Abn logo
Jul 22 2021 @ 03:10AM

ఒలింపిక్స్‌ రేపటి నుంచే

ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎన్ని పతకాలు వస్తాయి? ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే భారత్‌కు లభించిన పతకాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్నే..! అయితే, టోక్యోలో భారత్‌ డబుల్‌ డిజిట్‌ సాధిస్తుందని ప్రముఖ డేటా, టెక్నాలజీ కంపెనీ గ్రేస్‌నోట్‌ చెబుతోంది. మొత్తంగా భారత్‌కు 19 (4 స్వర్ణ, 9 రజత, 6 కాంస్య) పతకాలు రావచ్చని అంచనా వేస్తోంది. ఓవరాల్‌గా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలవవచ్చని లెక్కలు వేస్తోంది. మన క్రీడాధికారులు కూడా పతకాల్లో రెండంకెల సంఖ్యను సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

భారత ఒలింపిక్‌ చరిత్రలో అత్యధికంగా 2012 లండన్‌ గేమ్స్‌లో ఆరు పతకాలు సాధిస్తే.. 2016 రియోకు వచ్చే సరికి ఆ సంఖ్య రెండుకు పడిపోయింది.గత క్రీడలతో పోల్చుకుంటే భారత పతకాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నా.. రెండంకెలను సాధించడం కష్టమనే అభిప్రాయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి పతక అవకాశాలపై గ్రేస్‌నోట్‌ అంచనా, అలాగే  నిపుణుల అభిప్రాయం ఎలావుందో పరిశీలిద్దాం...

షూటింగ్‌

8 పతకాలు (2 పసిడి, 4 రజత, 2 కాంస్య)

టోక్యోలో మెడల్స్‌ ఎక్కువగా అందించే ఈవెంట్‌ షూటింగ్‌ అని భావిస్తున్నారు. 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌లో ఎలవేనిల్‌ వలరివన్‌ వ్యక్తిగత స్వర్ణంపై భారీగా ఆశలున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌-సౌరభ్‌ చౌధరి జోడీ పసిడిని షూట్‌ చేసే అవకాశాలున్నాయి. ఇదే ఈవెంట్‌ వ్యక్తిగత విభాగాల్లో భాకర్‌, సౌరభ్‌, మహిళల 25 మీ. ఎయిర్‌ రైఫిల్‌లో రాహి సర్నోబాత్‌, 10 మీ. రైఫిల్‌ మిక్స్‌లో దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌-వలరివన్‌ జోడీ రజతాలు నెగ్గే చాన్సుంది. పురుషుల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌లో దివ్యాంశ్‌, 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో యశస్విని  కాంస్యం సాధిస్తారనే అంచనాలు వేస్తున్నారు. 

నిపుణుల అంచనా: 2 పతకాలు

రెజ్లింగ్‌

అంచనా : 3 పతకాలు (2 స్వర్ణ, 1 కాంస్య)

టోక్యో రెజ్లింగ్‌లో పతకాలు అంటే గట్టిగా వినిపిస్తున్న పేర్లు బజరంగ్‌ పూనియా (65 కిలోలు), మహిళల్లో వినేష్‌ ఫొగట్‌ (53 కిలోలు). ఫ్రీస్టైల్‌ విభాగంలో వీరిద్దరూ బంగారు పతకాలు సాధిస్తారనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక 86 కిలోల్లో దీపక్‌ పూనియా కాంస్యం నెగ్గుతాడని భావిస్తున్నారు. రవి దహియా (57 కి)కు  సంచలనం సృష్టించగలిగే సత్తా ఉంది. 

నిపుణుల అంచనా ఒకే పతకం 

వెయిట్‌ లిఫ్టింగ్‌ అంచనా : 1 పతకం (రజతం)

వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఏకైక ఆశ మీరాబాయి చాను. మెగా ఈవెంట్‌కు నార్త్‌ కొరియా దూరం కావడంతో.. మీరాకు పతక అవకాశాలు భారీగా పెరిగాయి. 49 కిలోల విభాగంలో చాను రజతం సాధిస్తుందనే అంచనాలున్నాయి. 

పురుషుల హాకీ

అంచనా : 5వ స్థానం

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆట కూడా ఎంతో మెరుగుపడడంతోపాటు యూరోపియన్‌ జట్లకు గట్టిపోటీ ఇస్తోంది. మహిళల జట్టును డార్క్‌ హార్స్‌గా పరిగణిస్తున్నారు. 

నిపుణుల అంచనా కష్టం. (అద్భుతం జరిగితే ఒక పతకం)

బ్యాడ్మింటన్‌

అంచనా: సింధుకు నాలుగో స్థానం

గత క్రీడల్లో రజతం సాధించిన పీవీ సింధుపై భారీ అంచనాలున్నాయి. అయితే, ఏడాదిగా ఆమె ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇదిలావుంటే....ఈసారి ఆమె స్వర్ణం సాధిస్తుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు.  ఇక పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ జంట సంచలన విజయాలు అందుకొనే అవకాశాలు లేకపోలేదు.

నిపుణుల అంచనా  పతకం ఖాయం


కొవిడ్‌ కేసులు పైపైకి..

విశ్వ క్రీడల వేదిక టోక్యోలో కొవిడ్‌ కేసులు ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. మరో రెండు రోజుల్లో మెగా ఈవెంట్‌ ఆరంభం కానుండగా..టోక్యోలో బుధవారం 1832 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదేస్థాయిలో వైరస్‌ విజృంభిస్తే రాబోయే రెండు వారాల్లో సగటు రోజు కేసుల సంఖ్య 2600కు చేరుతుందట.

బాక్సింగ్‌

అంచనా : 5 పతకాలు (3 రజత, 2 కాంస్య)

బాక్సింగ్‌లో తక్కువ మందే అర్హత సాధించినా.. పతకాలపై అంచనాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. పురుషుల 52 కిలోల్లో అమిత్‌ పంగల్‌, మహిళల 52 కిలోల్లో మేరీ కోమ్‌, 69 కిలోల్లో లవ్లీనా బోర్గొహైన్‌లు ఫైనల్‌ చేరతారనే అంచనాలు ఉన్నాయి. పూజా రాణి (75 కి), మనీష్‌ కౌశిక్‌ (63 కి) కాంస్యాలతో సంతృప్తిపడే అవకాశం ఉంది. వికాస్‌ క్రిషన్‌ (69 కి) సంచలనం సృష్టిస్తాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 

నిపుణుల అంచనా: 2 పతకాలు

ఆర్చరీ

అంచనా : 3 పతకాలు (1 రజత, 2 కాంస్య)

ముచ్చటగా మూ డోసారి ఒలింపిక్‌ బరిలోకి దిగుతున్న టాప్‌ ర్యాంకర్‌ దీపికా కుమారి వ్యక్తిగత రజతం సాధిస్తుందని లెక్కిస్తున్నారు. మిక్స్‌డ్‌లో భార్యభర్తలు దీపిక-అతాను దాస్‌ అద్భుతం చేస్తారని భావిస్తుండగా.. పురుషుల రికర్వ్‌ టీమ్‌ కాంస్యంతో వెనుదిరగవచ్చు. 

నిపుణుల అంచనా కష్టం (అనూహ్యమైతే ఒక మెడల్‌)ఆర్చరీ

అథ్లెటిక్స్‌

అంచనా : మెడల్‌ కష్టమే

28 మంది అథ్లెట్లను భారత్‌ ఒలింపిక్స్‌కు పంపింది. వీరిలో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మినహా ఎవరిపైనా పతక ఆశలు లేవు. విదేశాల్లో శిక్షణ పొందిన చోప్రా.. విశ్వ వేదికపై ఏమేరకు సత్తా చాటుతాడో చూడాలి. 

నిపుణుల అంచనా ఒక పతకం బాక్సింగ్‌