తనిఖీల పేరుతో పెరగనున్న తాకిడి

ABN , First Publish Date - 2021-08-10T05:25:46+05:30 IST

తనిఖీల పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలకు అధికారుల తాకిడి పది రోజులుగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కానుంది.

తనిఖీల పేరుతో పెరగనున్న తాకిడి

నీరసిస్తున్నాయనే అనుమానంతోనే సచివాలయాలపై ముప్పేట తనిఖీలు

ఉద్యోగులను దారికి తెచ్చుకునే వ్యూహం


కలికిరి, ఆగస్టు 9: తనిఖీల పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలకు అధికారుల తాకిడి పది రోజులుగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కానుంది. సచివాలయ ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తూ వారిని కట్టడిలోకి తీసుకునే ఎత్తుగడతో ప్రభుత్వం ముప్పేట తనిఖీలను ముమ్మరం చేస్తోంది. పది రోజుల క్రితం సచివాలయాలపై సమీక్షించిన సీఎం వాటి పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. సీఎం డ్యాష్‌ బోర్డు సమాచారంలో సచివాలయాల పని తీరు అధ్వానంగా వున్నట్లు గుర్తించారు.దీంతో సచివాలయాలతోపాటు వాటిలో పనిచేసే ఉద్యోగులను దారికి తెచ్చుకునే యత్నాలను ప్రారంభించాలని నిర్ణయించారు. జిల్లా అధికారులు వారంలో రెండు మూడు రోజులు తప్పనిసరిగా సచివాలయాలను తనిఖీ చేయాలని అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఉదాసీనంగా ఉండే అధికారులకు నోటీసులు జారీ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. దీంతో  జిల్లా, డివిజను స్థాయి అధికారులు చేస్తున్న సచివాలయాల సందర్శనల సంఖ్య పెరుగుతోంది. గత శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం ఈ అంశం గురించి చర్చ జరిగింది. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని ఆ వివరాలు చెబుతూ వారంలో ఒక రోజు కలెక్టరు, జేసీలు, సబ్‌ కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయంలోనే వుండి వాటి పనితీరును సమీక్షించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా వారంలో 3 రోజులు ఎమ్మెల్యేలు, 2 రోజులు మంత్రులు కూడా సచివాలయాలను సందర్శించాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సచివాలయాలకు ముప్పేట తనిఖీలు ముమ్మరం కానున్నాయని అధికార వర్గాల్లో చర్చ జరుగతోంది.


అసలీ తనిఖీల లోగుట్టు ఏమిటో?


ఉన్నఫళంగా అటు జిల్లా స్థాయి అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు సచివాలయాలపై సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం వెనుక పలు కారణాలున్నట్లు చెబుతున్నారు.సచివాలయ వ్యవస్థ ఏర్పాటయి అక్టోబరుకు రెండేళ్ళు పూర్తవనుంది. ఇటీవలే ఉద్యోగులకు సర్వీసు రిజిస్టర్లు కూడా ప్రారంభించారు.రెండేళ్ళు పూర్తికాగానే జిల్లాలోని 1300పై చిలుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 11,500 మంది  ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాల్సి వుంది. ప్రస్తుతం వీరికి కన్సాలిడేటెడ్‌గా నెలకు రూ.15000 చెల్లిస్తున్నారు. రెగ్యులరైతే జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో ఒక్కొక్కరికి రూ.22 వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. దీని కోసం రెండు పరీక్షలు ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం తాజాగా మెలిక పెట్టింది. ఈ రెండింటిలో క్లిష్టమైన క్రెడిట్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ సిస్టం (సీబీఏఎస్‌) పరీక్షపై ఉద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం పరీక్షలు పాస్‌ కాకపోయినా ఉద్యోగంలో కొనసాగిస్తామని, పాసయిన తరువాత రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చింది. సీబీఏఎస్‌ పరీక్షను 25 శాతం మంది కూడా గట్టెక్కే అవకాశాలు లేవని అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు తెలిసిన సత్యమే. ఈ తరహాలో మొత్తం ఉద్యోగులు రెగ్యులరైజ్‌ కావడానికి నాలుగైదేళ్ళు పడుతుంది. దీంతో పెరిగే జీతాలను చెల్లించడానికి ప్రభుత్వానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. ఉద్యోగులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా సంఘటితమై పోరాటానికి సిద్దపడ్డారు. ఈ దశలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. సీబీఏఎస్‌ పరీక్షలు పెట్టబోమని, డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు మాత్రమే సరిపోతాయని స్పెషల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ హామీ ఇచ్చారు. అయినా దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం రాలేదు. ఈ దశలోనే ముమ్మర తనిఖీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఉద్యోగుల పని తీరును ప్రశ్నించడమే ఈ తనిఖీల ఉద్దేశమని, దీంతో సంఘటితమైన ఉద్యోగులు తనిఖీల ద్వారా వెల్లడయ్యే తమ తప్పిదాల నుంచి బయట పడటానికి దారులు వెదుక్కోలేక ప్రభుత్వ షరతులకు దిగొస్తారని ప్రభుత్వం వ్యూహాత్మకంగా తనిఖీలను తెరమీదకు తెచ్చినట్లు చెబుతున్నారు. వాస్తవానికి దారీ తెన్నూ లేక సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారయి కూచుందని, ప్రజలకు ఆశించిన సేవలను అందజేయడంలో ఉద్యోగులు బాధ్యయుతంగా వ్యవహరించడం లేదనే విభిన్న వాదనలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ముప్పేట తనిఖీల పేరుతో సచివాలయ వ్యవస్థను ఎంత మాత్రం దారికి తెస్తారన్నది వేచి చూడాల్సిందేనని కూడా అంటున్నారు.

Updated Date - 2021-08-10T05:25:46+05:30 IST