ప్రాతఃస్మరామి లలితా!

ABN , First Publish Date - 2020-10-22T06:28:28+05:30 IST

దుర్గా నవరాత్రులు నేటి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

ప్రాతఃస్మరామి లలితా!

నేటి అలంకారం


  • శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
  • ఆశ్వయుజ శుద్ధ షష్ఠి గురువారం


  • ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
  • బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్‌
  • ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
  • మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్

‌శ్రీశ్రీ నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ప్రధాన దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమెది. లక్ష్మీసరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువై ఉంటుంది. పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. త్రిపురా త్రయంలో రెండో స్వరూపం లలితాదేవి. ఆమె కామేశ్వరుని వివాహమాడింది. ఆ ఆదిదంపతులు ఈ సకల సృష్టిని నిర్వర్తిస్తున్నారు. శ్రీలలిత త్రిపుర సుందరీదేవి సకల దేవీ స్వరూపాలకు మూల రూపమైన ‘‘అమ్మలగన్నయమ్మ’’, ‘‘ముగురమ్మల మూలపుటమ్మ’’, ‘చాల పెద్దమ్మ’’.


ఘోరమైన దారిద్య్ర బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీలలితాదేవి. ఆమెవిద్యా స్వరూపిణి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అనీ, మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందనీ విశ్వాసం. అమ్మవారు ‘అరుణ’ (బాలసూర్యుని) వర్ణంలో ప్రకాశిస్తూ చతుర్భుజాలతో- పాశము, అంకుశము, పుష్పబాణాలు, ధనుస్సు ధరించి, అణిమాది సిద్ధులు కిరణరూపంగా చుట్టూ ప్రకాశిస్తుండగా అపార కరుణా దృష్టితో దర్శనమిస్తుంది. ఆమె సకల దేవీ శక్తులకు మూల స్వరూపం. కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్ర నామంతో పూజిస్తారు. లలితాదేవి దర్శనం, సేవల వల్ల ఆయురారోగ్యాలు, సకాలంలో వివాహం, సౌభాగ్యం, వంశాభివృద్ధి, అభీష్ట సిద్ధి, ముక్తి కలుగుతాయని భక్తుల నమ్మిక. త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారనీ, ఆమెను ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయనీ పురాణాలు చెబుతున్నాయి.


అలంకరించే చీర రంగు: బంగారు వర్ణం

అర్చించే పూల రంగు: వివిధ రకాలు

పారాయణ: చెయ్యాల్సింది: లలితా సహస్రనామం


Updated Date - 2020-10-22T06:28:28+05:30 IST