Abn logo
Apr 9 2021 @ 03:50AM

ప్రమాదం జరుగుతుందని ముందే చెప్పిన ఓవర్‌మన్‌

గని పైకప్పు కూలుతుందని హెచ్చరిక

అయినా పట్టించుకోని అధికారులు

బాధిత కుటుంబాలకు 15.9 లక్షల పరిహారం


భూపాలపల్లి/కాకతీయఖని/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సింగరేణి అధికారుల నిర్లక్ష్యం వల్లే భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 6వ గనిలో బుధవారం ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గనిలో 11.5 లెవల్‌ 3వ సీం వద్ద పైకప్పు పరిస్థితి బాగా లేదని తెలిసి కూడా కార్మికులను డ్యూటీకి పంపించారని ఆరోపిస్తున్నాయి. ఇదే చోట మొదటి షిఫ్టులో ఓవర్‌మన్‌గా పనిచేసిన వెంకటేశ్వర్‌రావు డ్యూటీ ముగించుకొని వెళ్తూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 3వ సీం వద్ద పైకప్పు బాగా లేదని, ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ సెకండ్‌ షిఫ్టులో సర్దార్‌ నర్సింగరావు, హెడ్‌ఓవర్‌మన్‌ మనోజ్‌కుమార్‌తో పాటు సపోర్టుమెన్‌ శంకరయ్య, నర్సయ్యకు డ్యూటీ వేశారు.     ఈ ప్రమాదంపై ముందే ఊహించిన హెడ్‌ ఓవర్‌మన్‌ మనోజ్‌కుమార్‌ జనవరి 5న సింగరేణి అధికారులకు మొర పెట్టుకున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.


పార్టీలు, కార్మిక సంఘాల ఆందోళన

కేటీకే-6 గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు నర్సయ్య, శంకరయ్య కుటుంబాలకు న్యాయం చేయాలని వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. భూపాలపిల్ల సింగరేణి ఆస్పత్రి వద్ద   ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, బీజేపీ నేత చందుపట్ల కీర్తిరెడ్డి, ఏఐటీయూసీ నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్‌, సీఐటీయూ, నాయకులు నిరసనకు దిగారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులతో ఏరియా జీఎం నిరీక్షణ్‌ రాజ్‌ చర్చించి.. మృతుల కుటుంబాలకు న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు గుర్తింపు సంఘం నాయకులు స్పెషల్‌ ఎక్స్‌గ్రేషియా కింద రూ.15.90లక్షల చెక్కును అందజేశారు.

Advertisement
Advertisement
Advertisement