Abn logo
Sep 24 2021 @ 23:20PM

పీఏసీఎస్‌ చైర్మన్‌ బెదిరించి ట్రక్‌షీట్లు తీసుకున్నారు

చేర్యాల సొసైటీ కార్యాలయంలో సీఏసీఎస్‌ డైరెక్టర్లను విచారిస్తున్న డీసీవో చంద్రమోహన్‌రెడ్డి

కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల వాంగ్మూలం

నాలుగో రోజూ కొనసాగిన విజిలెన్స్‌ అధికారుల విచారణ

డైరెక్టర్లను విచారించిన సిద్దిపేట జిల్లా సహకార అధికారి


చేర్యాల, సెప్టెంబరు 24: చేర్యాల పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు అవకతవకలపై నాలుగు రోజులుగా సివిల్‌ సప్లయిస్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్‌ ్సమెంట్‌ అధికారుల విచారణ కొనసాగుతూనే ఉంది. రైతులు ధాన్యం విక్రయించకున్నా విక్రయించినట్లుగా చిత్రీకరించి నకిలీ ట్రక్‌షీట్లతో లక్షలాది రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలపై స్థానిక సొసైటీ కార్యాలయం, మూడు కొనుగోలు కేంద్రాలతో పాటు పారాబాయిల్డ్‌ మిల్లుల రికార్డులను పరిశీలించారు. కొండపాక, సిద్దిపేట మండలంలోని ఇతర మిల్లుల రికార్డులను సోదా చేశారు. అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీలను గుర్తించిన అధికారులు సంబంధిత రైతులు, బ్యాంకు ఖాతాదారులను విచారించిన క్రమంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 


బినామీ పేర్లు రాసిచ్చారు

ధాన్యం కొనుగోలు సమయంలో ధాన్యం లేకుండా, లారీలు రాకుండానే పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగ చంద్రారెడ్డి బినామీ రైతుల పేర్లు రాసిచ్చి తాను అడిగినమేర ట్రక్‌షీట్లు ఇవ్వమని బెదిరించాడని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాంగ్మూలం అందజేశారు. చేర్యాల కేంద్రం పేరిట 14, కడవేరుగులో 6, పోసాన్‌పల్లిలో 13 చొప్పున ట్రక్‌షీట్లు రాసిచ్చామని ఆయా కేంద్రాల నిర్వహకులు శుక్రవారం సిద్దిపేట డీసీవోకు వాంగ్మూల ప్రతిని అందించారు. అనంతరం విజిలెన్స్‌ అధికారుల సూచన మేరకు మూడు కేంద్రాల నిర్వహకులు మల్లిగారి మనోహర్‌, అవుశర్ల నీలిమ, ఆరుట్ల నరేశ్‌లను వెంటబెట్టుకుని సొసైటీ సీఈవో రాములు జిల్లా కేంద్రానికి వెళ్లారు. చేర్యాల మండలం కడవేరుగు కొనుగోలు కేంద్రంలో పిల్లి విజయ్‌ 521 బస్తాల ధాన్యం, కొమ్ముల బాలనర్సయ్య 82 క్వింటాళ్ల ధాన్యం విక్రయించినప్పటికీ ఇప్పటివరకు తమకు ధాన్యం డబ్బు అందించలేదని డీసీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.


లూటీ ఎంత ?

మూడు కొనుగోలు కేంద్రాల లావాదేవీలపై నిర్వహించిన విచారణలో అవకతవకలు తేటతెల్లమవుతున్న నేపథ్యంలో మిగతా 9 కేంద్రాల లావాదేవీల్లో ఎంత లూటీ జరిగి ఉంటుందోనని, అందులో ఎవరికెంత అంది ఉంటుందన్న విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. తరుగు పేరిట కోత విధించిన ధాన్యంతో సంబంధం లేకుండానే మూడు కొనుగోలు కేంద్రాలలో 36 వేల బస్తాలను రైతులు అమ్మకున్నా, కొనుగోలు చేసినట్లు మాయాజాలం చేశారు. రికార్డుల్లో ఓ విధంగా, విచారణకు వచ్చిన వారిస్తున్న వాంగ్మూలం మరోవిధంగా ఉండగా, పీఏసీఎస్‌ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం, పారాబాయిల్డ్‌ మిల్లర్లు అధికారులకు చెబుతున్నది విరుద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ విచారణాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది.


పీఏసీఎస్‌ డైరెక్టర్లతో సమావేశమైన డీసీవో 

సిద్దిపేట జిల్లా డీసీవో చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం చేర్యాల సొసైటీ కార్యాలయంలో పీఏసీఎస్‌ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి విచారణ చేపట్టారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు తెలిపారు. ఈ సంద్భంగా పీఏసీఎస్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అమృతసేనారెడ్డి, సీనియర్‌ ఇన్స్‌పెక్టర్‌ రాజశేఖరవర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ గిరిధర్‌ విచారణలో పాల్గొన్నారు. ఈవిషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.