Abn logo
Jul 15 2020 @ 00:22AM

పాఠాలు నేర్చుకోని పురాతన పార్టీ

ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలిగిన శక్తి, ఒక నాయకుడిని నిర్మించగలిగిన సత్తా లేనప్పుడు కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉన్నదని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? పార్టీలో ఉన్న యువనేతల్ని కోల్పోతున్న కాంగ్రెస్ వివేక భ్రష్టత చెందలేదని ఎవరైనా ఎందుకు భావిస్తారు? కనీసం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైనా ఒక బలమైన ప్రజాప్రతిపక్షంగా రూపొందలేని కాంగ్రెస్ నిర్వీర్యమైపోతోందని ఎందుకు అనగూడదు? 


ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో జర్నలిస్టులకు రాజేశ్ పైలట్ నివాసం ఒక ఆకర్షణగా ఉండేది. తరుచూ ఆయన జర్నలిస్టులకు రైతు భోజనంతో విందులు ఏర్పాటు చేసేవారు. కిసాన్ ర్యాలీలను నిర్వహించి తననొక రైతునాయకుడుగా చిత్రించుకునేవారు. ఆయనలో ఒక నిత్య అసమ్మతి వాది, పాతతరాన్ని ప్రశ్నించే యువ నేత కనపడేవారు. అందువల్లే ఆ కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నేతలు రాజేశ్ పైలట్‌తో సన్నిహితంగా మెలిగేవారు. రాజేశ్ పైలట్‌ను ఎస్ బి చవాన్ కేబినెట్ మంత్రిగా ఉన్న హోంశాఖలో సహాయమంత్రిగా పీవీ నియమించారు. పైలట్ అత్యంత చురుకుగా పనిచేసి తానే హోంమంత్రి అన్నట్లుగా వ్యవహరించేవారు. కశ్మీర్, పంజాబ్ ఎడా పెడా తిరిగి, రకరకాల ప్రకటనలు చేసి వృద్ధుడైన చవాన్‌ను ఇరకాటంలో పెట్టేవారు. కానీ పగ్గాలు తన చేతిలోనే ఉన్నందువల్ల పీవీ పైలట్‌ను పల్లెత్తు మాట అనకుండానే తాను చేయాల్సిన పనులు చేసేవారు. రాజేశ్ పైలట్‌ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నియమించి యువకులకు ప్రాధాన్యత నిచ్చానన్న సంకేతాలు పంపారు. కశ్మీర్ వరకు వచ్చే సరికి పీవీ ఆ విభాగాన్ని ఉన్నట్లుండి తన అధీనంలోకి తీసుకుని చవాన్, పైలట్ ఇద్దరి ప్రమేయం లేకుండా చేశారు. సీతారాం కేసరి బదులు రాజేశ్ పైలట్‌ను పార్టీ అధ్యక్షుడుగా పీవీ ప్రతిపాదించి ఉంటే ఏం జరిగి ఉండేదో కానీ, కేసరిని నమ్మి పీవీ మోసపోవడంతో పార్టీపై సోనియా పట్టుబిగించేందుకు అడ్డులేకుండా పోయింది.


కాంగ్రెస్ రాజకీయాల్లో పీవీ బలహీనంగా మారిన సమయంలో రాజేశ్ పైలట్ పీవీని కూడా నేరుగా ఢీకొన్నారు. 1996లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక పార్టీ పదవి నుంచి పీవీ తప్పుకోవాలని, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని రాజేశ్ పైలట్ డిమాండ్ చేశారు. యువ నేతలను తన శిబిరంలోకి చేర్చుకుని తానే పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ప్రయత్నించారు. పీవీకి ప్రత్యర్థి ఎవరూ లేరనుకున్న సమయంలో దూకుడు ప్రదర్శించిన రాజేశ్ పైలట్ సోనియా రంగ ప్రవేశం చేసిన తర్వాత వెనక్కు తగ్గాల్సి వచ్చింది. శరద్ పవార్, పిఏ సంగ్మా, తారిక్ అన్వర్‌లతో చేతులు కలపకుండా ఆయన అదనుకోసం ఎదురు చూస్తూ కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. 2000లో రోడ్డు ప్రమాదంలో మరణించకుండా ఉంటే రాజేశ్ పైలట్ పార్టీలో బలమైన నేతగా నిలిచేవారేమో! రాజేశ్ పైలట్, మాధవరావు సింధియా వంటి నేతల ఆకస్మిక మరణం వల్ల సోనియాగాంధీకి తిరుగులేకుండా పోయింది. కాని తండ్రులు చేయలేని పనిని ఇవాళ వారి కుమారులు ప్రారంభించారు. వృద్ధురాలైన సోనియాగాంధీ, అస్త్రసన్యాసం చేసిన రాహుల్ గాంధీ హయాంలో కునారిల్లిపోతున్న కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి బయటపడిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే బిజెపితో చేతులు కలపగా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్ ధిక్కార స్వరాన్ని వినిపించి తన దారి తాను చూసుకునే క్రమంలో ఉన్నారు.


నిజానికి సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రోత్సహించే బదులు యువనేతలైన జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పి ఉంటే వారు జాతీయ స్థాయిలో పార్టీలో నూతనోత్తేజం తెచ్చేందుకు సహకరించేవారు. రాహుల్ మాట్లాడలేక తత్తరపడుతున్న సమయంలో ఇద్దరూ పార్లమెంట్‌లో అనర్గళంగా ప్రసంగించేవారు. రాహుల్‌కు కుడిఎడమవైపు కూర్చుని ఒక యువతరంగానికి చిహ్నంగా కనపడేవారు. 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో ఇరువురూ బిజెపి మతతత్వ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. వారిద్దర్నీ ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు పంపి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు దోహదం చేసేందుకు ఉపయోగించుకున్న తర్వాత కనీసం వారికి ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవులు అప్పగించినా అక్కడ పార్టీకి యువ సారథ్యం లభించి ఉండేది. కాని ఆ రెండు రాష్ట్రాల్లోనూ అత్యంత సీనియర్ నేతలకే పట్టం కట్టడమే కాక వారికి ప్రాధాన్యత కూడా లేకుండా చేయడంతో కాంగ్రెస్‌లో యువనేతలకు ఇక భవిష్యత్తు ఉంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తొలుత జ్యోతిరాదిత్య సింధియా, ఇవాళ సచిన్ పైలట్ నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వృద్ధ సంస్థగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది.


కాంగ్రెస్‌లో పిసిసి అధ్యక్షులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉప ముఖ్యమంత్రులు, చీఫ్ విప్ వంటి కీలక పదవులు నిర్వహించిన వారికి సైతం ఇవాళ పార్టీ భవిష్యత్ పట్ల విశ్వాసం లేకుండా ఎందుకు పోయింది? కాంగ్రెస్ పార్టీ మీకు ఇన్ని పదవులు ఇచ్చింది కదా.. అందువల్ల ఇవాళ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు నోరు మెదపకుండా ఉండాలి.. అంటే భరించే స్థితిలో ఎవరూ కనపడడం లేదు. రాజేశ్ పైలట్, మాధవరావు సింధియా లాంటి నేతలు అంతర్గతంగానే పోరాడాలని నిర్ణయించుకున్నారు కాని ఇవాళ వారి కుమారులకు అంత ఓపిక ఉన్నట్లు కనపడడం లేదు. ఇది ఒక రకంగా ఒక వారసత్వంపై మరో వారసత్వం తిరుగుబాటు అని చెప్పక తప్పదు.


విషాదకరమైన పరిస్థితి ఏమిటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో జాతీయ ప్రతిపక్ష స్థానంలో ఉన్నది. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించి, ప్రజా పోరాటాలను నిర్వహించి, దేశ ప్రజలను జాగరూకులు చేయాల్సిన కీలక బాధ్యత కాంగ్రెస్ పై ఉన్నది. కాని కాంగ్రెస్ పార్టీ తనను తాను రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నది. దేశమంతటా విస్తరించి కాంగ్రెస్ ముక్త భారత్‌ను స్థాపించే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అన్ని ఆయుధాలను ప్రయోగించి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కాని ఒక ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత వీటన్నిటినీ తట్టుకునే శక్తిని సంపాదించుకోగలగాలి. ప్రజల్లో ఆదరణను రోజు రోజుకూ పెంచుకోగలగాలి. కాని గత ఆరేళ్లలో కాంగ్రెస్ రోజురోజుకూ బలాన్ని కోల్పోతుండడమే కాక సాధించిన రాష్ట్రాలను కూడా బిజెపికి పళ్లెంలో పెట్టి అప్పగించాల్సి వస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ బాటలో ఇవాళ రాజస్థాన్ కూడా నడుస్తోంది అంతేకాదు, గత ఆరేళ్లుగా మోదీ సర్కార్ పై కాంగ్రెస్ వేస్తున్న అనేక బాణాలూ తుత్తునియలై పోతున్నాయి. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మోదీకి వరాలుగా పరిణమిస్తున్నాయి. వ్యవస్థల పతనాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఏకపక్ష నిర్ణయాలు, రాష్ట్రాలపై ఆధిపత్యం,నియంతృత్వ పోకడలు, అనేక తప్పుడు నిర్ణయాలతో నరేంద్రమోదీ ప్రతిపక్షాలకు ఆయుధాలను అందించకపోలేదు. కాని ఆ ఆయుధాలను చేతిలో కూడా పట్టుకోలేని దుర్బలంగా కాంగ్రెస్ మారిపోయింది. యుపిఏ పదేళ్ల హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు వివిధ సామాజిక సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగి సోనియా-–మన్మోహన్ సర్కార్‌ను కుప్పకూల్చినటువంటి కమల దళ వ్యూహం, శక్తిసామర్థ్యాలు కాంగ్రెస్‌లో మచ్చుకైనా కనపడడం లేదు. అంతేకాదు, గుజరాత్ నుంచి నరేంద్రమోదీని జాతీయ స్థాయిలో రంగంలోకి దించి ఆయనను ఒక మహాపురుషుడుగా చిత్రించి ఉవ్వెత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్మించగలిగిన బిజెపి–సంఘ్ పరివార్ రణనీతి నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకున్నట్లు కనపడడం లేదు. అటు ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలిగిన శక్తీ లేదు, ఇటు ఒక నాయకుడిని నిర్మించగలిగిన సత్తా కూడా లేనప్పుడు కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉన్నదని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? పైగా అన్ని రాష్ట్రాల్లో పార్టీలో ఉన్న యువనేతల్ని కోల్పోతున్న కాంగ్రెస్ వివేక భ్రష్టత చెందలేదని ఎవరైనా ఎందుకు భావిస్తారు? కనీసం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఒక బలమైన ప్రజాప్రతిపక్షాన్ని నిర్మించలేని కాంగ్రెస్ నిర్వీర్యమయిపోతోందని ఎందుకు అనగూడదు? ఇవాళ దేశంలో బిజెపి, ప్రాంతీయ పార్టీలు విస్తరించిన ప్రాంతాల్లోనే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యమేలిందని, ఆ ప్రాంతాలను కోల్పోవడం కాంగ్రెస్ నాయకత్వ అసమర్థతకు చిహ్నమని ఎందుకు అంగీకరించకూడదు?


భారతీయ జనతా పార్టీ ఒక మహా వ్యూహంతోనే వివిధ రాష్ట్రాల్లో ఒక పథకం ప్రకారం పావులు కదుపుతూ ప్రత్యర్థి కట్టడాల్ని కూల్చేస్తున్న క్రమం స్పష్టంగా అర్థమవుతోంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏమి చేయాలన్న వ్యూహం ప్రకారమే పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో నరేంద్రమోదీకి బలమైన ప్రతిపక్షాన్ని ఎవరు నిర్మించగలరు? నిజానికి కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బిజెపిని బలంగా అడ్డుకోగలుగుతున్నాయి. కాని ఆ ప్రాంతీయ పార్టీలు గడప దాటి జాతీయ స్థాయిలో తమ ఉనికిని చాటుకునే స్థితిలో ఉన్నాయా లేదా అన్నది అనుమానమే. అవి ఇంటగెలిచేందుకే తీవ్ర యత్నాలు చేయాల్సిన సమయంలో రచ్చ గెలిచేందుకు సాహసించగలవా అన్నది సందేహాస్పదమే. కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బతీసిన తర్వాత బిజెపి పూర్తి దృష్టి ప్రాంతీయ పార్టీలపై కేంద్రీకృతం చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు, సిద్ధాంతాలు, బలమైన ప్రతిపక్షం ఉండడం వల్లే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇవాళ దేశంలో వ్యాపించిన అనారోగ్య వాతావరణం ఊపిరాడకుండా చేస్తోందని ఎవరైనా అంటే విభేదించాల్సింది ఏమీ లేదు. ఇందుకు బాధ్యత కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలదే.

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Advertisement
Advertisement
Advertisement