డోన్‌ ఐసోలేషన్‌లో విచిత్ర పరిస్థితి

ABN , First Publish Date - 2020-04-09T10:59:16+05:30 IST

జ్వరంతో బాధపడేవారు పరీక్ష నిమిత్తం ఐసొలేషన్‌కు వెళ్తున్నారు. కరోనా అనుమాన లక్షణాలు ఉన్నవారు అక్కడే ఉండేందుకు

డోన్‌ ఐసోలేషన్‌లో విచిత్ర పరిస్థితి

డోన్‌, ఏప్రిల్‌ 8: జ్వరంతో బాధపడేవారు పరీక్ష నిమిత్తం ఐసొలేషన్‌కు వెళ్తున్నారు. కరోనా అనుమాన లక్షణాలు ఉన్నవారు అక్కడే ఉండేందుకు సిద్ధపడుతున్నారు. అయితే క్వారంటైన్‌ అవసరం లేదని వారిని తిరిగి పంపించేస్తున్నారు. దీంతో డోన్‌ ఐసొలేషన్‌లో విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. పట్టణ సమీపంలోని మోడల్‌ స్కూల్‌లో ఐసొలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పట్టణం, గ్రామాల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఐసొలేషన్‌ కేంద్రానికి పంపిస్తున్నారు. అయితే అక్కడ ఐసొలేషన్‌లో పరిశీలనలో ఉంచకుండా తిరిగి పంపించి వేస్తున్నారని పలువురు వాపోతున్నారు.


వాస్తవానికి పట్టణంలో పాజిటివ్‌ వచ్చిన యువకుడికి ఐసొలేషన్‌ కేంద్రంలో పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని పంపించి వేశారు. చివరకు జిల్లా కేంద్రం నుంచి ఫలానా వ్యక్తిని ఐసొలేషన్‌లో పెట్టాలని ఇన్‌చార్జి డాక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ యువకుడిని ఐసొలేషన్‌లో పెట్టి శాంపిల్స్‌ తీసి పంపారు. చివరకు పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి వచ్చాడు. జర్వం, దగ్గుతో బాధపడుతున్నాడు. ఐసొలేషన్‌లో ఉంటానని, శాంపిల్స్‌ తీసుకోవాలని కోరాడు. అయితే ఏమీ అవసరం లేదని తిరిగి పంపించి వేశారు. ఇలా అనుమాన లక్షణాలు ఉన్న పలువురు ఐసొలేషన్‌కు వెళ్లినా తిరిగి పంపించి వేస్తుండటంపై వైద్య, ఆరోగ్య సిబ్బంది అందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-09T10:59:16+05:30 IST