ముంచెత్తిన వరద

ABN , First Publish Date - 2022-07-11T08:11:47+05:30 IST

జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతోంది. మహారాష్ట్రతో పాటు శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం ఒక్కరోజే ఎస్సారెస్పీలోకి 4.95లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. దీంతో అధికారులు సాయం త్రం ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువకు 25వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీరామసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు గేట్ల ను ఎత్తడంతో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించారు.

ముంచెత్తిన వరద

శ్రీరామసాగర్‌కు పోటెత్తిన వరద 

ఒక్కరోజే 4.95లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

ప్రాజెక్టు 9గేట్లు ఎత్తిన అధికారులు 

కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

సాలూర వద్ద బ్రిడ్జిని తాకిన వరద నీరు 

తాత్కాలికంగా బ్రిడ్జి మూసివేత 

మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిపివేత 

నిజామాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతోంది. మహారాష్ట్రతో పాటు శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం ఒక్కరోజే ఎస్సారెస్పీలోకి 4.95లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. దీంతో అధికారులు సాయం త్రం ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువకు 25వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీరామసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు గేట్ల ను ఎత్తడంతో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించారు. అలాగే నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నవీపేట మండలంలో అత్యధికంగా 217 మి.మీల వర్షం పడింది. వర్షాలకు జిల్లా అంతటా వరదలు పోటెత్తుతుండడంతో.. చెరువుల్లోకి భారీగా నీళ్లు చేరాయి. జిల్లాలోని సరిహద్దు కందకుర్తి వద్ద త్రివేణి సంగమం వరదతో పోటెత్తగా.. అక్కడ ఉన్న పాత శివాలయం నీట మునిగింది. సాలూర-మంజీరా వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తుండడంతో.. అధికారులు బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో తెలంగాణ-మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తం 968 చెరువులు ఉండగా.. 519 చెరువులు నిండడంతో పాటు మత్తళ్లు పారుతున్నాయి. పలుచోట్ల కుంట లు, చెరువుల మత్తళ్ల గండ్లు పడ్డాయి. చెరువుల కాల్వలు తెగిపోయాయి. జిల్లావ్యాప్తంగా 369 ఇళ్ల వరకు పాక్షికం గా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల వల్ల జిల్లాలోని 9 గ్రామాల పరిధిలో రోడ్ల కల్వర్టులు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం నిజాంసాగర్‌ కెనాల్‌లో చేపలవేటకు వెళ్లి గల్లంతైన ఇద్దరిలో ఆదివారం నడిపి సాయిలు అనే వ్యక్తి మృతదేహం లభించింది. మరొకరి కోసం అధికారులు గాలి స్తున్నారు. అలాగే బోధన్‌ మండలంలోని చిన్నమావంది, పెద్దమావంది గ్రామాల మధ్య గల చెక్‌ డ్యాం వద్ద గుర్తుతెలియని శవం నీటిపై తేలి ఆడుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడి నుంచో ఈ గుర్తు తెలియని శవం కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌ సూచించారు. ఆదివారం ఆయన వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పీలతో వరద పరిస్థితుపై సమీక్షించారు. అలాగే ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా క్రిస్టినా జడ్‌ చోంగ్తూను ప్రభుత్వం నియమించింది. ఆమె జిల్లాలో వరద ఉధృతి, పంట నష్టం తదితర అంశాలను పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. సహాయ చర్యలను చేపట్టేందుకు అధికారులను అప్రమత్తం చేయనున్నారు.

Updated Date - 2022-07-11T08:11:47+05:30 IST