తదుపరి టార్గెట్‌ సునీత!

ABN , First Publish Date - 2022-07-09T08:13:09+05:30 IST

తదుపరి టార్గెట్‌ సునీత!

తదుపరి టార్గెట్‌ సునీత!

వివేకా కుమార్తె లక్ష్యంగా జగన్‌ శిబిరం కొత్త వ్యూహం

ఆమెకు పులివెందుల వైసీపీ టికెట్‌ ఇస్తున్నట్లు అనుకూల సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం

సీఎం జమ్మలమడుగుకు మారతారని వాదనలు

తండ్రి హత్యపై పోరాడుతున్న చెల్లెలిపై అనుమానాలు కలిగించే ప్రయత్నం

రాజకీయాల్లోకి రానని స్పష్టం చేస్తున్న సునీత

అయినా ఆమె కోసం జగన్‌ చాలా పెద్ద త్యాగం చేస్తున్నారంటూ ప్రచారం


వివేకా కేసులో ఇంకొందరు అరెస్టయ్యే చాన్సు!.. జగన్‌ బంధువుల పాత్ర బయటపడొచ్చు?

అందుకే ఆకస్మికంగా ఈ దుష్ప్రచారం.. వివేకా కుటుంబ సన్నిహితుల అనుమానం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ నుంచి వైఎస్‌ విజయలక్ష్మిని సాగనంపిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి శిబిరం.. తాజాగా సీఎం చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఆమెకు ముఖ్యమంత్రి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నట్లు తమ అనుకూల సామాజిక మాధ్యమాల్లో కథనాలు వండి వారుస్తూ కొత్త తరహా ప్రచార వ్యూహం అమలు చేస్తోంది. ప్రస్తుతం పులివెందుల అసెంబ్లీ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్‌రెడ్డి.. అక్కడి నుంచి తప్పుకొని జమ్మలమడుగు స్థానానికి మారి.. పులివెందుల సీటును సునీతకు ఇవ్వబోతున్నట్లు ఈ కథనాల ద్వారా ప్రచారం చేస్తోంది. తన తండ్రి హత్య కేసులో అసలు హంతకులను బయటపెట్టి.. చట్టానికి పట్టివ్వడానికి నిర్విరామంగా పోరాడుతున్న ఆమెపై ప్రజల్లో అనుమానాలు కలిగించడానికి.. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడానికే ఇలాంటి కథనాలు వ్యాప్తి చేస్తున్నారని వివేకా కుటుంబ సన్నిహిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. జగన్‌కు వరుసకు చెల్లెలయ్యే సునీత గురించి గతంలో రాజకీయ రంగంలో ఎవరికీ తెలియదు. వైద్య వృత్తిలో ఉన్న ఆమె రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారు. తండ్రి దారుణ హత్యతో దిగ్ర్భాంతికి గురైన ఆమె.. అప్పటి నుంచి అందులో నిజాల వెలికితీతకు ధైర్యంగా పోరాడుతూ వస్తున్నారు. వివేకా మరణం రోజు ఆమె పట్టుబట్టడంతోనే ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అది హత్యేనని వెల్లడి కావడంతో హంతకులను పోలీసులు పట్టుకునేలా చూసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ విచారణ అక్కర్లేదని అదే కోర్టులో మరో పిటిషన్‌ వేశారు. జగన్‌రెడ్డి గద్దెనెక్కాక కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు అటకెక్కించడంతో సునీత హైకోర్టును ఆశ్రయించడం.. సీబీఐ దర్యాప్తు కావాలని పోరాడి అందులో విజయం సాధించడం.. సీబీఐ దర్యాప్తు నెమ్మదించిన సమయంలో ఆమె ఢిల్లీ వెళ్లి దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులను కలిసి వేగం పెంచాలని కోరారు. దీంతో సీబీఐ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కొన్ని అరెస్టులూ జరిగాయి. మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని, త్వరలోనే ఈ దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య వెనుక జగన్‌రెడ్డి సమీప బంధువుల పాత్ర ఉందని, అందుచేత ఆయన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. ఈ దశలో ఆకస్మికంగా వైసీపీ అనుకూల సామాజిక మాధ్యమాల్లో సునీతకు పులివెందుల టికెట్‌పై కథనాలు మొదలయ్యాయని వివేకా కుటుంబ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.


పులివెందుల వదులుకుంటారా..?

రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి పులివెందులకు ఆయన కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తోంది. కీలకమైన ఈ స్థానాన్ని జగన్‌ త్యాగం చేసి సునీతకు ఇవ్వబోతున్నారని, తాను జమ్మలమడుగు నుంచి బరిలోకి దిగనున్నారని సదరు కథనాల్లో ఊదరగొడుతున్నారు. ఇవి వైసీపీ వర్గాల్లో.. కడప జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సునీత కోసం జగన్‌ చాలా పెద్ద త్యాగం చేస్తున్నారని, పులివెందుల సీటు వదులుకోవడం మాటలు కాదని ఆయన సన్నిహిత వర్గాలు మాట్లాడడం మొదలుపెట్టాయి. కానీ ఈ ప్రచారాన్ని వివేకా కుటుంబానికి సన్నిహితంగా ఉండే వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా సునీతను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారం చేస్తున్నారని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే యత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. ‘ఆమె ఏనాడూ రాజకీయాల్లో లేరు. ఆమెకు రాజకీయ ఆకాంక్షలు కూడా లేవు. తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారు చట్టానికి దొరక్కుండా బయట స్వేచ్ఛగా తిరుగుతుండడం.. జగన్‌రెడ్డి వారికి మద్దతిస్తుండడం ఆమెకు బాధ కలిగిస్తోంది. తండ్రిని చంపినవారికి కఠిన శిక్ష పడాలన్నది తప్ప ఆమెకు వేరే కోర్కెలు లేవు. ఈ కేసు విషయంలో ఆమె జగన్‌రెడ్డిని ఒకట్రెండు సార్లు కలిశారు. తన భర్తే ఈ హత్య వెనుక ఉన్నాడన్నట్లుగా జగన్‌ మాట్లాడడం ఆమెకు బాధ కలిగించింది. హత్య చేసిన వారెవరో.. దాని వెనుక ఉన్నవారెవరో క్రమంగా మొత్తం బయటకు వస్తోంది. ఆమె రాజకీయాల్లోకి రారు. ఎన్నికల్లో పోటీ  చేయరు. జగన్‌తో రాజీ పడి పులివెందుల సీటు ఆమె తీసుకోబోతున్నారని కఽథనాలు రాయించడం దారుణం’ అని ఆమె కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరించే వ్యక్తి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్రచారం మొదలయ్యాక పులివెందుల ప్రాంతానికి చెందిన కొంత మంది ఆమెను సంప్రదించారు కూడా. అయితే తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, రాజకీయాల్లోకి రానని సునీత వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.

Updated Date - 2022-07-09T08:13:09+05:30 IST