గూడు కోసం వృద్ధురాలి గోడు!

ABN , First Publish Date - 2021-08-02T08:10:08+05:30 IST

బంధువే మోసం చేయడంతో.. తన ఇంటిని దక్కించుకునేందుకు ఎనిమిది పదుల వయసుదాటిన ఓ వృద్ధురాలు భిక్షాటన చేయాల్సిన దయనీయ పరిస్థితి తలెత్తింది. కడప

గూడు కోసం వృద్ధురాలి గోడు!

ఇల్లు దక్కించుకునేందుకు భిక్షాటన

బంధువులే మోసం చేశారని ఆవేదన

సీఎం జగన్‌, సోనూసూద్‌ స్పందించాలని వేడుకోలు


కడప(ఎర్రముక్కపల్లె), ఆగస్టు 1: బంధువే మోసం చేయడంతో.. తన ఇంటిని దక్కించుకునేందుకు ఎనిమిది పదుల వయసుదాటిన ఓ వృద్ధురాలు భిక్షాటన చేయాల్సిన దయనీయ పరిస్థితి తలెత్తింది. కడప ఆర్టీసీ బస్టాండు వద్ద ఆదివారం ఆమె భిక్షాటన చేస్తూ కనిపించినవారికల్లా తన గోడు వినిపిస్తోంది. కడప నగరానికి చెందిన బూరుగల రాజమ్మ (85) దీనస్థితి ఇది. ఆమె కథనం ప్రకారం.. పాచిపనులు చేసుకునే రాజమ్మ.. 1999లో డబ్బు అవసరమై సాంబయ్య అనే వ్యక్తికి తన ఇంటిని తాకట్టు పెట్టింది. ఏడాదికే డబ్బు ఇవ్వాలని అతడు ఒత్తిడి తేవడంతో ఆమె బంధువైన రాజేంద్ర.. ఆ డబ్బు చెల్లించాడు. అయితే ఆ ఇంటిని తనపేరిట రాయించేసుకున్నాడు.




తొలుత దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. తర్వాత అతడు కోర్టుకు వెళ్లగా అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆమె ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. ఈ నెలాఖరులోగా రూ.1,13,400 చెల్లిస్తే తన ఇంటిని తనకు ఇప్పిస్తానని హైకోర్టు సూచించినట్లు రాజమ్మ చెబుతోంది. డబ్బు కట్టకపోతే ఇల్లు వదులుకోవాల్సి వస్తుందన్న ఆందోళనతో.. గత్యంతరం లేక భిక్షాటనకు దిగింది. దాతలెవరైనా తన ఇంటిని విడిపించుకునేందుకు సాయపడాలని, తన ఇంటిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, సోనూసూద్‌లు స్పందించాలని వేడుకుంటోంది.

Updated Date - 2021-08-02T08:10:08+05:30 IST