‘కొత్త’ తిరకాసు

ABN , First Publish Date - 2021-06-24T06:58:33+05:30 IST

కొత్త రేషన్‌ కార్డులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా వైబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు.

‘కొత్త’ తిరకాసు

-  రేషన్‌కార్డు దరఖాస్తుదారుల ఆశలపై నీళ్లు 

- పాత దరఖాస్తు దారులకే కార్డులు 

- మార్పులు, చేర్పులకూ నీరిక్షణే

- ప్రకటన తర్వాత నిలిచిన వెబ్‌సైట్‌ 

- ఈ నెల 25లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి 

- జిల్లాలో 3,237 మంది 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కొత్త రేషన్‌ కార్డులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా వైబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. అర్హులందరికీ  రేషన్‌ కార్డులు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూన్‌ 7న మంత్రి వర్గంలో ప్రకటించారు. దాదాపు మూడేళ్ల తరువాత కార్డులు వస్తున్నాయని జిల్లాలోని అర్హులు ఆనందపడ్డారు.  జూన్‌ 8 నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకోకుండా పుడ్‌ సెక్యూరిటీ వెబ్‌సైట్‌ నిలిపివేయడంతో అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోలేక ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. గతంలో దరఖాస్తు చేసుకున్నావారిని మాత్రమే పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నారు. ఈ నెల 25లోగా పరిశీలన కూడా పూర్తి చేయనున్నారు. కనీసం చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని కూడా పరిశీలనలోకి తీసుకోవడం లేదు. కొత్త దరఖాస్తుదారులకు ఇప్పట్లో కార్డులు రావడం కష్టమేనని భావిస్తున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకటన కంటే ముందు దరఖాస్తు చేసుకొని పరిశీలనలో ఉన్నవారు 3237 మంది ఉన్నారు. మార్పులు చేర్పుల కోసం  వచ్చిన 10,825 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 10 వేల మంది కొత్తగా అన్ని అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోలేక నిరాశ చెందుతున్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో 344 రేషన్‌ దుకాణాలు, 1,72,784 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భధ్రత కార్డులు 1,58,941, అం త్యోదయ కార్డులు 13,609, అన్నపూర్ణ కార్డులు 234 ఉన్నాయి. వీటి పరిధిలో 5,02,352 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 10 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాయి.

జిల్లాలో 3237 దరఖాస్తుల పరిశీలన 

మూడంచెల విచారణ పూర్తయిన దరఖాస్తులను ప్రస్తుతం ఆన్‌లైన్‌ చేస్తున్నారు. జిల్లాలో 3,237 మంది అర్హులుగా దరఖాస్తుల పరిశీలన చివరి దశకు వచ్చింది. ఈ నెల 25లోగా పూర్తి చేసి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-24T06:58:33+05:30 IST