అమ్మచెట్టుపై ‘చిలుక’ ఎగిరిపోయింది!

ABN , First Publish Date - 2020-11-22T05:57:49+05:30 IST

‘కవిత్వమంటే.../కనిపించే అక్షరాలు/ వినిపించే శబ్దాలు మాత్రమే కాదు/ కవిత్వమంటే/ రెండు విరుపులు/ రెండు చెరుపులు మాత్రమే కాదు/కవిత్వమంటే...

అమ్మచెట్టుపై ‘చిలుక’ ఎగిరిపోయింది!

‘కవిత్వమంటే.../కనిపించే అక్షరాలు/ వినిపించే శబ్దాలు మాత్రమే కాదు/ కవిత్వమంటే/ రెండు విరుపులు/ రెండు చెరుపులు మాత్రమే కాదు/కవిత్వమంటే/ పందిరి మీదకు ద్రాక్షను పాకించడం.../ పద్మవ్యూహంలో నుండి బయట పడే ప్రయత్నం చేయడం..’


– అంటూ కవిత్వాన్ని నిర్వచించిన ‘అమ్మచెట్టు’ కవి దేవిప్రియ జీవితాంతం కమ్మని కవిత్వం రాసి, ప్రపంచ పద్మవ్యూహం నుండి బయటపడే ప్రయత్నం చేసి, విజయం సాధించి – ‘భీతావహ మృత్యువు కంకాళ హుంకారాన్ని/ ధిక్కరించే దొకటుంది/ నెత్తురోడుతున్నా తల వంచని నా ఆత్మగౌరవం ప్రతిపత్తి!’ – అంటూ ఆత్మగౌరవంతో ఆదర్శ కవిగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా బతికి నిశ్శబ్దంగా కన్ను మూశారు.


ఆయన కవిత్వంలో పదాడంబరం ఉండదు. పదలాలిత్యం ఉంటుంది. భావాల అస్పష్టత ఉండదు. భావగాంభీర్యం ఉంటుంది. ‘‘తెలుగులో శివసాగర్‌, వరవరరావుల తరువాత బలమైన ఒకే ఒక రాజకీయ కవి దేవిప్రియ’’ అని ఖాదర్‌ మొహియుద్దీన్‌ అనడంలో అతిశయోక్తి లేదు. గజ్జల మల్లారెడ్డి ‘అక్షింతలు’ శీర్షికలా దేవిప్రియ ‘రన్నింగ్‌ కామెంటరీ’ ఎంత పాపులర్‌ అయ్యిందో తెలుగు పత్రికా పాఠకులందరికీ బాగా తెలుసు. జర్నలిస్టు కావడం వల్లనేమో అతని వస్తుదృష్టి వైవిధ్యపూరితమై, నవ్యాభివ్యక్తి రంజితమై శోభిల్లింది.


‘నాకు/ఆస్ట్రేలియా అబోరిజనుల/ఆది మూలాలు కావాలి/దండకారణ్య సంతాన సంకేతాల/అంబుల పదునూ కావాలి/నాకు/సకల జనుల సమస్త జాతుల/శాంతి కావాలి/శాంతి కోసం/అనివార్యంగా జరిగే యుద్ధమూ కావాలి’


– అంటూ విశాల వస్తు కాన్వాస్‌పై అద్భుత కవితా చిత్రాలు ఆవిష్కరించిన జర్నలిస్టు కవి ఆయన. జర్నలిస్టు కవి అని ఎందుకంటున్నానంటే, దేవిప్రియ ప్రతి వాక్యంలో అంతర్లీనంగా కవిత్వం ఉంటుంది. ఆయన వృత్తిలో ప్రవృత్తిగా ఉన్న కవిత్వం రన్నింగ్‌ కామెంటరీలో కూడా వేమన లాంటి పదునైన అభివ్యక్తి, వ్యంగ్యం కవిత్వమై భాసించింది.


‘పత్రికా స్వాతంత్య్రమంటే/ పరమ చులకన దొరలకి,/కాలం కత్తుల మీద కోపం/తుప్పు పట్టిన ఒరలకి’’– అంటూ వ్యంగపు కవితాస్ర్తాలు సంధించిన కలం యోధుడు దేవిప్రియ. ‘నేనింకా కలలు కంటున్నాను/నేనింకా నన్ను నేను తొలుచుకుంటున్నాను/నేనింకా అనుక్షణం దహనమవుతున్నాను/నేనింకా నిరంతరం మునిగి తేలుతున్నాను/పద్యం రాసిన ప్రతిసారీ/నేనిప్పటికీ భస్మమై మళ్ళీ రూపొందుతున్నాను’


– అంటూ కవిత్వం కోసం తన్ను తాను దహించుకొని ‘గాలి రంగు’ రుచి, వాసనలు పసిగట్టి పూలపరిమళంలాంటి అద్భుత కవిత్వం పండించిన తోటమాలి దేవిప్రియ. జర్నలిస్టులుగా పని చేసిన కవులకు జనసంబంధాలతో పాటు జనబాహుళ్యపు బాధలు బలమైన వస్తువులై, నవ్యమైన అభివ్యక్తి శిల్పాలై ప్రకాశిస్తాయి. దేవిప్రియ విషయంలో అదే జరిగింది.


‘అమృత్‌సర్‌ నుంచి అయోధ్య/భగల్‌పూర్‌ నుంచి భాగ్యనగరం,/రక్తసిక్త రహదారులన్నీ కలగాపులగంగా కలిసిపోయి/పౌరాణిక శూద్రఘోష/మంత్రమధుర దళిత భాష’ అంటూ చారిత్రక విద్రోహాలను కవితాశిల్పాలుగా చెక్కిన అభ్యుదయ కవి ఆయన శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదన్న శ్రీశ్రీ కవితాపాదాలను ఒంటబట్టించుకున్న కవి గనుకే దేవిప్రియ; ‘విరిగిపడిన జొన్నచేను మధ్యలో/మంచెమీద నిలువెత్తున నిలబడి/రివ్వున వడిసెల తిప్పుతున్న మనిషి కావాలి’అంటూ చెమటోడ్చే స్వేద సౌందర్యాన్ని గానం చేశారు.


దేవి ప్రియ కవిత్వంలో అరుదైన ప్రతీకలు దర్శనమిస్తాయి. ‘అమ్మచెట్టు’ ‘తుఫాను తుమ్మెద’ ‘చేపచిలుక’ ‘గంధకుటి’ ‘గాలిరంగు’ ‘అరణ్యపురాణం’ లాంటి పదబంధాలు ఆయన కవితాసంపుటాల శీర్షికలై దేవిప్రియను ఇతర కవులకు భిన్నమైన కవిగా నిలబెట్టాయి. 


దేవిప్రియ జీవితం పూలబాట కాదు. అలా అని అది పూర్తి ముళ్ళబాట కాదు. పూలు, ముళ్ళు, రాళ్ళు కలగలిసిన విచిత్ర అనుభవాల అనుభూతుల అతుకుల గతుకుల బతుకుబాట. దశాబ్దాల కవిత్వ వ్యాసంగం, అలుపెరుగని జర్నలిజంతో ముడిపడిన ఒక చైతన్య ప్రవాహం ఆయన జీవితం. జీవితంలో పేదరికం, కష్టాలు నష్టాలు ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసారు. ఆ క్రమంలోనే ఒక అద్భుత కవిగా పరిణామం చెందారు.


‘చూడండి/నేను నా ప్రజలతో నిర్మించబడ్డ కవిని’/ అని నిరహంకారంగా చెప్పుకున్న ఈ కవి; ‘దేవతలకి స్వర్ణకలశాలతో/పంచామృతాలతో అభిషేకాలు చేశాం/కాని సోదరా../మనిషి మాలిన్యాన్ని/ఇన్ని నులివెచ్చని కన్నీళ్ళతో/ కడిగి శుభ్రం చేయలేకపోయాం’ అంటూ బాధపడిన ఒక మానవతామూర్తి దేవిప్రియ.


‘కవిత్వం నన్ను పట్టుకుంది. మిగిలినవి నన్ను కవిత్వంలా పట్టుకోలేక పోయాయి’ అంటూ అవసరాల నిమిత్తమే నేను పత్రికల్లో పనిచేశానని చెప్పుకున్న నిజాయితీ, నిష్కళంక కవి ఆయన. పత్రికల్లో నిరంతరం టెన్షన్‌ వాతావరణంలో పని చేస్తూ అద్భుత కవిత్వం రాయడం అసిధారావ్రతం అని ఎందరికి తెలుసు? అయినా దేవిప్రియ ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, మనోరమ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్‌ మిర్రర్‌, హెచ్‌యంటివి, 10టివిల్లో వివిధ హోదాల్లో పని చేస్తూనే ఎన్నోకవితా సంపుటాలు, గ్రంథాలు ఆవిష్కరించారు. అమ్మచెట్టు (1979) నీటిపుట్ట(1990), తుఫాను తుమ్మెద(1999), పిట్టకూడా ఎగిరిపోవలసిందే(2001), చేప చిలుక(2005), ఎందుకుంటుంది(2009), గాలి రంగు(2011)ఇం..కొకప్పుడు ఆయన వెలువరించిన కవితా సంపుటులు. ‘గాలిరంగు’ కవితా సంపుటికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. దేవిప్రియ రాసిన ‘సమాజానంద స్వామి’(1977), ‘రన్నింగ్‌ కామెంటరీ’(మూడు సంపుటాలు)జర్నలిస్టుగా దేవిప్రియ సత్తా ఏమిటో నిరూపించిన రచనలు. ఆయనలో ఉన్న సున్నిత హాస్య, వ్యంగ్య, చమత్కార చతురతను పలు కోణాల్లో ఆవిష్కరించిన గ్రంథాలవి.


ఇక దేవిప్రియ సినిమా రంగానికి కూడా తన సృజనపరిమళాలు అద్ది ఔరా అనిపించుకున్నారు. ‘దాసి’, ’రంగుల కల’ లాంటి సినిమాలకు స్ర్కీన్‌ ప్లే, పాటలు రాసి పలువురి ప్రశంసలందుకున్నారు. దేవిప్రియ ఎంత ఎత్తుకెత్తుకెదిగినా అమ్మచెట్టును మరువలేదు, మూలాలను స్మృతిపథం నుండి తుడిచేయలేదు.


‘కలుపు తీయడానికి పోయినపుడు/కందిన నా వేళ్ళు చూసి/ఎట్టా బతుకుతావురా అని ఏడ్చేసింది మా అమ్మ’ అంటూ అమ్మను తలచుకొని కవిత్వమై కరిగిపోయాడు. జీవిత చరమాంకంలో భార్యను కోల్పొయి కృంగి పోయారు. అకాడమి అవార్డు కొంత ఊరట నిచ్చినా... అనారోగ్యం ఆయనను వెంటాడింది.


‘మరణమే నీ యథార్థ ఛాయ’ అని చెప్పుకున్న ఈ తాత్వికుడు నిష్కళంక కవి. పసిబాలుడిలా కె.శివారెడ్డి వెంట నడిచొచ్చినపుడల్లా నాకు నేలపై జంట సూర్యుళ్ళు నడిచొచ్చినట్టు అనిపించేది. ఏ సాహితీ సభల్లో వారిద్దరినీ చూసినా దశాబ్దాల కవిత్వం వారి ముఖాల్లో బాగా పండిన పండులా ఘుమఘుమలాడేది. అలాంటి చెలిమి జంటలో శివారెడ్డిగారిని ఒంటరిగా వదిలి దేవిప్రియ, ‘పాటలు పాడే/పెంపుడు పసిరిక పాముని/కాళ్ళకు చుట్టుకున్న/నా వాగుతో కలిసి/కుంకుతున్న పొద్దులోకి/సముద్రం మీద అడుగులు వేసుకుంటూ/నడిచిపోతాను’ అంటూ శాశ్వతనిద్రలోకి వెళ్ళిపోయారు.

బిక్కి కృష్ణ

Updated Date - 2020-11-22T05:57:49+05:30 IST