మరో ఆరుగురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-09T11:34:16+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఒక రోజు కాస్త నెమ్మదిం చినట్లు కనిపించినా మరుసటి

మరో ఆరుగురికి పాజిటివ్‌

48కి చేరిక కేసుల సంఖ్య

తడలో తండ్రి నుంచి ఇద్దరు కుమారులకు..

నెల్లూరు డాక్టర్‌ నుంచి భార్యకు.. ఫార్మసిస్ట్‌కు..

నాయుడుపేటలో భర్త నుంచి భార్యకు

వాకాడులో పక్కింటిలో ఉన్న పదేళ్ల బాలికకు

ఆరు కాంటాక్ట్‌ కేసులే..

అందరూ ఢిల్లీ బాధితులే !


నెల్లూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా మహమ్మారి  విజృంభిస్తూనే ఉంది. ఒక రోజు కాస్త నెమ్మదిం చినట్లు కనిపించినా మరుసటి రోజు  తన ప్రతాపం చూపుతూనే ఉంది. బుధవారం జరిపిన పరీక్షల్లో మరో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 48కి చేరింది. ఇంకా 150 శ్యాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది. బుధవారం కొత్తగా మరో 20 మంది స్వాబ్‌లు పరీక్షల నిమిత్తం స్విమ్స్‌కు పంపారు. వీటితో కలిపి ఇంకా 170 శ్యాంపిల్స్‌ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. బుధవారం వచ్చిన పాజిటివ్‌ కేసులన్నీ గతంలో పాజిటివ్‌ కేసులు వచ్చిన వారి కుటుంబ సభ్యులకు చెందినవే. వాకాడులో మాత్రం ఇదివరకే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పక్కింటికి చెందిన  పదేళ్ల బాలిక ఈ వ్యాధికి గురయ్యింది. 


డాక్టర్‌ ద్వారా ఇద్దరికి..

నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్‌కు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు, ఆసుపత్రి సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. వీటిలో డాక్టర్‌ సతీమణికి, ఆయన ఆసుపత్రిలో పనిచేసే ఫార్మాసిస్ట్‌కు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఇతడి స్వస్థలం దగదర్తి మండలం పరిధిలో ఉంది. చాలా కాలంగా  ఆసుపత్రికి  సంబంధించిన ముఖ్య కార్యకలాపాలు ఇతనే చూస్తుంటాడు. ఆ క్రమంలోనే ఇతను డాక్టర్‌కు సన్నిహితంగా మెలగడం మూలంగా ఇతడికి పాజిటివ్‌ వచ్చినట్లు భావిస్తున్నారు. 


తండ్రి నుంచి కొడుకులకు..

తడలో హోటల్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి ఈనెల 3వ తేదీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించి వారి స్వాబ్‌లను పరీక్షించారు. వీరిలో ఆయన ఇద్దరు కుమారులకు పాజిటివ్‌ వచ్చింది. ఈ కుటుంబానికి చెందిన ఇంకా 8 మంది రిపోర్టులు వెల్లడి కావాల్సి ఉంది. 


భర్త నుంచి భార్యకు...

నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు జరిపారు. ఈ క్రమంలో ఇతని భార్యకు పాజిటివ్‌ వచ్చింది. ఇతడి పిల్లల రిపోర్టుల వివరాలు తెలియాల్సి ఉంది. 


పక్కింటి పాపకు..

వాకాడులో ఒక వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షించారు. ఇందులో అతడి పక్కంటికి చెందిన  పదేళ్ల బాలికకు పాజిటివ్‌ వచ్చింది. ఈ బాలికకు చిన్న తనం నుంచి ఆయాసంతో బాధపడుతూ ఉంది. ఈమెకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఈ వైరస్‌ ఈమెను సులభంగా  సోకినట్లు తెలుస్తోంది. 


అంతా ఢిల్లీ బాధితులవే..

ఈ రోజు వచ్చిన ఆరు పాజిటివ్‌ కేసులన్నీ ఢిల్లీ ప్రభావిత కేసులే కావడం గమనార్హం. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబీకులకు ఈ వ్యాధి సోకింది. నెల్లూరుకు చెందిన డాక్టర్‌, వాకాడుకు 


చెందిన బాలిక కేసులు మాత్రం కొంత ప్రత్యేకమైనవి. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారితో కాంటాక్ట్‌లోకి వెళ్లినందుకు డాక్టర్‌కు, ఆయన నుంచి ఆయన భార్యకు, ఫార్మసిస్ట్‌కు వైరస్‌ వ్యాపించగా, ఇంటిపట్టునే ఉన్న పదేళ్ల బాలికకు పక్కింటికి చెందిన వ్యక్తి ప్రభావంతో వ్యాధి సంక్రమించింది. 


Updated Date - 2020-04-09T11:34:16+05:30 IST