చెమటతో ఏం లాభం?

ABN , First Publish Date - 2020-06-16T10:07:36+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ కార్యకలాపాలాన్నీ నిలిచిపోయాయి. ఒకవేళ గైడ్‌లైన్స్...

చెమటతో ఏం లాభం?

ఉమ్మి వాడకమే కీలకం

పేసర్ల అభిప్రాయం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ కార్యకలాపాలాన్నీ నిలిచిపోయాయి. ఒకవేళ గైడ్‌లైన్స్‌ పాటిస్తూ ఆయా బోర్డులు ధైర్యం చేసి సిరీ్‌సలను ఆరంభించినా అవి మునుపటిలా మాత్రం జరిగే వీలులేదు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లను ఆడించడమే కాకుండా చాలా కొత్త పద్ధతులకు అలవాటు పడాల్సి ఉంటుంది. అందుకే వచ్చేనెల 8 నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే మూడు టెస్టుల సిరీ్‌సపై అందరి దృష్టీ నెలకొంది. ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా బయో సెక్యూర్‌ వాతావరణంలో ఈ సిరీస్‌ జరగనుంది. ఇకనుంచి బంతి మెరుపు కోసం బౌలర్లు లాలాజలం ఉపయోగించరాదని ఐసీసీ ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో ఇదే పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఉమ్మిని వాడకుండా  బౌలర్లు బంతిని స్వింగ్‌ చేయలేరని, దీంతో ఆట బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారుతుందని తాజా, మాజీ ఆటగాళ్లంతా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. 

చెమటకు అంగీకరించినా..: కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఉమ్మిని నిషేధించినా.. చెమటను మాత్రం ఉపయోగించవచ్చని సూచించింది. కానీ ఇది ఏమేర ప్రభావం చూపగలదని విశ్లేషకులు సందేహిస్తున్నారు. అయితే కరోనా సద్దుమణిగాక ఉమ్మి వాడడంపై నిషేధం ఉండదని ఐసీసీ తేల్చింది. కానీ అప్పటిదాకైనా బౌలర్లు ఎలా విజయవంతం కాగలరని ప్రశ్నిస్తున్నారు. నిజానికి బంతి మెరుపు కోసం ఫాస్ట్‌ బౌలర్లు చెమటను కాకుండా ఉమ్మికి ఎందుకు ప్రాధాన్యమిస్తారో పేసర్లు షమి, ఇర్ఫాన్‌ తెలిపారు. ‘బంతిని బరువుగా, మృదువుగా మార్చేందుకు చెమటను వినియోగిస్తాం. కానీ రివర్స్‌ స్వింగ్‌ కావాలంటే మాత్రం ఉమ్మి కావాల్సిందే. ఇది బంతిని గట్టిగా మార్చడంతో పాటు మెరుపును అందిస్తుంది’ అని షమి తెలిపాడు. అలాగే  పిచ్‌లను బౌలర్లకు అనుకూలంగా తయారుచేయాలని ఇర్ఫాన్‌ కోరాడు. ముఖ్యంగా రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టేందుకు పేసర్లకు ఉమ్మిని రుద్దడం చాలా అవసరమని నొక్కిచెప్పాడు. ‘టెస్టు క్రికెట్‌ ఇంతకుముందులా కనిపించదు. అందుకే ఇక పిచ్‌లను పచ్చిక ఎక్కువ ఉండేలా లేక టర్నింగ్‌ ట్రాక్‌లాగా అయినా మార్చాలి. కొన్నాళ్లపాటు ఫ్లాట్‌ ట్రాక్‌ను రూపొందించడం మానుకోవాలి’ అని ఇర్ఫాన్‌ ఐసీసీకి సూచించాడు. 

స్పిన్‌కూ  ఇబ్బందే: ఐసీసీ తాజా నిషేధంపై పేసర్లే కాకుండా అటు స్పిన్నర్లు కూడా వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ‘మధ్య ఓవర్లలో బంతిని డ్రిఫ్ట్‌ చేసేందుకు మేం కూడా ఉమ్మిని ఉపయోగిస్తాం. ఇప్పుడు మేం అలా చేయలేకపోతే పట్టు సాధించలేం. దీనికి ప్రత్నామ్నాయం కచ్చితంగా ఉండాల్సిందే’ అని లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ పేర్కొన్నాడు. వన్డేల్లో ఇబ్బంది లేకపోయినా టెస్టుల్లో మాత్రం తమకు సవాలేనని మరో స్పిన్నర్‌ కుల్దీప్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు బంతి కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే చెమటతో మెరుపు సాధించగలమని, ఆతర్వాత సాధ్యం కాదని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ తెలిపాడు.

మైనం బెస్ట్‌: ఉమ్మికి ప్రత్నామ్నాయంగా బౌలర్లు మైనాన్ని వాడితే కాస్త ప్రభావం ఉంటుందని సచిన్‌  టెండూల్కర్‌ సూచించాడు. ‘కొన్ని దేశాల్లో చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి చెమట ఎక్కువగా పట్టదు. మరి.. అప్పుడు వారేం చేయాలి? అందుకే అంపైర్లకు మైనంతో కూడిన ఓ బాక్స్‌ను అందించాలి. అయితే ఎన్ని గ్రాముల మైనం బౌలర్లకు ఇవ్వాలో ఐసీసీ సూచించాలి. అలాగే టెస్టుల్లో 45-50 ఓవర్ల తర్వాత బంతిని మార్చే విషయం కూడా ఐసీసీ ఆలోచించాలి’ అని సచిన్‌  తెలిపాడు.


‘నెగెటివ్‌’ అయితే అనుమతించాలి

ప్రతీ సిరీ్‌సకు ముందు ఆటగాళ్లకు కరోనా టెస్టు చేసినప్పుడు నెగెటివ్‌గా తేలితే వారిని బంతిపై ఉమ్మి రుద్దేందుకు అనుమతించాలని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ సూచించాడు. ‘ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. మెడికల్‌ టీమ్‌ ఈ విషయంలో మరింత వివరణ ఇవ్వవచ్చు. బంతికి మెరుపు తెచ్చేలా చేయడం బౌలర్లకు అవసరం. ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని అర్థమవుతోంది. ఏదేమైనా ఇంగ్లండ్‌-విండీస్‌ టెస్టు సిరీస్‌ ద్వారా అందరికీ ఓ అవగాహన వస్తుంది’ అని అగార్కర్‌ చెప్పాడు.

Updated Date - 2020-06-16T10:07:36+05:30 IST