్రలకు పేరొచ్చిన సందర్భాలున్నాయి. రిజల్ట్‌కు అతీతంగా ‘నీ నటన బావుంది’ అనేవారు. ముందు ఎంజాయ్‌ చేశా. కొన్నాళ్లకు ఎంజాయ్‌ చేయలేకపోయా. ఆ తర్వాత ‘సినిమా రిజల్ట్‌ పక్కనపెట్టు. నువ్వు అదిరిపోయావ్‌’ అన్నప్పుడు కొంచెం బాధ కలిగేది. నాకు పేరు రావడంతో పాటు సినిమా కూడా ఆడాలి కదా! సినిమా అనేది సమష్టి కృషి. ఏ ఒక్కరితోనో చేయడం కుదరదు.


మీరు వెబ్‌ సిరీ్‌సలు చేశారు. మీ సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. డిజిటల్‌ రివల్యూషన్‌ గురించి మీ అభిప్రాయం?

నేను 2023, 24కు థియేటర్లతో పాటు ఓటీటీ ప్యారలల్‌గా వస్తుందనుకున్నా. కొవిడ్‌ వల్ల 2021లోనే దానికి హైప్‌ వచ్చేసింది. చాలామంది నిర్మాతలు ఓటీటీ వల్ల లాభం పొందారు. థియేటర్లు మూసిఉన్న తరుణంలో ఓటీటీ చాలా హెల్ప్‌ అయ్యింది. అందువల్ల, పరిశ్రమకు ఓటీటీ మరో దీవెన లాంటిది. నాకు అదంటే చాలా గౌరవం ఉంది. అయితే... థియేటర్లలో సినిమా చూస్తే ఆ అనుభూతే వేరు. ఓ వంద, రెండొందల మంది మధ్య నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు వచ్చే అనుభూతి వేరు. నటీనటులు, దర్శక-నిర్మాతలు - ఎవరికైనా అలాగే ఉంటుంది. థియేటర్లు తెరవడానికి అనుమతి ఇచ్చిన రెండు తెలుగు ప్రభుత్వాలకు థ్యాంక్స్‌.


కథలు రాసేటప్పుడే ‘ఇది ఓటీటీకి... ఇది థియేటర్లకు’ - అనే మార్పు పరిశ్రమలో వస్తోందా?

‘ఇది ఓటీటీ కథ. ఇది సినిమా కథ’ అనే మాటలు నేనూ వింటున్నా. అదంతా సెన్సార్‌ వల్లే. ఓటీటీకి సెన్సార్‌ లేదింకా! సెన్సార్‌ వల్ల థియేటర్లలో కొన్ని చెప్పడం కుదరదు కనుక... మాటలు, సన్నివేశాలు - ఏవైనా ఓ ఫిల్మ్‌మేకర్‌ తాను అనుకున్న కథను అనుకున్నట్టుగా చెప్పడం కోసం ఓటీటీకి వెళ్తున్నారేమో!


కరోనా కాలంలోనూ చిత్రీకరణలు చేశారు. మీ భార్యకు ఆందోళన ఉంటుంది కదా!

ఎక్కువ ఆందోళన చెందింది. అయుతే... సెట్స్‌లో నేను భౌతిక దూరం పాటించా. తరచూ శానిటైజర్‌ రాసుకున్నా. కెమెరా ముందు నటించేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో మాస్క్‌ పెట్టుకున్నా. ఇంటికి వెళ్లగానే దుస్తులు దూరంగా ఉంచా. హాట్‌ షవర్‌ చేశా. మా అబ్బాయికి 17 నెలలే. నాకూ టెన్షన్‌ ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఉన్నట్టు మా సినిమా వాళ్లకు లేదు. కెమెరా ముందుకు వెళ్లాల్సిందే. మొండిధైర్యంతో సెట్స్‌కు వెళ్లా. జాగ్రత్తలు పాటించా. అందువల్లే, చిత్రీకరణలకు అనుమతులు వచ్చాక ఐదు సినిమాలు చేయగలిగా.


హిందీ చిత్రం ‘రామ్‌ సేతు’లో నటిస్తున్నారు. అవకాశం ఎలా వచ్చింది?

భారతీయ భాషలు అన్నిటిలో సినిమాలు చేయాలని ముందునుంచీ అనుకున్నా. పదేళ్ల తర్వాత సత్యదేవ్‌ హిందీ, కన్నడ, మలయాళం, భోజ్‌పురి... భాష ల్లో సినిమాలు చేశాడని జనాలు మాట్లాడుకోవాలి. అందులో భాగంగానే హిందీకి వెళ్లాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. సరైన ఛాన్స్‌ కోసం ఎదురుచూశా. ‘రామ్‌ సేతు’ నాకు పర్‌ఫెక్ట్‌ హిందీ డెబ్యూ. ఆల్రెడీ ఓ షెడ్యూల్‌ చేశా. సెప్టెంబర్‌లో మళ్లీ షూటింగ్‌కు వెళ్లాలి. తెలుగులో ‘స్కైలాబ్‌’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’ చేస్తున్నా. కొరటాల శివగారు-కృష్ణగారు నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది.

సత్య పులగం

ఇదంతా దీపిక నమ్మకమే!

నా కెరీర్‌లోని ప్రతి మలుపులోనూ నా శ్రీమతి దీపిక ఉంది. నేను ఉద్యోగం మానేసినప్పుడు నాకు అండగా నిలబడింది. నా బాధను తనూ అనుభవించింది. ఏ రోజూ ‘వద్దు. నువ్విది చేయకు. సినిమా వద్దు’ అనే మాట అనలేదు. ‘వీడు ఎడారిలోనైనా బతికేస్తాడు’ అని నమ్ముతుంది. తనలో కాన్ఫిడెన్సే నన్ను ముందుకు తీసుకువెళ్తోంది. దీపిక వల్లే నేను అనుకున్నది చేయగలుగుతున్నా. నా సక్సెస్‌ క్రెడిట్‌ తనకే చెందుతుంది. నాకు పర్‌ఫెక్ట్‌ క్రిటిక్‌ కూడా! తనకు బాగా నచ్చిందంటే నేను చాలా హ్యాపీ. నా నటన, సినిమా, కథ గురించి పూర్తిగా విశ్లేషిస్తుంది. తనకు నచ్చకపోతే ఓపెన్‌గా చెబుతుంది. నా ఆనందం కోసం ఏదీ దాచదు.


మా బాబుకు వచ్చే నెలకు ఏడాదిన్నర నిండుతుంది. కరోనా కాలంలో ఆరు నెలలు చిత్రీకరణలు చేయలేదు. అప్పుడు మా అబ్బాయితో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. అదొక గొప్ప అనుభూతి. అవన్నీ మధురమైన క్షణాలు. కళ్ల ముందు పిల్లాడు పెరుగుతుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. వాడికి సవర్ణిక్‌ అని పేరు పెట్టాం. అంటే... లీడర్‌ అని అర్థం.


‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ తర్వాత నా ఆహార్యం, పాత్ర పరంగా వ్యత్యాసం ఉండాలని ‘తిమ్మరుసు’ కథ ఎంపిక చేసుకున్నాం. అప్పటికి సృజన్‌ ఎరబోలు నిర్మాత. ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడానికి మాకో వ్యక్తి కావాలని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మహేశ్‌ కోనేరుతో అసోసియేట్‌ అయ్యాం. లాక్‌డౌన్‌ తర్వాత నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేశాం. ఇందులో నాది న్యాయవాది పాత్ర కాబట్టి సినిమాలో ఐపీసీ సెక్షన్లు, పీనల్‌ కోడ్స్‌ గురించి నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు న్యాయవాదులతో మాట్లాడాను. ఈ నెల 30న థియేటర్లలో ‘తిమ్మరుసు’ విడుదలవుతోంది.