నవ భారత దార్శనికుడు

ABN , First Publish Date - 2020-07-02T05:30:00+05:30 IST

పీవీనరసింహారావును నేను తొలిసారిగా 1993లో కలిశాను. ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టి అప్పటికి దాదాపు రెండేళ్లు కావస్తోంది. అప్పటికే అయిదారేళ్లుగా వ్యాపారరంగంలో ఉన్న నేను, మా కుటుంబ మిత్రుడు, పీవీ సమీప బంధువైన వి.రాజేశ్వరరావుతో ప్రధానమంత్రిని కలిశాను...

నవ భారత దార్శనికుడు

సంప్రదాయంగా అనుసరిస్తున్న సోషలిస్టు పంథాకు దూరమైనప్పటికీ భారతదేశం పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోకుండా పీవీ జాగ్రత్తలు తీసుకున్నారు. దేశంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన వున్న నేత కావడం వల్ల పీవీ మానవీయకోణంలో సంస్కరణలు అమలు చేశారు.


పీవీనరసింహారావును నేను తొలిసారిగా 1993లో కలిశాను. ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టి అప్పటికి దాదాపు రెండేళ్లు కావస్తోంది. అప్పటికే అయిదారేళ్లుగా వ్యాపారరంగంలో ఉన్న నేను, మా కుటుంబ మిత్రుడు, పీవీ సమీప బంధువైన వి.రాజేశ్వరరావుతో ప్రధానమంత్రిని కలిశాను. సాధారణంగా ప్రధానమంత్రి అనగానే హంగు, ఆర్భాటం, హడావుడి వుంటాయనుకున్నాను. కానీ అలాంటివేమీ లేకుండా చాలా నిరాడంబరంగా ఉన్న పీవీ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వెళ్లిన పని గురించి ఆరా తీశారు. కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయడానికి బ్యాంక్ లోను కోసం సిఫారసు చేయాలని కోరాను. అందుకాయన, దేశంలో లిబరలైజేషన్ తరువాత బ్యాంకులు ప్రాజెక్టు రిపోర్టుతో వెళితే నేరుగా రుణాలిస్తున్నాయని, ప్రధానమంత్రి దాకా రావాల్సిన అవసరం లేదని చెప్పారు. మీ లాంటి యువ పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పీవీగారు ప్రధాని అవడానికి ముందు బ్యాంక్ లోన్ కావాలన్నా, ఒక పరిశ్రమ మొదలెట్టాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఒక పారిశ్రామిక వేత్తగా నేను విజయవంతమవడమే కాకుండా, వేలాది మందికి ఉపాధి కల్పించానంటే అందుకు కారణం ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన ఉదారవాద ఆర్థిక విధానాలే.


పీవీకి ముందు ప్రధానిగా పనిచేసిన చంద్రశేఖర్ హయాంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోయాయి. మన బంగారు నిల్వలు తాకట్టులోకి పోయాయి. 2.2 బిలియన్ డాలర్ల రుణం కోసం 67 టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థకు తాకట్టు పెట్టారు. 72 బిలియన్ డాలర్ల అప్పుతో దేశం ప్రపంచ అప్పుల్లో మూడో స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం తన తొలి బాధ్యతగా ఎంచి, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ప్రముఖ ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇది సాహసోపేతమైన నిర్ణయం. అత్యంత కీలకమైన ఆర్థిక శాఖలో రాజకీయేతర బ్యూరోక్రాట్ ను నియమించడం అదే మొదటిసారి. 1991 జూలైలో ప్రధానమంత్రిగా పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగంలో సంస్కరణలు, ఉదారవాద ఆర్థిక విధానాల గురించి ప్రస్తావించి, తన పాలన ఎలా వుంటుందో సూచనప్రాయంగా దేశానికి తెలియచేశారు. 


ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, దివాళా దిశగా వున్న దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి ఎక్కించారు. ఆర్థిక విధానాల రూపకల్పనలో తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కు పూర్తి స్వేచ్ఛను, మద్దతును ఇచ్చారు. శరవేగంతో సంస్కరణలు అమలు చేశారు. దిగుమతులపై సుంకాలను తగ్గించారు. లైసెన్స్ రాజ్యానికి చరమగీతం పలికారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశంలోకి విదేశీపెట్టుబడుల రాకకు మార్గం సుగమమైంది. క్రమంగా ఆర్థిక వ్యవస్థ పట్టాలపైకి ఎక్కింది. నరసింహారావు ప్రధానిగా ఉన్న అయిదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అగాథం నుంచి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. పీవీ రాజకీయ చతురత, పరిపాలనా సమర్థత, మన్మోహన్ ఆర్థిక నైపుణ్యం విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాయి. అందుకే పీవీని సంస్కరణల పితామహుడిగా, ఆధునిక భారతదేశ నిర్మాతగా పేర్కొంటారు. ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల భారతదేశం సంప్రదాయకంగా అనుసరిస్తున్న సోషలిస్టు పంథాకు దూరమైనప్పటికీ, భారతదేశం పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి సలహాలు తీసుకున్నారు. దేశంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన వున్న నేత కావడం వల్ల మానవీయకోణంలో సంస్కరణలు అమలు చేశారు.


నరసింహారావు తీసుకున్న చర్యల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ, దేశ ప్రజల జీవనప్రమాణాలు మారిపోయాయి. 1987లో పారిశ్రామికవేత్తగా నా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ప్రతి చిన్న పనికీ అనుమతులు, రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ నడుస్తుండేది. చిన్న విషయాలకు కూడా డిఐసి అనుమతులు అవసరమయ్యేవి. పారిశ్రామికరంగం ఒక దశ, దిశ లేకుండా ఎటు పోతుందో అర్ధం కాకుండా, అయోమయం నెలకొని ఉండేది. 1991 కి ముందు విదేశాలకు వెళ్లాలంటే, ఒకే ఏడాదిలో ఒక దేశానికి ఒకసారి కంటే మించి వెళ్లకూడదనే నిబంధన ఉండేది. ఇది కూడా పారిశ్రామికాభివృద్ధికి గుదిబండ లాంటి నిబంధన. ఎగుమతులు, దిగుమతులపై అనేక ఆంక్షలుండేవి. ఇలాంటి ఆటంకాలన్నింటినీ పీవీ ప్రభుత్వం తొలగించింది. దేశంలో టెలికమ్యూనికేషన్ల విప్లవాన్ని తీసుకొచ్చింది. అంతకుముందు 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, ప్రధానమంత్రి టెక్నాలజీ మిషన్ సలహాదారుగా శ్యామ్ పిట్రోడాను నియమించి దేశంలో ఐటి రంగం, టెలికమ్యూనికేషన్ల రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పట్లో అనుకున్నంతగా విజయవంతం కాలేదు. అయినప్పటికీ ప్రధానమంత్రిగా పీవీ దేశంలో టెలికమ్యూనికేషన్ల రంగాన్ని విస్తరించడంలో విజయాన్ని సాధించారు. నరసింహారావు హయాంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరగడంతో పట్టణీకరణ, పట్టణ మధ్యతరగతి జనాభా పెరిగింది. ప్రజల ఆదాయం పెరగడంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరిగింది.


విదేశీ వ్యవహారాల విషయంలో, ప్రపంచ దేశాలతో భారతదేశ సంబంధాలు మెరుగుపరచే విషయంలో కూడా పీవీ ప్రభుత్వం సమర్థంగా పనిచేసింది. ఆయన సుదీర్ఘకాలం విదేశాంగ మంత్రిగా పనిచేసిన అనుభవం ఇందుకు అక్కరకొచ్చింది. 90వ దశకంలో సోవియట్ రష్యా బలహీనం కావడం, అమెరికా ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అమెరికాతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు చర్యలు తీసుకున్నారు. లుక్ ఈస్ట్ విధానంలో భాగంగా అప్పటివరకు నిర్లక్ష్యం చేసిన ఆగ్నేయాసియా దేశాలతో కూడా సంబంధాలు బలోపేతమయ్యేందుకు కృషిచేశారు. పొరుగున వున్న శత్రుదేశం పాకిస్థాన్ కు కొన్ని అరబ్ దేశాలు సహకారం అందిస్తున్న నేపథ్యంలో నెహ్రూవియన్ పాలసీకి భిన్నంగా ఇజ్రాయల్ తో సంబంధాలు కొనసాగించారు. అప్పట్లో ఇదొక సాహసోపేతమైన నిర్ణయం. టెల్ ఆవివ్ లో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ చర్య వల్ల రక్షణ సంబంధమైన విషయాల్లో మనకు ఇజ్రాయిల్ సహకారం లభించింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే భారత బృందానికి ప్రతిపక్షనేత, విదేశీ వ్యవహారాల్లో నిపుణుడు అటల్ బిహారీ వాజ్ పేయిని నాయకుడిగా పంపించడం పీవీ వ్యవహారదక్షతకు నిదర్శనం. పరిపాలనకు, రాజకీయాలకు సంబంధం ఉండకూడదన్నది పీవీ సిద్ధాంతం. తన అయిదేళ్ల పదవీకాలంలో ఆయన విపక్షనేతలిచ్చే సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.


ఎన్నాళ్లుంటుందో తెలియని మైనారిటీ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టి, అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తొలి నెహ్రూ కుటుంబేతరుడుగా పీవీ నరసింహారావు రికార్డులకెక్కారు. 1996 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. తమిళనాడులో అన్నాడిఎంకెతో పొత్తు పెట్టుకోవడం ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ఆయన మరోసారి ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఆయన మళ్లీ ప్రధాని పదవి చేపట్టినట్టయితే దేశం ఎంతో ముందుకెళ్లి వుండేది. ఇక్కడో విషయాన్ని గుర్తు చేయాలి. 1996లో ఓటమి అనంతరం పీవీ గారిని కలిసినప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల అనంతరం తనకు మద్దతునివ్వాలని డిఎంకె అధినేత కరుణానిధిని కోరగా, ఆయన అంగీకరించారని చెప్పారు. తెలుగుదేశం అధినేత, అప్పటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఢిల్లీ రావద్దని, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు విరమించుకోవాలని కోరగా, ఆయన నిరాకరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు తాము రాజకీయాలు చేయలేదని, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా, నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని చెప్పారు. ఒకవేళ పీవీ రాజకీయమే తొలి ప్రాధాన్యంగా భావించి అసెంబ్లీని రద్దు చేసి ఉంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉండేవారు.


1989–91 మధ్య సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన చరిత్ర ఉన్నప్పటికీ, 1996లో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబునాయుడుతో పాటు వామపక్షాలు ప్రయత్నించాయి. అయితే మళ్లీ రెండేళ్లలో ఇద్దరు ప్రధానమంత్రులు మారారు. మళ్లీ ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఈ రెండు అనుభవాల వల్ల ప్రాంతీయపార్టీల కలగూరగంప కూటములతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని తేలిపోయింది. జాతీయ పార్టీలతోనే దేశం సుస్థిరంగా ఉంటుంది. 1998 ఎన్నికలలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రి పదవి చేపట్టాక పీవీ విధానాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల దేశం అభివృద్ధిపథంలో పయనించింది. 2004 ఎన్నికల్లో యుపిఎ విజయం సాధించాక నరసింహారావు శిష్యుడుగా రాజకీయాల్లోకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటికీ, 91-96 మధ్య కాలంలో జరిగినంత వేగంగా అభివృద్ధి జరగలేదు. స్వతహాగా నిజాయితీపరుడైన మన్మోహన్ పై కాంగ్రెస్ అధినాయకత్వం ప్రభావం, ఒత్తిడి వల్ల అనుకున్నంతగా రాణించలేకపోయారు. ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నప్పుడు విజయవంతమైన విధంగా, నెంబర్ 1 గా ఉన్నప్పుడు విజయవంతం కాలేకపోయారు. స్వతంత్రభారతదేశం 1996 వరకు చూసిన కేంద్ర ప్రభుత్వాల్లో నిస్సందేహంగా పివి నేతృత్వంలోని అయిదేళ్లపాలన దేశాన్ని ఆర్థికంగా ముందడుగు వేయించిందని చెప్పవచ్చు. ఆయనకు దక్కిన ఖ్యాతిలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాత్ర లేకపోవడమే విషాదకరం. భారత ఆర్థిక వ్యవస్థకు పీవీ విధానాలు ఊపిరి పోయగా, వాజ్ పేయి హయాంలో ఆర్థికంగా దేశాన్ని పటిష్ఠపరిచారు. అదే బాటలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ శరవేగంతో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మోదీ హయాంలో అంతర్జాతీయంగా భారత్ పేరుప్రతిష్టలు పెరగడంతో పాటు వ్యాపార నిర్వహణకు అత్యంత అనుకూలమైన దేశాల జాబితాలో చోటు దక్కింది. కరోనా ఎఫెక్ట్, సరిహద్దుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ మునుపెన్నడూ లేనంత క్లిష్టపరిస్థితుల్లో కూడా మోదీ మొక్కవోని ధైర్యంతో దేశాన్ని అభివృద్ధిపథంలో ముందుకు నడిపిస్తున్నారు.


క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి, దేశాన్ని ఒడ్డున పడేసిన పీవీకి కాంగ్రెస్ పార్టీ మాత్రం సరైన గౌరవం ఇవ్వలేదు. గాంధీ కుటుంబ భజనపరులైన నేతలు అజాతశత్రువైన పీవీని అవమానకరంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ప్రత్యర్థులు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు. పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆయన జీవించి ఉండగానే అన్ని కేసుల నుంచి విముక్తుడై, కడిగిన ముత్యంలా బయటకొచ్చారు. ఆయన మరణించిన తరువాత రాజధాని ఢిల్లీలో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని ప్రతి ఒక్కరూ భావించారు. భారత మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, వారికి స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కానీ ఇందుకు భిన్నంగా హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం ఎఐసిసి కార్యాలయంలో ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచడానికి కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకోలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని సమర్థంగా ముం దుకు నడిపినందుకు కాంగ్రెస్ నేతలు ఆయనను బతికున్నప్పుడు అవమానించడమే కాకుండా, చనిపోయాక కూడా గౌరవప్రదంగా వ్యవహరించలేదు. 2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాక దేశ రాజధాని ఢిల్లీలో పీవీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయించారు. ఇందుకోసం నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకున్నారు. తెలుగువారి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.


సుజనా చౌదరి

రాజ్యసభ సభ్యులు

Updated Date - 2020-07-02T05:30:00+05:30 IST