‘ధరణి’ ఆవశ్యకతను అందరికీ తెలియజేయాలి

ABN , First Publish Date - 2021-01-16T06:04:53+05:30 IST

ధరణి ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని మెదక్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలిపారు.

‘ధరణి’ ఆవశ్యకతను అందరికీ తెలియజేయాలి

ఆ బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదే

కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


మెదక్‌ రూరల్‌/సిద్దిపేట సిటీ, జనవరి 15 : ధరణి ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని మెదక్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ సిద్దిపేట క్యాంపు కార్యాలయం నుంచి సిద్దిపేట, మెదక్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో పెండింగ్‌ మ్యుటేషన్ల పరిష్కారంపై టెలీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి కోసం సిద్దిపేట జిల్లాలో 2,211 మంది,  మెదక్‌ జిల్లాలో 658 మంది భూ యజమానులు మీ సేవలో ద్వారా చేసుకున్నారని తెలిపారు. వాటిలో మూడు మినహా మిగతా వాటికి ఆమోదం తెలిపామని చెప్పారు. పెండింగ్‌ మ్యుటేషన్‌లను వేగంగా పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మ్యుటేషన్‌ దరఖాస్తులు 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ కంప్యూటర్‌కు వచ్చాయన్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలిపామని తెలియజేశారు. సదరు భూయజమానికి సంక్షిప్త రూపంలో సందేశాలు వెళ్లాయని చెప్పారు. వెంటనే స్లాట్‌ బుక్‌ చేసుకొని తహసీల్దార్‌ ద్వారా డిజిటల్‌ మ్యుటేషన్‌ ఉత్తర్వులు పొంది ధరణిలో తమ వ్యవసాయ భూములను  అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించామని తెలిపారు. జెట్‌ స్పీడ్‌తో పెండింగ్‌ మ్యుటేషన్‌ల క్లియర్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.


Updated Date - 2021-01-16T06:04:53+05:30 IST