అంతటా తీర్థాల సందడి

ABN , First Publish Date - 2022-01-18T04:34:58+05:30 IST

పరవాడలో శ్రీరాముని తీర్థం సోమవారం ఘనంగా జరిగింది.

అంతటా తీర్థాల సందడి
మంత్రిపాలెంలో కోలాటం ఆడుతున్న మహిళలు

కనువిందు చేసిన సాముగరిడీలు, చిటికెల భజనలు 

పరవాడ, జనవరి 17: పరవాడలో శ్రీరాముని తీర్థం సోమవారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ మరుసటి రోజు తీర్థాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా తీర్థాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులంతా రామాలయానికెళ్లి శ్రీరాముడికి పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తీర్థంలో ఏర్పాటు చేసిన సాముగరిడీలు, చిడతలు, కోలాటాలు, చిటికెల భజనలు కనువిందు చేశాయి. పరిసర గ్రామాల ప్రజల రాకతో తీర్థం కిక్కిరిసింది. దిబ్బలగొర్లెవానిపాలెం యువకులచే నిర్వహించిన చిటికెల భజన అదరహో అనిపించింది. ఎంపీపీ పైలా వెంకటపద్మలక్ష్మి శ్రీనివాస్‌, సర్పంచ్‌ శిరపురపు అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌ చుక్క రామునాయుడు, ఉప సర్పంచ్‌ బండారు రామారావు తదితరులు శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. గ్రామ పెద్దలు పైలా పోతినాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, రొంగలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు

మంత్రిపాలెంలో..

లంకెలపాలెం: జీవీఎంసీ 85వవార్డు పరిధి మంత్రిపాలెంలో సోమవారం సాయంత్రం సీతారాముల పరస మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పరసలో చెక్క భజనలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, చిడతలు కనువిందు చేశాయి. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు.  రామాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించగా, అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జెర్రిపోతుల అప్పారావు, పచ్చికోరు రమణమూర్తి, గంగరాజు, సత్తిరాజు, రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సబ్బవరం మండలంలో..

సబ్బవరం: మండలంలోని పెదనాయుడుపాలెం, బలిజపాలెం, పెదగొల్లలపాలెం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల్లో సీతారాముల తీర్థ మహోత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని రామాలయాల వద్ద భక్తులు సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాముగరిడీలు, తప్పెట గుళ్లు, చిడతల భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2022-01-18T04:34:58+05:30 IST