Abn logo
Sep 19 2021 @ 01:25AM

యాదాద్రిక్షేత్రంలో భక్తుల సందడి

నృసింహుడి నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతంకావడంతో యాత్రాజనులు అధిక సంఖ్యలో హరిహరుల దర్శనాలకు తరలివచ్చారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన యాత్రాజనులతో సేవా మండపాలు, తిరువీధులు కోలాహలంగా మారాయి. దర్శక్యూలైన్లు భక్తజనులతో రద్దీ వాతావరణం నెలకొంది. భక్తుల వాహనాలతో పట్టణ ప్రధాన వీధులు, ఘాట్‌రోడ్లు సందడిగా కనిపించాయి. బాలాలయ కవచమూర్తులను కొలిచిన ఆచార్యులు ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చనలు జరిపారు. మండపంలో సుదర్శన హోమం నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు.  స్వామికి శనివారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.10,69,493 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనులను శనివారం వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు పరిశీలించారు. ఆలయ ఉద్ఘాటన ముహూర్తాన్ని సీఎం కేసీఆర్‌ శ్రీవైష్ణవ పీఠాధిపతి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామితో సంప్రదించి నిర్ణయించనున్నారని, ఈ క్రమంలో ఆలయ ఉద్ఘాటన సమయానికి కొండపైన అభివృద్ధి పనులు పూర్తికి కృషి చేయాలని ఆయన సూచించారు.